అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’ | ABK Prasad Article On US Black Lives Matter | Sakshi
Sakshi News home page

అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’

Published Tue, Jun 9 2020 1:03 AM | Last Updated on Tue, Jun 9 2020 1:05 AM

ABK Prasad Article On US Black Lives Matter - Sakshi

యూరప్‌ను ఒక భూతం ఆవరించింది. అదే కమ్యూనిజం అనే భూతం. ఈ భూతాన్ని నాశనం చేయడానికి అటు పోపూ, ఇటు జార్‌ చక్రవర్తి (రష్యా) అటు మెటర్నిక్‌ (ఆస్ట్రియా) యిటు గీడో (ఫ్రాన్స్‌), అటు ఫ్రెంచి ‘రాడికల్స్‌’ (పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరిచిన శక్తులు), ఇటు జర్మన్‌ పోలీసు గూఢచారులు ఒక్క మాటలో యూరప్‌లోని పురాతన అధికార శక్తు లన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి. కాని, ధనిక వర్గ సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది. సోషలిస్టు (కమ్యూనిస్టు) సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తుంది. ధనిక వర్గ సమాజంలో పెట్టుబడికి స్వాతంత్య్రమూ, వ్యక్తిత్వమూ ఉంటాయి. కాని ప్రాణం ఉన్న మనిషికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మాత్రం ఉండవు.– 172 ఏళ్ళనాటి సుప్రసిద్ధ కమ్యూనిస్టు మేనిఫెస్టో

త్వరలోనే రాజకీయ, ఆర్థిక కారణాల అంశంపైన మరో ప్రపంచ యుద్ధం అవకాశం కనిపిస్తోంది.– ప్రొఫెసర్‌ రాన్‌ ఉంజ్‌

అదే ‘భూతం’ వర్తమాన కాలంలో కూడా నవ చైనా రూపంలో అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాల పాలకవర్గాలను వెంటాడుతోంది. ఈసారి ఆ ‘భూతం’ 30 ఏళ్ళనాటి సుప్రసిద్ధ తియనాన్మెన్‌ (బీజింగ్‌) స్క్వేర్‌లో జరిగిన చైనా పాలకవర్గంలోని తీవ్ర సిద్ధాంత ఘర్షణల నిరసన ప్రదర్శనలనుంచి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైంది. ప్రపంచవ్యాపితంగా అల్లుకుపోయి లక్షలాదిమంది మరణాలకు దారితీస్తూ, శాస్త్రవేత్తలు, జీవశాస్త్ర సాంకేతిక నిపుణులకు సహితం అంతుచిక్కని సరికొత్త కరోనా వైరస్‌ ఆవిర్భావ కారణాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ చర్చల్లో నేడు ప్రపంచ ఆర్థిక వ్యవ స్థలో రాజకీయంగానూ, ఆర్థిక ప్రగతిలోనూ అమెరికాకు సవాలుగా మార్చిన నవచైనాతో, అమెరికా పాలకులు తట్టుకొని నిలబడగల శక్తిని వేగంగా కోల్పోతున్నారు. అందుకే ఆర్థిక రంగంలోనూ, రాజకీయ వ్యూహ రచనలోనూ, ప్రపంచ సామ్రాజ్యవాద శక్తిగా ఉన్న అమెరికా వరసవారీగా దెబ్బతింటోంది. ప్రపంచంలోని 90కి పైగా దేశాలలో, స్థావరాలను, సైనిక నివాసాలను దశాబ్దాల తరబడిగా సాకుతున్న అమెరికా ఆర్థికంగా కుంగిపోతున్న దశలో, దాని సైనిక పారిశ్రామిక వ్యవస్థ ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం తరువాత వేగంగా కుంగి పోతోంది.

ఈ తరుణంలో కరోనా వైరస్‌ చైనాలో పొడసూపి మహమ్మారిగా అది ప్రపంచవ్యాప్తంగా అల్లుకుపోవడంతో ఆ వైపరీత్యాన్ని ఆసరాగా తీసుకొని పతనమవుతున్న తన ఆర్థికసామ్రాజ్యాన్ని, రాజకీయ ఆధిప త్యాన్ని కోల్పోవడానికి అమెరికా సామ్రాజ్యపాలకులకు ఇష్టంలేదు. అందుకు దొరికిన తాజా భూతం నవ చైనా. కరోనావ్యాప్తికి ముందు సుమారు ఒక సంవత్సరకాలంగా (2018–19) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘అమెరికాలో క్రమంగా మళ్ళీ సోషలిస్టు శక్తులు యువత రూపంలో పెరుగుతున్నాయి. వీటిని అమెరికా అదుపు చేసు కోవాల్సిన అవసరం ఉంద’ని ఒకటికి రెండుసార్లు ప్రకటించిన సంగతి గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఒక సామ్రాజ్యశక్తిగా, సైనిక– పారిశ్రామిక జమిలి శక్తిగా అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మనం మరవ రాదు. ఈ సంక్షోభానికి తాజా పరాకాష్టే అమెరికాలో నల్లజాతి ప్రజల పైన (అమెరికన్, ఆఫ్రికన్లు) ట్రంప్‌ సమక్షంలో సాగుతున్న పాశవిక దమనకాండ జార్జిఫ్లాయిడ్‌ హత్య. సరిగ్గా ఈ దశలోనే కరోనా చాటున దాగి ప్రపంచ దేశాలనుంచి చైనాను వేరుచేసి ద్రోహిగా చూపడం కోసం ట్రంప్‌ ఆడిన, ఆడుతున్న పెద్ద నాటకం– కరోనా వైరస్‌ సృష్టి పరిశోధనాగారాలలోనే జరిగిందని, దాన్ని చైనా గోప్యంగా ఉంచిందని ఆరోపించడమూ, దాన్ని నమ్మించడానికి ఆ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా, ఐక్యరాజ్యసమితిపైనా పదే పదే ఒత్తిడి చేసి, చైనాపై ‘క్రిమినల్‌ చర్యలు’ తీసుకోవాలని కోరడమూ జరుగుతూ వచ్చింది. 

అటు సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థా ఆదినుంచీ చైనా తమకు కరోనా వైరస్‌ లక్షణాలను, అది వ్యాప్తి చెందుతున్న తీరును గురించి పూసగుచ్చినట్టు చెబుతూనే వస్తూ, హెచ్చరించిందని బాహాటంగా ప్రకటించాయి. ఈలోగా కరోనా వైరస్‌ పుట్టిన ఒకే ఒక రాష్ట్రంలో ఆ వ్యాధిని, దాని వ్యాప్తినీ నిరోధించగల్గింది చైనా. మరణాల సంఖ్యనూ అది దాచలేదు. కానీ వైరస్‌ నిరోధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సకల ప్రయత్నాలు చేయకపోగా ఎప్పుడో నవంబర్‌లో రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ‘గెలుపుగుర్రం’గా తిరిగి అవతరించాలన్న ‘ఆబ’ కొద్దీ వైరస్‌ వ్యాప్తి నిరోధంపై దృష్టి కేంద్రీకరించని ఫలితంగా మర ణాల సంఖ్యలో కూడా ‘అగ్ర రాజ్యం’గా ప్రపంచం ముందు నిల బడాల్సి వచ్చింది. అది చాలక, తన మాట విని చైనాను వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ‘శిక్షించి’ వెలెయ్యకుండా ఉన్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, ఐక్యరాజ్యసమితికి తన వాటాగా ఇవ్వవలసిన నిధులను కొంత కోత కోసింది అమెరికా. అంతేగాదు, యూరోప్‌ దేశాధిపతు లను రెచ్చగొట్టి వారితో చైనా వ్యతిరేక కూటమిగా ఏర్పడి చైనాపై యుద్ధానికి సన్నద్ధమవుతోంది. 

అటో ఇటో తేల్చుకోలేని ఊగిసలాటలో మన పాలకులున్నారు. దక్షిణాసియాలో ఏదో రూపంలో ‘కుంపటి’ పెట్టడం ద్వారా.. ఆసియా స్వతంత్ర రాజ్యాలు, ప్రపంచ జనాభాలో అగ్ర రాజ్యాలుగా ఉన్న భారత్‌–చైనాలను తన సామ్రాజ్య ప్రయోజనాల కోసం యుద్ధంలోకి దించగల సాహసానికి అమెరికా పాలకులు సిద్ధపడరని భావించడం కూడా పొరపాటే అవుతుంది. కరోనా వైరస్‌ బయటపడటానికి ఒక నెలరోజుల ముందే వుహాన్‌ సమీపంలో జరిగిన ప్రపంచ దేశాల సైనిక విన్యాసాల సందర్భంగా 300 మంది అమెరికా సైనికులు చైనాలో ప్రవేశించిన సమయంలోనే.. అటు అమెరికాలో పరిమిత సంఖ్యలో ఏర్పాటైన ఒక రహస్య సదస్సులో వైరస్‌ క్రిమిని శాస్త్ర పరిశోధనా    గారంలో ఎలా సృష్టించవచ్చునో సృష్టించి చూపి దానికి ‘ఈవెంట్‌– 201’ అని ఎలా నామకరణం చేశారో వెల్లడయిందని మరచిపోరాదు. ఈ రహస్య ప్రయోగానికి డబ్బు సమకూర్చినవాడు అమెరికా మహా కోటీశ్వరుడు బిల్‌గేట్స్, మిలెండా ఫౌండేషన్‌. ఈ రహస్యాన్ని దాచ బెట్టి కరోనా వైరస్‌ చైనీస్‌ పరిశోధనాగారం నుంచి వెలువడి వ్యాప్తి చెందినదేనని ట్రంప్‌ ‘బూకరించడాన్ని’ చైనా పాలకులు ఖండిస్తూ విన్యాసాల్లో పాల్గొన్న అమెరికా సైనికుల నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందని ప్రకటించాల్సి వచ్చింది.

ఇదే రకమైన తంతు సుమారు ముఫ్పైయ్యేళ్లనాడు తియనాన్మెన్‌ స్క్వేర్‌వద్ద ఘర్షణలప్పుడూ అమెరికా పాలకులూ, కొన్ని పత్రికలూ నడి పాయి. నవ చైనాలో సిద్ధాంత ఘర్షణల్లో భాగంగా తియనాన్మెన్‌ స్క్వేర్‌లో జరిగిన ఉభయ వర్గాల మధ్య కుమ్ములాటలు, నిరసన ప్రదర్శనల సందర్భంగా ‘వేలాదిమందిపైన చైనా సైన్యం కాల్పులు జరపగా వందలు, వేలమంది చనిపోయారన్న అమెరికా, యూరప్‌ నాయకుల ప్రచారాన్ని మరెవరో కాదు ఆ ఘటనలను రిపోర్ట్‌ చేసిన అమెరికా, యూరోపియన్‌ ప్రసిద్ధ పత్రికలే ఖండిస్తూ నాడు వార్తలు ప్రకటించాయన్న సత్యాన్ని కూడా మనం కాదనలేం. ఉదాహరణకు చిన్నా, చితకా జర్నలిస్టు కాదు, ప్రముఖ వాషింగ్టన్‌ పోస్ట్‌కు బీజింగ్‌ (చైనా) బ్యూరో చీఫ్‌గా ఉన్న జే. మాథ్యూస్‌ తియనాన్మెన్‌ స్క్వేర్‌లో (1989 జూన్‌ 6) ఆ రోజున ఏం జరిగిందీ పూసగుచ్చినట్టు వెల్లడిం చాడు. ఆ వ్యాసానికి ఆయన ‘తియనాన్మెన్‌ కల్పిత గాథ’ అన్న శీర్షిక పెట్టాడు. పనిగట్టుకుని ప్రచారంలో పెట్టి అభాసుపాలైన కల్పిత ఊచ కోతలు. ఆనాటి ఘటనలు మీడియా చేతివాటం. పూర్వాపరాలు తెలి యక గందరగోళపడిన పాశ్చాత్య విలేకరుల పని, నిజాయితీకి కట్టు బడని ప్రచారం. ఇది ప్రమాణాలు గౌరవించే మీడియా విలేకరులు చేయకూడని పని. ఆనాడు సిద్ధాంత తగాదాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థులు కొంతసేపైన తర్వాత, చౌకు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మూకుమ్మడి హత్యలన్న కథనం ‘చిల్లర చేష్ట’ అని మాత్యూస్‌ వర్ణించాడు. మాథ్యూస్‌ స్వీయానుభవంతో రాసిన ఈ కథనాన్ని మీడియా జర్నలిజానికి తలమానికంగా భావించే సుప్రసిద్ధ ‘కొలంబియా జర్నలిజం రివ్యూ’ పత్రికలో కూడా ప్రచురించారు (1998). 

అయినా గత 20 ఏళ్లుగా ప్రధాన స్రవంతికి చెందిన పత్రికలను తాను చదువుతున్నానని, కానీ తియనాన్మెన్‌ ‘భూతం’ మాత్రం మనకి క్కడి ‘పచ్చమీడియా’ లాంటి అక్కడి పత్రికల్ని వదలడం లేదన్నది మాథ్యూస్‌ భావన. చైనా ప్రభుత్వంలోని అధికారులెవరికీ తెలియక ముందే, నెల రోజుల ముందే ‘మన రక్షణశాఖ గూఢచార సంస్థలకు తెలిసి ఉంటే ముందస్తుగానే దివ్యజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానం గలవారై ఉండాలని’ఎత్తిపొడుస్తూ ప్రసిద్ధ అమెరికన్‌ పరిశోధకుడు ప్రొఫెసర్‌ క్రీగ్‌.. ‘పొరుగింటికి నిప్పుపెట్టి ఆనందించే వాళ్లు కొందరుంటారు. తాము రహస్యంగా నిర్వహించే దహనకాండ గురించి ముందస్తుగానే ఎలాగూ వాళ్లకి తెలిసి ఉంటుంది. ఇలాంటి వాళ్లకీ అమెరికా గూఢచార సంస్థలకూ అలాంటి దివ్యజ్ఞానమేదో ఉండి ఉండాల’ని ఓ చురక అంటించాడు. అంతేగాదు, డేర్‌డ్రీ గ్రిస్పోల్డ్‌ అనే అమెరికన్‌ వ్యాఖ్యాత రాస్తూ ‘తియనాన్మెన్‌ స్క్వేర్‌లో వందలు, వేలాదిమంది విద్యార్థుల ఊచ కోత పచ్చి నీలివార్త అని అమెరికా ప్రభుత్వానికి కూడా తెలుసున న్నాడు. బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ ప్రభుత్వానికి పంపిన నివేదికలలో తియనాన్మెన్‌ కథనం నిజం కాదని చెప్పినట్లు తదనంతర కాలంలో వికీలీక్స్‌ మీడియా ప్రకటించింది. తరువాత ‘న్యూయార్క్‌ టైమ్స్‌’, లండన్‌ ‘టెలిగ్రాఫ్‌’ కూడా మరోసారి ఇదే విషయాన్ని తెలిపాయి. తియనాన్మెన్‌ ఘటన ప్రదర్శనకారుల్ని చెదర గొట్టడానికి గాలిలోకి తుపాకులు పేల్చిన ఘటన మాత్రమేనని అవి రాశాయి. మొత్తంమీద చైనాకు వ్యతిరేకంగా మరోసారి పెట్టుబడి కూటాలు కట్టుకడుతున్నాయి.


ఏబీకే ప్రసాద్‌
, సీనియర్‌ సంపాదకులు 
(abkprasad2006@yahoo.co.in)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement