పేదవాళ్లు పేదవాళ్లుగా ఉండటం వల్లే గొప్పవాళ్లు గొప్పవాళ్లుగా ఉన్నారు, అవును ప్రభూ! ఎప్పుడు నీవు సుఖంగా ఉండటం చూశాం గనక!
– మత్తయి సువార్త
‘‘కరోనా వల్ల మేం చావొచ్చు, చావకపోవచ్చు నేమో కానీ తాళలేని ఆకలితో చావడం మాత్రం ఖాయం’’
– కమలేష్ కుమార్, లూథియానా
మంచో, చెడో.. ఒక్కో పరిణామం ఒక్కో సదవకాశం కల్పిస్తుంది. అలాంటిదే కరోనా వైరస్. దాని నిర్మూలన సంగతేమో కానీ, దాని చాటున అంతకుముందు దేశ ఆర్థిక రంగంలో కొందరు పాలకులు బాహాటంగా చేయలేని నిర్ణయాలను ప్రకృతి వైరస్ రూపంలో కల్పిం చిన అవకాశం చాటున జయప్రదంగా అమలు చేయడానికి సాహసి స్తారు. అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహరచన చేశారు.
ఆ వ్యూహం దేశ ఆర్థికరంగంపై ఎక్కుపెట్టిన పెద్ద పాశుపతాస్త్రం! దాని ముద్దుపేరు ఆర్థికరంగ పునరుద్ధరణ కోసం తలపెట్టిన మహా ‘ఉద్దీపన’ పథకం. వాస్తవానికి ఇలాంటి నర్మగర్భ ఉద్దీపనకు అమెరికా ఉద్దీపనలతో ఉపదేశాలతో నడుస్తున్న ప్రపంచ బ్యాంకు సంస్కరణ లను ఎలాంటి షరతులు లేకుండానే ఆమోదించి పాతికేళ్లనాడే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు పాలకులుగా ఆమోదం తెలిపారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ నాయకులూ తలలూపినవాళ్లే. బీజేపీ వాజ్‌పేయి ప్రధా నిగా అధికారం చేపట్టినా వరల్డ్ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణలు అమలు జరపడంలో వెనుకంజ వేయనేలేదు.
ఆ తరువాతి కాలంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ (ఆరెస్సెస్) నరేంద్రమోదీ ప్రభుత్వమూ ఆ ప్రజా వ్యతిరేక ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను తిర స్కరించి దేశవాళీ స్వతంత్ర ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడానికి గజ్జె కట్టిందీలేదు. ‘దేశవాళీ’ అంటే ‘కంగాళీ’ కాదు. కరోనా కల్పించిన అవకాశాన్ని చాటు చేసుకునైనా ఆర్థికరంగ ఉద్దీపన కోసం లేదా ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాల దృష్ట్యానైనా భారీ ఎత్తున స్థిరపడి ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను, వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. కానీ, ఆ రంగాన్ని కాస్తా కరోనా ముసుగులో చాపచుట్టి ఆదినుంచీ బీజేపీ ఏ లక్ష్యాన్ని నెరవేర్చజూస్తోందో.. ఆ ప్రైవేట్ రంగ గుత్తేదారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసి, దేశంలో స్థిర పరిచేందుకు సిద్ధమైంది.
అందుకు అనుగుణంగా స్వావలంబన లేదా స్వయంప్రకాశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం పేరిట, కరోనా దాడికి గురైన దేశ ప్రజాబాహుళ్యాన్ని ఆ దాడినుంచి బయటపడేయడానికి రూ. 20 లక్షల కోట్లతో బాధిత భారతదేశానికి ఒక ఉద్దీపన పథకం ప్రవేశపెట్టారు. ఇది దేశ జాతీయో త్పత్తుల విలువలో పది శాతం అని చెప్పారు. కానీ ఆచరణలో దీని విలువ, అంటే కరోనా దెబ్బవల్ల చితికిపోయిన రంగాలకు కేంద్రం అందించే ఉద్దీపన బంగీ పథకం విలువ దేశం మొత్తం జాతీయో త్పత్తుల విలువలో కేవలం ఒక్క శాతం (1%)పైన మాత్రమేనని ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులూ ప్రకటించారని మరిచిపోరాదు.
అలాగే స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే తమ ధ్యేయమని చెబుతూనే మోదీ చాపకింద నీరులా ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో, ఇంతవరకు ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా (లోపాలమధ్యనే) ఉన్న ప్రభుత్వ రంగాన్ని తొలగింపజేసి దేశ విదేశీ గుత్తపెట్టుబడిదారుల దోపిడీకి ఆహ్వానం పలికే ఉద్దీపన కార్యక్రమం ఇది. అలా కాకుంటే కరోనాకు ముందు తన అమెరికా యూరప్ దేశాల పర్యటనల్లో ‘విదేశీ పెట్టుబడి వర్గాలు వాస్కోడిగామాలై ఇండియాకు తరలిరండి’ అని మోదీ ప్రకటించి ఉండేవారు కాదు.
దేశీయంగా చూస్తే స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇంతకాలం ప్రధానంగా వెన్నెముకగా నిలబడుతూ వచ్చిన (అనేక ఆటంకాల మధ్యనే) ప్రభుత్వరంగ వ్యవస్థకు ఎసరు పెడుతున్నారు. దేశంలోని అన్ని కీలక రంగాలను, వ్యవసాయం, విమానయానం, ఎయిర్‌క్రాఫ్ట్ మరమ్మతుల పరిశ్రమ, రక్షణ శాఖ విమానాలు, అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో, సామాజికంగా అవసరమైన కీలక మౌలిక వనరులూ, ప్రైవేట్ రంగంలోని కంపెనీలకు నిధుల పెంపు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విమానాశ్రయాలు వేలంవేసి ప్రైవేట్ రంగానికి అప్పగించడం, రక్షణశాఖ ఉత్పత్తులు, అంతరిక్ష కార్యక్ర మాల్లో స్వేచ్ఛగా పాల్గొని ప్రయోగాలు చేసే ప్రైవేట్ సంస్థలకు ఈ ‘ఉద్దీపన’ అంతర్భాగం.
నిన్నటి ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇండి యాకు వచ్చి సరుకుల ఉత్పత్తికి తోడ్పడమని విదేశీ గుత్త వర్గాలను ఆహ్వానించిన మోదీ– ఇప్పుడు స్వదేశీ, విదేశీ గుత్తేదార్లు ఇద్దరి దోపిడీకి ఉపయోగించే ‘ఉద్దీపన’ కార్యక్రమానికి తెరలేపారు. బహుశా స్వాతంత్య్ర సమరయోధులు, ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు గాంధీజీ, బటుకేశ్వరదత్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్‌లు, లోక మాన్య తిలక్ ఆశించిన స్వావలంబన, పాలనా విధానాలు, పద్ధతులూ అందుకు పూర్తిగా విరుద్ధం.
‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా స్వదేశీ, విదేశీ పెట్టుబడి వర్గాలు ప్రజలను పీడించే అవకాశం ఉంది’ అన్నాడు భగత్‌సింగ్. కాగా, దేశీ సరుకులు విరివిగా ప్రచారంలోకి వచ్చి వ్యాపారాలు, అమ్మ కాలు, కొనుగోళ్లూ పెరగాలనీ సరుకులకు గిరాకీ, గొలుసుకట్టుగా నిరంతరం అందించాల్సిన సరకుల ఉత్పత్తి రంగాలు పెరగాలని, సరుకుల కోసం ప్రజలనుంచి డిమాండ్ పెరగాలనీ మోదీ కోరుకు న్నారు.
కానీ, ప్రజలలో సరుకుల కోసం డిమాండ్ పెరగడానికి వారి చేతిలో పైసలు ఆడాలిగదా? పేద ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరి గితే గదా సరుకు అమ్ముడుపోయేది? ఆ శక్తి పెరగాలంటే ఆ శక్తిని అడ్డుకునే దోపిడీ వ్యవస్థ తొలగాలి గదా. ఎందుకంటే కోరికలు పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాలందరికీ ఉంటాయి. కానీ, వాటిని నెరవేర్చుకునే శక్తి కేవలం సరుకుల ఉత్పత్తి లేదా వాటి అధికోత్పత్తి పెరిగితేనే చాలదు. ఇది నిజం కాకపోతే– కరోనా బారినపడిన ప్రజల్లో నేడు అత్యధికులు భారీ సంఖ్యలో ఉపాధి కోల్పోయినవారే.
పరాయి పంచల్లో కూలి కోసం, కూటి కోసం అంగలారుస్తూ సొంత ఊళ్లకు కూడా తిరిగి వెళ్లలేక భార్యాపిల్లలతో వందలు, వేల కిలో మీటర్ల లెక్కన పశువులకు వాడాల్సిన కాడీ, మేడిని తాము మోస్తూ, గర్భవతులైన భార్యలను, నడవలేని చిన్నారులను ఎక్కించుకుని దూర తీరాలకు చేరుకునే తహతహలో ఆరాటపడుతున్న వలస కార్మికులు, శ్రమజీవుల సంఖ్య వందలు, వేలూ కాదు అక్షరాలా 14 కోట్లు అని మరచిపోరాదు.
వలస శ్రామికుల దుర్భర జీవితాన్ని కళ్లారా చూస్తూ కూడా కొందరు పాలకులు కొన్ని రాష్ట్రాల్లో చిన్న, మధ్యరకం పరి శ్రమల్లో దినసరి పనిగంటలను 8 నుంచి 12 గంటల దాకా 4 గంటలు అదనంగా పెంచేశారు. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి ఎన్ని కిస్తీలలో ‘కిందెట్టి, మీదెట్టి’ ఉద్దీపన పద్దుల్ని తిరగేసి, మరగేసి చూపినా ఆ రూ. 20 లక్షల ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు దక్కాల్సిన రూ. 5 లక్షల కోట్లు కూడా దక్కకపోవడం మరీ విడ్డూరం. చివరికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కూడా వారి యాదికి రాలేదు.
ఎందుకు రాలేదో అర్థం చేసుకోవాలంటే మనం తెలుగువారి పేద బతుకుల గురించి రాసిన సుప్రసిద్ధ ఆత్మీయ కథకుడు, రైతు నేస్తం రామారావు ప్రతీకాత్మక చిత్రణ ‘ముత్యాల బేరం’ కథను ఆశ్రయిం చాల్సిందే. పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని పెట్టుబడి వర్గాలు లాభనష్టాల తక్కెడలో పెట్టి, ఆ పూర్వ రంగంలో పేద, మధ్యతరగతి వర్గాలను, శ్రామికుల్ని, కష్టజీవుల జీవితాల్ని ఎలా తెలివిగా శాసిస్తారో అందులో చెప్పులుకుట్టే వెంకడి పాత్ర ద్వారా తేటతెల్లం చేశాడు:
‘చెప్పులు కుడుతున్న వెంకడి దగ్గరికి ఒక ముత్యాల వర్తకుడు మధ్యలో తగిలి తన ముత్యాల కోవలు చూపి కొనుక్కోమ న్నాడు. ముద్దకే కరువైన వెంకడు ముత్యాలు ఏం చేసుకుంటాడు? వాటిపైన వెంకడు ఆసక్తి చూపకపోయేసరికి ముత్యాల వ్యాపారి ‘భలేవాడివయ్యా, ఈ ముత్యాలు సముద్రంలోంచి తీసినవయ్యా’ అని వెంకడిని ఉడికించడానికి ప్రయత్నిస్తాడు. అయినా వెంకడు ‘సము ద్రపు ముత్యాలే కావొచ్చు గాక, నాకు వాటి అవసరం లేదు’ అంటాడు. అప్పటికీ సరిపెట్టుకోని వ్యాపారి ‘ముత్యాల కోసం వెతకాలంటే ప్రాణాలు కూడా పోతాయి తెలుసా’ అంటాడు.
అందుకు వెంకడు ‘ప్రాణం పోతే మరి నీ పెళ్లాం, పిల్లల గతేంటి’ అని ప్రశ్నిస్తాడు. అందుకు వ్యాపారి ‘ఆ ఏముందిలెద్దూ, కాసిని కన్నీళ్లు కారుస్తారు లెద్దూ’ అంటూ ముత్యాల సంచి భుజాన పెట్టుకుని బయలుదేర బోతాడు. నీకు పెళ్లాం బిడ్డలమీద శ్రద్ధ లేనప్పుడు ఆ ముత్యాలు నాకిచ్చిపోరాదూ’ అంటాడు వెంకడు. ఇంతలో వ్యాపారి ‘ ఏం కథ, నీ మనసు ఇంతలోనే ముత్యాలపై మళ్లిందేమిటి?’ అంటాడు. అప్పుడు వెంకడు అంటించాడు చురకత్తి లాంటి చురక. ‘నీవు తెచ్చినవి ముత్యాల కోవలన్నావే కానీ కన్నీటి కోవలు అనలేదు గదా’ అని. ఆ వ్యాపారి ఓ నవ్వు నవ్వి ‘ఓరి వెర్రివాడా’ అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఇంతకూ ఈ కథలో నీతి ఏమిటి అంటే.. వ్యాపారికి ముత్యాలు ఒక సరుకు, చెప్పులు కుట్టుకుని బతికే వెంకడికి ముత్యాలు జీవితా వసరం కాదు, తన బతుక్కి అది పరాయి సరుకు. పేదవాడికి కోరిక లుంటాయి. కానీ అవి సరుకుకి పెట్టుబడి నిర్ణయించే ధరనుబట్టి నెరవేరవు. ఈ ‘ట్రిక్కుల’ ద్వారానే పెట్టుబడి పెట్టే ఉత్పత్తిదారు సరుకు సరఫరాకి, ఆ సరుకుపైన లేనివాడికున్న నెరవేరని కోరికకూ (డిమాండ్‌కూ) ముడిపెట్టి పేదవాడి కోరికను అణగదొక్కడమే పెట్టుబడిదారీ సమాజపు లక్షణం. ఈ పరమ వైరుధ్యానికి పక్కా నిదర్శనమే– తాజా మోదీ, నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర భారత్ ఉద్దీపన సారాంశం!
-ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment