సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, భారీ సభలకు ఇప్పుడే అనుమతి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైళ్లకు సైతం ఎర్రజెండా చూపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అన్‌లాక్–3 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల పలు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది.
ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నట్టు మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను ఆగస్టు 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా హాళ్లు, బార్లు, సమావేశ మందిరాలకు ఎప్పటి నుంచి అనుమతి ఇచ్చేది తెలియజేస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఆంక్షలు వీటిపైనే..
► పాఠశాలలు, కళాశాలలు, విద్యా, శిక్షణా సంస్థలు ఆగస్టు 31 వరకు మూసి ఉంటాయి. ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌కు అనుమతి ఉంటుంది. దీన్ని మరింతగా ప్రోత్సహించాలి.
► సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్లు, బార్లు, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాల్స్, ఇదే కోవలోకి వచ్చే ఇతరత్రా అన్నీ మూసి ఉంటాయి.
► యోగా కేంద్రాలు, జిమ్‌లను ఆగస్టు 5 నుంచి తెరిచేందుకు అనుమతిస్తారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ప్రామాణిక నిర్వాహక నియమావళిని(ఎస్‌ఓపీ) జారీ చేస్తుంది.
► హోంశాఖ అనుమతించినవి(వందేభారత్ మిషన్) మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఉండవు.
► ఆగస్టు 31 వరకు మెట్రో రైళ్లకు అనుమతి లేదు.
► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదాత్మక, బోధన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, భారీ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు.
► ఆయా కార్యకలపాలకు అనుమతికి సంబంధించి తేదీలు, ప్రామాణిక నిర్వాహక నియమావళి(ఎస్‌ఓపీ) ప్రత్యేకంగా ప్రకటిస్తారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
పంచాయతీ, మున్సిపల్, సబ్‌డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఎట్ హోం వేడుకలకు అనుమతి ఉంటుంది. ఈ వేడుకల సందర్భంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. హెల్త్ ప్రొటోకాల్స్ పాటించాలి.
కంటైన్‌మెంట్ జోన్ల వరకే నిబంధనలు
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతాయి. కంటైన్‌మెంట్ జోన్లను జిల్లా అధికార యంత్రాంగం గుర్తిస్తుంది. ఆయా జోన్లలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇతరత్రా రాకపోకలకు అనుమతి లేదు. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల బఫర్ జోన్లను కూడా గుర్తిస్తారు.
► కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో గానీ, రాష్ట్రాల మధ్య గానీ రాకపోకలపై ఆంక్షలు విధించరాదు. ఈ ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు.
► 65 ఏళ్ల వయసు పైబడిన వారు, పదేళ్ల లోపు చిన్నారులు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు ఆరోగ్య అవసరాలకు మినహా బయటకు రాకూడదు.
► వివాహ సంబంధిత వేడుకలకు 50 మందికి మించి అనుమతి లేదు.
► అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు.
► బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగ తాగడం, పాన్, గుట్కా తీసుకోవడం నిషిద్ధం.
► అన్‌లాక్–3 మార్గదర్శకాలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment