మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠినంగా లాక్డౌన్ అమలు అవుతోంది. అయితే ప్రజలకు ఊరటనిచ్చేలా శుక్రవారం నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు స్వయంగా మంత్రి ప్రకటించడం.. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి విరుద్ధ ప్రకటన వెలువడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై శుక్రవారం ఉదయం మరోసారి స్పష్టమైన ప్రకటన వెలువడింది.
ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేర కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించడానికి 5 స్థాయిల్లో అన్‌లాక్ ప్రణాళికను విధించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆయన నుంచి ప్రకటన వెలువడగానే మీడియా కథనాలు వచ్చాయి. దీంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సాయంత్రం పూట మహా సర్కార్ కీలక ప్రకటన చేసింది.
తూచ్..
అటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకోబోదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. అయితే ఈ ప్రకటనపై విజయ్ వాడేటివార్ మరోసారి స్పందించారు. ఆక్సిజన్ బెడ్స్ లభ్యత, పాజిటివిటీ రేట్ తగ్గుదల పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే దీనిపై అధికారికంగా ఒక స్పష్టత రాలేదని ఆయన చెప్పారు.
ఇక భేటీలో అన్‌లాక్ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కేసులు, 285 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ పరిస్థితి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేయాలని కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment