
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రభుత్వం దశలవారీగా సడలిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అన్‌లాక్-2 విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ పలు మార్గదర్శకాలు విడదల చేసింది. జూలై 31వరకు అన్‌లాక్-2 నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై జూలై 31 వరకు నిషేధం కోనసాగుతుందని వెల్లడించింది. (100 రోజుల లాక్‌డౌన్.. ఏం జరిగింది?)
కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ కూడా జులై 31 వరకు మూసివేత కొనసాగుతుందని తెలిపింది.