విశాఖ చరిత్రను మాపే కుట్ర | Conspiracy to change Visakhapatnam history | Sakshi
Sakshi News home page

విశాఖ చరిత్రను మాపే కుట్ర

Published Tue, Jul 28 2020 1:35 AM | Last Updated on Tue, Jul 28 2020 8:10 AM

Conspiracy to change Visakhapatnam history - Sakshi

రెండో మాట
‘‘గాలి, నేల, నది, ఆకాశం అన్నీ  మాధు ర్యాన్ని వర్షించుగాక. సత్కార్యాన్ని అభిలషించే మనకు గాలి తియ్యగా వీచుగాక. నదులు తియ్యని నీటితోను, చెట్టు, చేమలు పరిపుష్టి గానూ ఉండుగాక, మనకు హితమైన ఆకాశం తియ్యదనాన్ని వర్షించుగాక, చంద్రుడు తీయని వెన్నెలను ప్రసాదించుగాక, పశువులు అధి కంగా పాలను ఇచ్చుగాక’’  
ఉపనిషత్‌ సూక్తి

ప్రజలకు మంచి జరగాలని కోరుకునే ప్రతి జాతికీ, మనిషికీ ఉండవలసిన లక్షణం యిది. కానీ కొందరు ప్రకృతిలో ‘తీతువు’ పిట్టల్లాంటి అశుభాలు పలుకుతూ, తన అధికారం ప్రజల ఆగ్రహం వల్ల ఊడిపోయిందని తెలుసుకోలేక ప్రకృతినే నిందించే రాజకీయ పక్షులు కొందరుంటారు. తనకు అధికారం లేకపోతే అన్యాపదేశంగా పరోక్ష పద్ధతుల్లో ప్రజలను, ప్రకృతినే శపిస్తూంటారు. ఈ బాపతుకు బాణీలు సమ కూర్చి పెట్టే ‘వాణులు’ కొన్ని ఉంటాయి. అలాంటి ఒక తొత్తు పత్రిక ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఉన్న  విశాఖ   పట్నం చారిత్రక ఔన్నత్యాన్నే కించపరిచేవిధంగా, దాని ఉనికినే ప్రశ్నించే విధంగా ఒక దుష్ట ప్రచారాన్ని... కాదు, కాదు పచ్చి విషాన్నే వెదజల్లింది. ఆ విషానికి ఆధారంగా ఆ పత్రిక ఎంచుకున్న వేదిక హైద రాబాద్‌లోని కేంద్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకటన, నిజానికి ఆ శాస్త్రవేత్తలు చెప్పిన మాటల్ని మభ్యపెట్టి లేదా తప్పుడు వ్యాఖ్యానా లతో విశాఖపట్నం ప్రజల్ని, తీరప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా ‘బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల మేర లోతైన చీలిక ఏర్పడిందని’ ఈ చీలిక తూర్పుగోదావరి మొదలు ఆ కొసన ఉన్న శ్రీకాకుళం దాకా వ్యాపించిందని, కాబట్టి విశాఖపట్నం నవ్యాం ధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా ఉండతగదన్న ‘ధ్వని కవిత్వం’గా ఆ పత్రిక టీడీపీ చెవిని కొరికింది.

అటు ఆ పత్రిక, ఇటు ఈ పార్టీ రాష్ట్రంలో ఇటీవల జనరల్‌ ఎన్ని కల్లో బిళ్లబీటుగా వ్యవస్థాగతంగా బీటలువారి తమ, ఉనికి కోసం వెతుకులాటలో పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని నిట్టనిలువునా చీల్చ డానికి దొంగచాటుగా కేంద్ర కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం కాంగ్రెస్‌ తరపున తయారుచేసిన విక్రయ పత్రంపై టీడీపీ పాలకుడుగా చంద్ర బాబు సంతకం చేసివచ్చాడు. దాని ఫలితంగానే రాష్ట్రం చీలిపోగా, ఉమ్మడి రాష్ట్ర సచివాలయం నుంచి అర్ధరాత్రిపూట ‘దొంగల నాయ కుడి’ మాదిరిగా ఆంధ్ర వైపుకు పరుగుపెట్టి చేరుకోవలసి వచ్చింది. విభజనానంతరం జరిగిన భాగోతంలో చీలిన ఆంధ్రప్రాంతానికి రాజధాని ఎక్కడన్న సమస్యను నిగ్గుతేల్చడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదిక ప్రకటించే లోపలే ఆగమేఘాలపై∙నారాయణ కమిటీ పేరిట ఒక అన ధికార కమిటీకి అధికార ముద్ర వేసి అసెంబ్లీలో శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను కనీస ప్రస్తావనకు, చర్చకు రానివ్వకుండా చేశారు చంద్ర బాబూ, అతని అనామక అనుయాయులూ! చీల్చిన ఆంధ్రాకు రాజ ధానిని ముందుగానే గూడుపుఠాణీతో రెండు మూడు ప్రాంతాలను నాటకీయంగా సూచించినట్టే సూచించి, చివరికి జగ్గయ్యపేట నుంచి అమరావతి వరకు మధ్యనున్న లాభసాటి భూముల్ని ముందుగానే చూసుకుని, ఆ రైతుల్ని చివరికి మోసగించి వారి భూముల సరి హద్దుల్ని చెరిపేసి, అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు. ఆ లావాదేవీల్లో ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో ఒక చరిత్ర, కానీ రాజధానిగా అమరావతికి ముక్కూమొహం లేదు. ధనదాహంలో జనం గోడు, రైతాంగం గోడు పట్టలేదు.

అనంతరం ఎన్నికలు రావడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, 2 లక్షల కోట్ల అప్పులు మాత్రం జగన్‌ నెత్తికి చుట్టుకోవడం జరిగింది. పరిస్థితిని బేరీజు వేసుకున్న వైఎస్‌ జగన్, రాష్ట్ర దుస్థితికి వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు పెరగడానికి కారణం గ్రహించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య అభివృద్ధిలో ఉన్న తీవ్ర వ్యత్యాసాలకు... పాలనా వ్యవస్థ ఈ అన్ని ప్రాంతాలకు వాటి కేంద్ర స్థానంలో లేకపోవడమే కారణమని గ్రహించారు. ఫలితంగానే గత అసెంబ్లీ తీర్మానం ప్రకారం అమరావతిని శాసన రాజధానిగానే ఉంచి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ, ఆదినుంచి అందరూ అభిలషించిన కర్నూలును న్యాయవ్యవస్థకు రాజధానిగానూ జగన్‌ వికేంద్రీకరించారు. ఈ విభ జనను కంటగింపుగా భావించిన టీడీపీ అధినేత పాలనా వికేం ద్రీకరణపై ధ్వజమెత్తారు. అప్పటిదాకా విశాఖలో సర్వసౌకర్యాలు అనుభవిస్తూ వచ్చిన చంద్రబాబు వర్గీయులకు ఆకస్మికంగా విశాఖ అంటే వెగటు పుట్టి, నానా కథలకు తెరలేపి సుందరమైన విశాఖ నగ రాన్ని చారిత్రక ప్రతిపత్తినే నాశనం చేయసంకల్పించారు. ఇందుకు తొలి సన్నాహమే తమ ‘తొత్తు పత్రిక’ ద్వారా విశాఖపై విష ప్రచా రానికి తెరలేపటం!

విశాఖ భౌగోళిక, చారిత్రక, పూర్వరంగం తెలిసిన వాడెవడూ అలా తప్పుడు రాతలతో ప్రచారానికి దిగరు. విశాఖ ఈ నాటిది కాదు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది నాటికే పాణిని, కాత్యాయన రచనల్లో విశాఖ ప్రస్తావన వెలుగులోకి వచ్చాయి. ఆనాటికి కళింగ రాజ్యంలో భాగమైన విశాఖ క్రీ.పూ. 5వ శతాబ్దికే బౌద్ధ సామ్రాజ్యానికి రాజధానిగా ఉందని చారిత్రకుల అవగాహన. విశాఖ ప్రాంతమంతా ఆదినుంచీ, బౌద్ధ  సంప్రదాయాలతో వర్ధిల్లిన పుడమి. బౌద్ధ సంఘారామానికి ఆనాడు ‘సంకారం’ అని పేరుండేది. విశాఖ చుట్టూ బౌద్ధం వర్ధిల్లిన ప్రదేశాలు ఎన్నెన్నో. ‘సంకారం’ రెండువేల ఏళ్లనాటిది. బౌద్ధంలోని మూడు సిద్ధాంత శాఖలు, హీనయాన, మహాయాన, వజ్రయాన విశాఖ ప్రాంతంలో ప్రచలితమయినవే. అలాగే క్రీ.శ. ఒకటవ శతాబ్దినాటి  చరిత్రకెక్కిన మృణ్మయ(మట్టి) పాత్రలు, స్థూపాలు, శిలాసదృశమైన గుహలను తొలిచి  ఇటుకలతో నిర్మాణాలు చేసిన దాఖలాలు తవ్వకాలలో బయటపడ్డాయి. ఆమాటకొస్తే బుద్ధుని శిష్యురాలైన ‘విశాఖి’ పేరిట వెలువడిందే విశాఖ అని ఐతిహ్యం.

అలాంటి విశాఖ ప్రపంచంలోనే వేగవంతంగా వృద్ధి చెందుతున్న 100 నగరాలలో ఒక ప్రసిద్ధ నగరంగా గణనలోకి వచ్చింది. యావత్తు తూర్పు కోస్తాకే విశాఖ రత్నమాల! తూర్పు కనుమలకు, బంగాళా ఖాత తీరానికి మధ్య విస్తరించిన ప్రాంతం ఇది. భారతదేశంలో అత్యంత పరిశుభ్ర నగరాలలో ఒకటిగా పేరు మోసిన విశాఖ 2018– 19 నాటికి బాబు హయాంలో 23వ స్థానానికి దిగజారింది. విశాఖ దేశంలోనే 14వ పెద్ద నగరం, దక్షిణ భారతంలో నాల్గవ పెద్ద జనాభా గల నగరం (సుమారు 40 లక్షలపైచిలుకే) తూర్పు నౌకా దళ స్థావ రంగా, అంతర్జాతీయ విమానాశ్రయంతో 4.3 బిలియన్‌ డాలర్ల విలువ గల ఉత్పత్తులతో అలరారుతూ దేశంలోనే తొమ్మిదవ పెద్ద నగరంగా గణతికెక్కినది విశాఖ. పెద్ద పారిశ్రామిక కేంద్రం. సాగర ఆహారోత్పత్తు లకు, ఎగుమతులకు కేంద్రం, ఫిన్‌టెక్, ఐబీఎమ్, విప్రో, టెక్‌ మహేంద్ర, ఇన్ఫోటెక్, ఫ్రాంక్లిన్‌ టెంపిల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్‌ వగైరా భారీ ఐటీ కంపెనీలతో దీపిస్తున్న నగరం విశాఖ! పైగా పెక్కు అధునాతన ఫార్మా కంపెనీలు కొల్లలుగా వచ్చిపడు తున్న నగరం విశాఖ. ట్రాంబే తర్వాత భాభా అణు పరిశోధనా కేంద్రం ఉన్నది విశాఖలోనే. దేశంలోని 13 మేజర్‌ రేవు పట్టణాలలో విశాఖ ఒకటి. చెన్నై, కలకత్తాల మధ్య సరుకుల రవాణాకు అనువైన రెండవ భారీ రేవు ఉన్న నగరం ఒక్క విశాఖే! పైగా ఇది సముద్రతీర జలాలకు 148.5 అడుగుల ఎత్తున ఉంది. అందుకే తూర్పుకనుమల సౌందర్య రేఖల మధ్య సుందరమైన చల్ల చల్లని బీచ్‌ల సోయగాలతో కొండల పంక్తులు, గుహలు, లోయలు, సరస్సుల మధ్య సేదతీరే ప్రాంతం విశాఖ! బహుళ సంస్కృతులు బహుభాషా ప్రాంతీయులైన తమిళులు, మలయాళీలు, సింధీలు, కన్నడిగులు, ఒడియన్లు, బెంగాలీలు, ఆంగ్లో ఇండియన్లు.. కలివిడిగా తిరిగే సంస్కృతీ కేంద్రం విశాఖ.

అయినప్పటికీ, పరమ సంకుచిత బుద్ధితో విశాఖను తెలుగు ప్రజలకు ఒక ప్రధాన పాలనా కేంద్రాలలో ఒకటిగా కాకుండా మోకాలు అడ్డడం కోసం మొత్తం విశాఖను, ఆప్రాంత వాసులను సునామీలు, భూకంపాలు ముంచుకొచ్చి నామరూపాలు లేకుండా చేసే ప్రమాదం పొంచివుందనీ శాస్త్రవేత్తల పేరిట పనిగట్టుకొని ‘తొత్తు పత్రిక’ ద్వారా సరికొత్త కథనం ప్రచారంలో పెట్టారు. పైగా ఆ అంచనాలో ఇదిమిద్ధత లేదు. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల మీదట జరిగే ప్రక్రియ’గా ఒక పరిణామక్రమాన్ని పేర్కొంటూ వచ్చారు. ఆ ప్రక్రియ వల్ల జరిగే పరిణామాలు ఏమిటి? లక్షల సంవత్సరాల మీదట లక్షల టన్నుల మట్టి, మశానం, రాళ్ళు నదులనుంచి కొట్టుకు వచ్చి అవి సముద్రంలో 23 కిలోమీటర్ల ఎత్తున మేట వేసుకున్నాయినీ ఈ ఒత్తిడి పతాకస్థాయికి చేరేసరికి ఆ భారాన్ని సముద్రం భరించలేక సముద్రంలోని భూమి కంపించి భూమిలో కొంతభాగం చీలిపోయిందట. ఆ చీలికలోతు 100 మీటర్ల నుంచి 900 మీటర్ల దాకా ఉందట. ఇంతకీ ఈ చీలిక ఎప్పుడు ఏర్పడిందట? 60 లక్షల 80 వేల సంవత్సరాల నాడట. దాని దుష్పరిణామం ఇప్పటిదాకా కన్పిస్తోందట. సరిగ్గా ఈ సమ యంలోనే ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సముద్రం ఉవ్వెత్తున పొంగినపుడు కృష్ణా, గోదావరి డెల్టాలకే అసలు ముప్పంతా అని పేర్కొనడంతో తొత్తు పత్రికల తిత్తి తీసినట్లయింది. హైదరాబాద్‌ భూగర్భ పరిశోధనా కేంద్రం గతంలో శివరామకృష్ణన్‌ కమిటీకన్నా ముందే అమరావతి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల దాకా భూకంపాలు, సునామీలకు ఆలవాలంగా ఉంటుందని జోస్యం చెప్పింది. ఈ దృష్ట్యా శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక కూడా అమ రావతి రాజధాని విషయంలో వివరణాత్మకంగా హెచ్చరికలు చేసిం దని మరవరాదు.

వెనకటికొకడు సముద్రంలో కెరటాలు అణగిపోయిన తర్వాత స్నానం చేద్దాంలే అన్నాడట! కెరటాలు ఆగడం, స్నానం చేయడం కుదిరే పనేనా? అందుకే కవికుమారుడన్నాడు: కడలి తరగలాపెదవా/ భడవా ఓ కాన్యూట్‌’’.

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement