పేపర్ బ్యాలెట్‌కు ఉన్న పారదర్శకత ఈవీఎంలకు లేనందునే, అనుమానం వచ్చి ప్రశ్నించగల అవకాశం ఓటరుకు లేనందునే వాటి పారదర్శకతను పెక్కు దేశాలు ప్రశ్నించి ఆ యంత్రాలను ఎన్నికలలో ఓట్ల నమోదు ప్రక్రియ నుంచి ఉపసంహరించి, రద్దుచేసి రాజకీయ ఓటింగ్‌తో నిమిత్తంలేని చిల్లర పనులకు వాడుతుండవచ్చు. కానీ, ఈవీఎంల రహస్యపాత్రకు తానేమీ తీసిపోలేదన్నట్లుగా దొంగ సర్వేల ద్వారా ప్రత్యర్థి పార్టీల తాలూకు ఓటర్లను లక్షల సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ‘యజ్ఞం’లో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. ఇది ఈవీఎంల ట్యాంపరింగ్‌కు మించిన పెనుప్రమాదం అని గుర్తించకపోతే ప్రజల ఓటుహక్కుకే భంగకరం.
బ్యాలెట్ పత్రాలు ఆధారంగా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలా లేక ఆధునికమైన ‘ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల’ ద్వారా నిర్వహించాలా అన్న సమస్య మరోసారి విస్తృత స్థాయిలో దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ మీమాంస – విత్తుముందా చెట్టు ముందా అన్న ప్రశ్నలా తయారైంది. ఈ విషయమై ఇప్పటికే పలు స్థాయిల్లో శషభిషలు నడుస్తున్నాయి. పైగా మరిన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుశా ఇందుకు మొదటి కారణం అమెరికాలో ఉంటున్న సయ్యద్ సూజీ అనే భారతీయ హ్యాకర్, 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను రహస్యంగా శోధించి (హ్యాకింగ్) ఓట్ల జాబితా తారుమారు చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని చేసిన ఆరోపణ. పైగా ఈ హ్యాకింగ్ ప్రక్రియతో ఒక్క బీజేపీకే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు కూడా ప్రమేయముందని ఆ హ్యాకర్ ప్రకటించారు. ఈ ఆరోపణను భారత ఎన్నికల సంఘం ఖండిస్తూ, లండన్ పత్రికా గోష్టిలో సూజీ చేసిన ఆరోపణలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తున్నామని ప్రకటించింది (21–01–2019)
అయినా మనదేశంలో వివిధ రాజకీయ పక్షాల మధ్య ఈవీఎంలకు, బ్యాలెట్ పత్రాలనే తిరిగి ప్రవేశపెట్టేందుకు అనుకూల, ప్రతికూల వాదోపవాదాలు చర్చలు బహుముఖంగా సాగుతూనే ఉన్నాయి గానీ, ఈవీఎంల గురించిన అనుమానాలు మాత్రం ఇంకా సమసిపోలేదు. ఇందుకు ఉదాహరణగా పెక్కుమంది మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాస్త్ర నిపుణులు సలహాదార్లుగా ప్రారంభమై వర్ధిల్లుతున్న ప్రసిద్ధ పక్ష పత్రిక ‘లా ఏనిమేటెడ్ వరల్డ్’ ఈవీఎం, బ్యాలెట్ పత్రాల వాడకానికి సంబంధించిన వాదప్రతివాదాలన్ని ప్రస్తావిస్తూ 2018 డిసెంబర్ 18 సంచికలోనే ఒక సంపాదకీయం రాసింది. అందులో పేర్కొన్న విషయాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి: సుమారు ఇప్పటికి పదేళ్లో అంతకుపైబడి మన దేశ ఎన్నికల ప్రక్రియ నుంచి బ్యాలెట్ పత్రం కాస్తా కనుమరుగైపోయింది. చిత్రమేమంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు తమ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రాకముందు ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి చిక్కుల్లో పడనుందో వివరిస్తూ ఒక పుస్తకమే రాశారు. దానిపేరు ‘డెమోక్రసీ ఎట్ రిస్క్’! ఆ పుస్తకానికి ముందు మాట రాసిన వారు బీజేపీ అగ్రనేత అడ్వాణీ. ఆయన ఈవీఎం యంత్రాలను ఇండియాలో వాటి ప్రవేశాన్ని నిరసిస్తూ ఆ ముందుమాటలో రాశారు. కానీ అలాంటి బీజేపీ వారే అధికారం చేపట్టిన తర్వాత తమ వైఖరి మార్చేసుకున్నారు. అలాగే నిన్న మొన్నటిదాకా ఈవీఎంలను ఆడిపోసుకున్న కాంగ్రెస్ అకస్మాత్తుగా ఇటీవల మూడు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా సానుకూల ఫలితాలను పొందిన తర్వాత అవే యంత్రాలను సమర్థించడం మొదలెట్టింది. కానీ ఈవీఎంల తంతును, ఓటరు తన ఓటు అసలు నమోదైందా లేదా తెలుసుకునే.. లేక అసలు దాని ఆచూకీని తెలుసుకోవడానికి వీలు కల్పిం చేందుకు ఈవీఎంల సరసనే ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లనుంచి వెలువడే రసీదులను తనిఖీ చేసుకునే అవకాశం గురించి కూడా ఇటీవల కొన్ని ఎన్నికల ఫలితాల సందర్భంగా వివాదాలు తలెత్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపకులపై లీగల్ చర్యలు తీసుకుంటామని ఎంతగా హెచ్చరించినా, జరిగే పరిణామాలను ఆపగల పరిస్థితి మాత్రం లేదు.
ఇందుకు తాజా ఉదాహరణే– తెలంగాణలో ఇటీవలనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలలో పోటీ చేసిన ఇరువురు కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఫలితాలపైన హైకోర్టుకు ఫిర్యాదు చేయవలసి రావటం. ఇందుకు కారణం ఈవీఎం మెషీన్లు, వాటికి అనుబంధంగా ఉన్న ‘వీవీప్యాట్స్’ను భద్రపరిచిన ‘నిషిద్ధ గదుల’ను (స్ట్రాంగ్ రూమ్స్) అభ్యర్థుల అభ్యంతరాలపై హైకోర్టు పరిశీలన పూర్తి కాకుండానే వికారాబాద్ కలెక్టర్ ఈవీఎంలకు చెందిన మూడు కంట్రోల్ యూనిట్లను, వాటికి అనుబంధంగా అమర్చిన వీవీపాట్స్‌నీ తెరచిచూసి, అందలి సమాచారాన్ని వెల్లడించబోవటం. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ‘వీవీప్యాట్స్’ సీళ్లు బద్ధలుకొట్టి ఉండటమూ, ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌పైన ఫిర్యాదు నమోదు కావటమూ, వికారాబాద్ కలెక్టర్‌ను ఎలెక్షన్ కమిషన్ సస్పెండ్ చేయటమూ జరిగింది. ఒకసారి అభ్యర్థి తన ఫలితంపైన అనుమానంతో కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, దాన్ని కోర్టు అందుకున్న తరువాత, దానిపై తుది తీర్పు వెలువడేదాకా స్ట్రాంగ్ రూమ్స్ తాళాలు తీయరాదన్నది ఆనవాయితీ. ఇంతకుముందు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎం వీవీపాట్స్‌కు సంబంధించిన అవకతవకలు జరిగినప్పుడు అప్పటి ప్రధాన ఎన్నికల అధికారి ‘వీవీప్యాట్స్‌ను నిర్వహించగల సిబ్బంది శిక్షణగలవారు కారన్న’ సాకుతో అభ్యర్థుల ఫిర్యాదులను తోసిపుచ్చారని మరవరాదు. పలు సందర్భాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్స్ నుంచి వెలువడే కాగితం ‘చీటీ’లకు సంబంధం లేకుండా పోయిందని, కాబట్టి ప్రతి ఈవీఎం తాలూకు వీవీప్యాట్ చీటీలను తైపారు వేసి చూడాల్సిందేనన్న డిమాండ్లు ఎక్కువైపోయాయి.
అంతేగాదు, దేశంలో కొన్నిచోట్ల ‘ఈవీఎం’ల తంతు కనిపెట్టిన కొందరు రాజకీయ నాయకుల ఇళ్ల వద్దకు ‘ఈవీఎం’లు చేరినట్టు కొందరు ఫిర్యాదులు చేయడం కూడా విన్నాం. ఎన్నికల్లో గతంలో పేపర్ బ్యాలెట్ పత్రాలు వినియోగంలో ఉన్నప్పుడూ ఆ పత్రాలను దొంగిలించారని, బ్యాలెట్ పెట్టెలను తస్కరించారని లేదా పెట్టెల్లో ఓట్లు గుప్పిం చారన్న ఫిర్యాదులుండేవి, అలాగే ఈవీఎంలు రంగంలోకి వచ్చింతర్వాత కూడా ఆ యంత్రాలు సంక్లిష్టమైనవి అయినందున, ఓట్ల ట్యాంపరింగ్ సాధ్యపడదన్న ‘విశ్వాసం’ ఒకవైపున ప్రచారంలో ఉన్నప్పటికీ ట్యాంపరింగ్ సాధ్యమేనని వివిధ దేశాల్లో అత్యున్నత సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. దాని ఫలితంగానే, ప్రపంచంలోనే సాంకేతిక విప్లవంలో అగ్రగాములుగా, అగ్రశ్రేణిలో నిలిచిన అమెరికా, జపాన్‌లు ఎన్నికల రంగం నుంచి ‘ఈవీఎం’లను తప్పించి, బ్యాలెట్ పేపర్లకు మళ్లాల్సి వచ్చిందని నిపుణుల అంచనా. అంతేగాదు, వీవీప్యాట్స్ నుంచి వెలువడే ఓటర్ల పేర్లున్న స్లిప్పులను కౌంట్ చేయటానికి ఎన్నికల సంఘం కొన్నిచోట్ల అనుమతించకపోవడమూ అనుమానాలకు దోహదం చేసింది.
పెక్కుచోట్ల ఈవీఎంలు ఆచరణలో ‘దూడలు’ వేశాయని (మిస్‌బిహేవ్), చివరికి పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఒక్క ఓటు తేడా వచ్చినా ఆమోదయోగ్యం కాదని ప్రసిద్ధ ‘హిందూ’ వ్యాసకర్త, పాత్రికేయులు సంపత్ రాస్తూ ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థగా మనుగడలో ఉండాలని దేశం కోరుకోవడానికి కారణం– ఆ దేశపు ప్రభుత్వానికే అది నైతిక బలాన్ని కల్గిస్తుంది కాబట్టి. ఆ బలం పౌరుడి ఓటులో ఉంది. దానికి మారుపేరే రహస్య బ్యాలెట్. అందువల్ల ఏ పోలింగ్ నిర్వహణ పద్ధతైనా మూడు పరీక్షలు విధిగా నెగ్గాలి– పారదర్శకత, కచ్చితమైన ధృవీకరణ, రహస్యం. ఈ మూడు పరీక్షలకు పేపర్ బ్యాలెట్లే గీటురాయి. ఎందుకంటే, తాననుకున్న అభ్యర్థి ఎంపికను ఓటరు బ్యాలెట్ పత్రంలో కళ్లారా ధృవీకరించుకోగల్గుతాడు, ఓటింగ్ రహస్యంగానే జరి గిందని నమ్ముతాడు, తన ఏజెంటు కళ్లముందే ఓట్ల లెక్కింపు జరిగిందని తృప్తి పడతాడు. ఈ మూడు పరీక్షల్లోనూ ‘ఈవీఎం’లు విఫలమయ్యాయి. దీన్ని 2009లోనే జర్మనీ రాజ్యాంగ ధర్మాసనం ధృవీకరించింది’’ అని చెప్పారు. ఈవీఎంలలో రెండు యూనిట్లు ఉంటాయని, ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది బ్యాలెట్ యూనిట్టూనని వివరిస్తూ ‘ఈవీఎం ఓటింగ్ వ్యవస్థలో ఓటరు నిజమైన ఓటరా, దొంగ ఓటరా అని తెలుసుకోవడానికి వీలుండదని ఈవీఎంలను దుర్వినియోగం చేసే దుర్మార్గుల నుంచి కాపాడటం కష్టతరమనీ’ అంతర్జాతీయ కంప్యూటర్ సైన్స్, ఇంజ నీరింగ్ పత్రిక నిర్వహించే ప్రసిద్ధుడు సంజయ్ కుమార్ వెల్లడించాడు.
అందుకనే పేపర్ బ్యాలెట్‌కు ఉన్న పారదర్శకత ఈవీఎంలకు లేనందుననే, అనుమానం వచ్చి ప్రశ్నించగల అవకాశం ఓటరుకు లేనందుననే ఈవీఎంల పారదర్శకతను పెక్కు దేశాలు ప్రశ్నించి ఆ యంత్రాలను ఎన్నికలలో ఓట్ల నమోదు ప్రక్రియ నుంచి ఉపసంహరించి, రద్దుచేసి రాజకీయ ఓటింగ్‌తో నిమిత్తంలేని చిల్లర పనులకు వాడుతున్నాయి. కంప్యూటర్ టెక్నిక్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడినుంచైనా సరే ఈవీఎం యంత్రాల ట్యాంపర్ చేయొచ్చునని కంప్యూటర్ సాంకేతిక నిపుణుడు ఐశ్వర్య కృష్ణన్ (15.3.17) ధృవీకరించాడు. అందుకనే, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీలు ఈవీఎంల వాడకాన్ని మానేసి పేపర్ బ్యాలెట్ వాడకానికి మళ్లిపోయాయి. అయితే అమెరికా, వెనిజులాల్లో కొన్నిచోట్ల ఈవీఎంలతో పాటు పేపర్ బ్యాలెట్లు కూడా వాడుకుంటున్నారు. ‘సందట్లో సడేమియా’ అన్నట్టు ఈ సందర్భంలోనే ఈవీఎంల ‘దందా’ సంగతేమోగానీ ఈవీఎంల రహస్యపాత్రకు తానేమీ తీసిపోలేదన్నట్లుగా దొంగ సర్వేల ద్వారా ప్రత్యర్థి పార్టీల తాలూకు ఓటర్లను తమ పార్టీకి పోటీ లేకుండా చేసుకోడానికి ఓటర్ల జాబితా నుంచి లక్షల సంఖ్యలో తొలగించే ‘యజ్ఞం’లో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు. ఇందుకుగాను నెల్లూరు సభలో (9.2.19) ప్రజ లను ఓ నియంతగా శాసించి బాబు ఇలా హుకుం జారీ చేశారట: ‘నేను అడిగిన సీట్లు గెలిపించి తీరాలి. మీ ఇష్ట ప్రకారం ఓట్లు వేస్తే కుదరదు. మీరే నష్టపోతారు. అభ్యర్థుల్ని చూసి కాదు, నన్నూ నా కష్టాన్ని చూసి గెలిపించాలి’ ఇంతకీ ఈ పేలవ ప్రేలాపన వెనక ఉన్న దడ, భయం ఏమిటో ఆయన నోటినుంచే చెప్పక చెప్పినట్టు వినండి– ‘‘నేను విదేశాలకు వెళ్లినప్పుడు మీరు ఓడిపోతే మేం పెట్టిన పెట్టుబడులన్నీ ఏమైపోతాయని చాలామంది ఎన్నారై పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు’’ట! గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకోవటం అంటే ఇదే!
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు,abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment