ఈ కుమ్మక్కు దేని కోసం?! | Article On TDP MPs Joined In BJP | Sakshi
Sakshi News home page

ఈ కుమ్మక్కు దేని కోసం?!

Published Tue, Jun 25 2019 12:58 AM | Last Updated on Tue, Jun 25 2019 12:58 AM

Article On TDP MPs Joined In BJP - Sakshi

తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం చాటున ఆంధ్రప్రదేశ్‌లో కాలూనుకోవచ్చని బీజేపీ కేంద్రనాయకత్వం భావించింది. దీనికోసం అవినీతిపరులుగా ముద్రపడిన  టీడీపీ నేతలను తమలో కలుపుకుపోపడానికి కూడా బీజేపీ వెనుకాడలేదు. ఒకవైపు టీడీపీ అవినీతి ముఠాకి తమ తలుపులు తెరిచి ఉంచారు. మరోవైపున ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అండదండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుజనా చౌదరీ, సీఎం రమేష్‌ లాంటి టీడీపీ నాయకులు, మంత్రులూ ఎంతటి మోసకారులో గ్రహించాలంటూ జీవీఎల్‌ రాజ్యసభ నైతిక సూత్రాల నిర్ణాయక సంఘానికి రాసిన లేఖ తడి ఆరకముందే బీజేపీలో వారి చేరికను బాహాటంగా సమర్థించుకోవడంలోని మతలబేంటి? 

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి నెలరోజులు కూడా అయిందో లేదో.. అప్పుడే 2024లో మేమే రాష్ట్రంలోకి వస్తామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన భారీగా ప్రకటనలు చేస్తున్నాయి. కాగా జగన్‌ రానున్న అయిదేళ్లకు సరిపడా ప్రణాళికలు పెట్టుకుని వాటి అమలుకు 2024ను లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఒకేమారు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిపించాలన్న సరికొత్త విధానాన్ని బీజేపీ ప్రకటించింది. కానీ సారాంశం– 2022 నాటికి దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు గడువు ముగిసిన అసెంబ్లీలు కలుపుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఫలితంగా, అప్పటికి ఇంకా రెండేళ్లు అధికారంలో ఉండాల్సిన జగన్‌ ప్రభుత్వం కూడా మధ్యంతరంగానే ఎన్నికలకు సిద్ధం కావలసి వస్తుంది.’’ – సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు (23–06–2019)

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దాని నాయకత్వానికి ఇప్పట్లో తేరుకోలేని భారీ స్థాయిలో శృంగభంగమయింది. జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అఖండవిజయంతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఒక రాజకీయ శక్తిగా ‘అంత్యక్రియలు’ కూడా జరుపుకునే దశలో ఉంది. ఈ అంత్యక్రియలకు పౌరోహిత్యాన్ని ప్రత్యక్షంగా వహించిన ఆ పార్టీ రాజ్య సభా పక్షం కాస్తా అకస్మాత్తుగా బీజేపీలో విలీనమైపోయి తీర్థ ప్రసా దాలు పుచ్చుకుంది. ఈ పరిణామం బాబు ఆశీస్సులతోనే జరిగి ఉంటుందనడానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయపక్షానికి మరో రథికుడైన అమిత్‌ షాల ఆశీస్సులను కూడా టీడీపీ రాజ్యసభాపక్షం పొందడమే నిదర్శనం! అలాగే, ఈ పరిణామానికి ముందస్తు సూచనగా కొన్నాళ్ల క్రితం తిరుపతిలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ త్వర లోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధికారం లక్ష్యంగా బీజేపీ విస్తరించబోతోందని ప్రకటించిన తర్వాతనే టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమైపోవడమూ, దాని లోక్‌సభా పక్షం కూడా (ముగ్గురు) ‘జంప్‌ జిలానీ’లు కావడానికి సిద్ధమవుతుండటం జరుగుతోంది. పైగా టీడీపీ చరిత్రలో ఎరుగనంత ఓటమి (అసెంబ్లీలో 23, శాసనమండలిలో 3 సీట్లకు కుదించుకుపోవటం) పొందింది. ఇన్నాళ్లుగా తనను పెంచిపోషిం చిన అవినీతిపరులైన కొందరు కేంద్రమంత్రుల్ని, సభ్యుల్ని, తనకు ప్రమేయం లేదన్న ముసుగు చాటున బీజేపీలో తలదాచుకోమని చంద్రబాబు చెప్పి ఉంటాడు. ఈరకంగా టీడీపీ పతనం చాటున ఆంధ్రప్రదేశ్‌లో కాలూనుకోవచ్చని బీజేపీ కేంద్రనాయకత్వం భావించింది.

ఈ పూర్వ రంగంలో రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వానికి పైకి మాత్రం ‘అండ దండగా ఉంటామ’ని బీజేపీ నాయకులు పెదాలు కదుపుతూనే ఇంకో వైపునుంచి టీడీపీ అవినీతి ముఠాకి తమ తలుపులు తెరిచి కూర్చున్నారు. పైగా, బీజేపీ జాతీయ పార్టీ నాయకుల్లో ఒకరైన జీవీఎల్‌ నర సింహారావు, సోము వీర్రాజు ప్రభృతులు ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీయే జగన్‌ ప్రభుత్వానికి ప్రతిపక్షమనీ బాహాటంగానే చాటుకుంటు న్నారు. అంతేగాదు, బాబు సాకుతూ వచ్చిన సుజనా చౌదరీ, సీఎం రమేష్‌ లాంటి టీడీపీ నాయకులు, మంత్రులూ ఎంతటి మోసకారులో గ్రహించమని బీజేపీ నాయకులు జీవీఎల్‌ రాజ్యసభ నైతిక సూత్రాల నిర్ణాయక సంఘానికి గౌరవాధ్యక్షుడైన నారాయణ్‌లాల్‌ పంచారియాకు రాసిన లేఖలో (28.11.2018) జీవీఎల్‌ పదే పదే కోరవలసి వచ్చిందని మరవరాదు. కానీ జీవీఎల్‌ లేఖకు పూర్తి భిన్నంగా బీజేపీ జాతీయపక్షం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీనడ్డా, ‘చైతన్యశీలి అయిన ప్రధాని మోదీ నాయ కత్వంలో, పార్టీ నిర్మాణ కౌశల్యంలో దిట్టయిన అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీ శక్తి యుక్తుల్ని చూసి టీడీపీ పార్లమెంట్‌ సభ్యులు బీజేపీలో చేరా లని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి చేరికతో, ఏపీలో బీజేపీ బలోపేతం కాబో తున్నది. అందర్నీ కలుపుకుపోవాలన్నదే, ఆ సానుకూల రాజకీయమే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయబోతోంది’ అనేశారు. 

అంటే, బీజేపీని ముంచే ముందు బాబు అనుసరించిన అవకాశ వాద ఎన్నికల వ్యూహాన్నే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీయడా నికి, కృత్రిమ విభజనకు బలైన రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించే జగన్‌ దృఢదీక్షను సడలింపజేయడానికి, అది సాధ్యం కాకపోతే బాబు ప్రేరణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో కలిసి జగన్‌పై అన్యా యంగా సీబీఐ, ఈడీలతో మోపిన కేసులను ఎటూ తేల్చకుండా బీజేపీ పాలకులు కూడా ‘నానబెట్టే’ అవకాశం లేకపోలేదు. ఇది నిజం కాని పక్షంలో, బీజేపీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామిగా ఉన్న బాబు జగన్‌పై పెట్టిన కేసుల్ని ఇప్పటిదాకా బీజేపీ పాలకులు కూడా ఎందుకు నాన్చుతున్నట్టు? సీబీఐ ప్రత్యేక కోర్టులు దాదాపుగా అన్ని కేసులలో నిందితుల్ని వరుసగా విడుదల చేయగా జగన్‌పై మిగిలి ఉన్న ఒక కేసును అలా ఎందుకు నాన్చుతున్నట్లు? ఈ ‘నాన్పుడు’లో మెట్టువాటా బాబుది కాగా, ఆ బాబు పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామి కాబట్టి బీజేపీ కూడా ‘తిలాపాపాన్ని తలా ఒకరు పంచు కున్నా’రని భావించాలి. పైగా ‘ప్రత్యేక హోదా’ సమస్యను ఏపీ ప్రభు త్వం బాబులాగా వదిలేసుకున్నంత మాత్రాన బీజేపీ తాను రాష్ట్రంలో అధికారానికి రావాలన్న కాంక్షను, లాలసను వదిలేసుకుంటుందా? అసంభవం. రాష్ట్రంలో తాజా ఎన్నికల్లో ముచ్చటకైనా ఒక్క సీటైనా గెల వలేని బీజేపీ ఏ స్థితికి దిగజారిందంటే– అవినీతికి దూరంగా ఉన్న రాజ కీయ పార్టీగా ఎంతగా ప్రచార ఆర్భాటం ద్వారా ముద్ర వేయించు కోవాలనుకున్నా దేశవ్యాప్తంగా బీజేపీ లెజిస్లేటర్లపై ఎన్ని క్రిమినల్‌ కేసులు, అవినీతి కేసులు మోపి ఉన్నాయో జాతీయ స్థాయి సాధికార పీడీఎర్‌ నివేదిక (2014–2019 దాకా)లు సాక్ష్యం పలుకుతున్నాయి. 

కుల, మత, వర్ణ, వర్గ వ్యత్యాసాలతో, అసమానతలతో తీసుకుం టున్న భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ నేడు సహనశీలమైన గణతంత్ర వ్యవస్థ (రిపబ్లిక్‌)గా కాకుండా అసహనంతో నిండిపోయిన రిపబ్లిక్‌గా తయారైందని జస్టిస్‌ ఏపీ షా (2.11.2018) సంవత్సరం క్రితమే నిరసిం చాల్సి వచ్చిందని మరవరాదు. క్రమంగా పాలక పక్షాలే సమాజాన్ని ‘మేము–వారు అన్న విభజన రేఖతో కొలిచే దుస్థితికి దిగజారినందున మనం హింసా ధోరణిపట్ల మనస్సులు మొద్దుబారిన వారంగా మారు తున్నామని జస్టిస్‌ షా అన్నారు. గాంధీయ తాత్విక దృష్టిని, సహిష్ణు వైఖ రిని పాలకులు బలవంతంగా, హింసాత్మకంగా పక్కతోవలు పట్టిస్తున్నా రని ఆయన విమర్శించాల్సి వచ్చింది. ఈ అసహిష్ణుత వల్లే పాలకులు పత్రికా స్వేచ్ఛనూ, భావప్రకటనా స్వాతంత్య్రాన్ని, సమావేశ స్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయ ప్రకటననూ సహించి, తమ విధానాలను, నిరంకుశ ధోర ణులను, అవకాశవాద రాజకీయాలను మార్చుకోలేక పోతున్నారు. ఫలితంగా దేశంలో గత అయిదారేళ్లుగా, పలువురు బాధ్యతాయుత పౌరులు నిశితమైన అభిప్రాయాలు వెల్లడించినందుకు హత్యలకు, వేధింపులకు గురయ్యారు. అనేకమందిని, జైళ్లపాలు చేశారు. ఒక ఒరలో కూడా రెండు కత్తులు ఇమడగలవని, మధ్యే మధ్యే పరస్పరం పొడుచుకోవడానికి ప్రయత్నించినట్లు ప్రజల కోసం కన్పించినా కూడా పాలనా భాగస్వామ్యంలో మాత్రం భిన్న నాయకులు ఇమిడిపోవచ్చని వర్తమాన రాజకీ యాలు నేర్పుతున్న పాఠం. నిరంతర జాగరూకత, అప్రమత్తతే స్వాతంత్య్ర ఫలాలను త్యాగశీలురైన ప్రజలు అనుభవించడానికి శ్రీరామ రక్ష. అదే ఆంధ్ర ప్రజల అశేష త్యాగాల నుంచి వచ్చిన అనుభవం కూడా. రాష్ట్ర చరిత్రలో స్వాతంత్య్రానంతర దశలో కనీవినీ ఎరుగని పాదయా త్రను ప్రజా సంకల్ప యాత్రగా మలచి కార్యసాధకుడై ప్రజల ఆశీర్వాదా లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజల సంకల్పాన్ని నిర్వీర్యం చేయ డానికి పనిగట్టుకుని కేంద్రం అధికార, అనధికార స్థాయిల్లో పన్నే కుట్ర లను, కుహకాలనూ ప్రజలు వేయి కళ్లతో కనిపెట్టి ఉంచారు, వాటిని తుత్తునియలు చేస్తారని మరచిపోరాదు. మనది సాధారణ ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే, కానీ దానిచుట్టూ కూడా అసాధారణ పెట్టుబడి శక్తులు, మన నామమాత్రపు ప్రజాస్వామ్య విలువలను కూడా కూల్చ డానికి జట్టుకడతాయి.

ఇంతవరకూ జగన్‌పై హత్యాయత్నం కేసును చేపట్టి, న్యాయస్థాన పరిధుల్ని దాటకుండా ముందుకు సాగకుండా ఉండటానికి కారణాలు ఇంకా గోప్యంగానే ఉంచారు. సీబీఐ, ఈడీ, ఎన్ని కల కమిషన్‌ వ్యవస్థలు సుప్రీంకోర్టు చెప్పినట్టు పాలకవర్గ అదుపాజ్ఞల్లో కొనసాగుతున్నంత కాలం ఈ మాత్రపు ప్రజాస్వామ్యంలో కూడా న్యాయం జరగదన్న భావన ప్రజల మనస్సుల్లో, ప్రజాస్వామ్యవాదుల మనస్సుల్లో స్థిరపడిపోవడం శ్రేయ స్కరం కాదు. అందుకే ప్రపంచ ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త అకిల్‌ బిల్‌గ్రామ్‌ ఇలా హెచ్చరించాడు: ‘‘నేడు భారతదేశ పాలనా వ్యవస్థలో నడుస్తున్నది అనారోగ్య లక్షణా లతో తీసుకుంటున్న నిరంకుశ ధోర ణులు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ, దానివల్ల పుట్టుకొచ్చే సంక్షోభాల ఫలితం. ఇదే ఫాసిజానికి అనుకూల పరిస్థితులను సృష్టించి పెడుతుంది. కానీ పాలనా వ్యవస్థ తమ జీవి తాలతో చెలగాటమాడుతోందని గ్రహించిన మరుక్షణం ప్రజలు ఆ చదరంగం బల్లను (చెస్‌బోర్డు) కాస్తా కూల్చేస్తారు. సరిగ్గా ఈ జాతర క్రమంలోనే విసిగిపోయిన ప్రజలు, ఫాసిజం అంచులకు చేరుకునే ప్రయ త్నంలో ఉన్న పాలకులకు ‘అనుకూలంగా కూడా ఓట్లు వేసే ప్రమా దమూ తలెత్తుతుంది’ అందుకే నేటి అసలు ప్రశ్న: ‘సాక్షీ మహరాజ్‌ (బీజేపీ) చెప్పినట్టు రేపటి ఏ కుట్ర కోసం బీజేపీ –టీడీపీ కలయిక?’ ఇక 2019 తర్వాత దేశంలో ఎన్నికలుండవ’న్నదే నిజమా?!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement