గాంధీజీకి మరిన్ని ‘పరీక్షలా’...! | ABK Prasad Article On Liquor Ban Policy In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గాంధీజీకి మరిన్ని ‘పరీక్షలా’...!

Published Tue, May 12 2020 12:18 AM | Last Updated on Tue, May 12 2020 5:41 AM

ABK Prasad Article On Liquor Ban Policy In Andhra Pradesh - Sakshi

మద్య నిషేధం అవసరాన్ని నొక్కి చెబుతూ గాంధీజీ ప్రకటించిన విధాన నిర్ణయంలో చెప్పిన చిరంతన సత్యాలు మనం ఎన్నడూ మరవరానివి. లిక్కర్‌ విషంకన్నా మహమ్మారి. విషం శరీరాన్ని మాత్రమే తినేస్తుంది, కానీ లిక్కర్‌ మనిషి ఆత్మనే తినేస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు మద్యం షాపులన్నింటినీ మూసేసి వాటి స్థానే స్వచ్ఛమైన ఆహారం, తేలికైన ఆహారం ప్రజలకు అందుబాటులో ఉండే ఫుడ్‌ కోర్టులు తెరవాలి. గాంధీజీ ఆనాడు చేసిన సూచనలు ఈనాటికీ ప్రభుత్వాలకు శిరోధార్యమే!

మాటలు కోటలు దాటినా కాళ్లు గడప దాటవన్న సామెతకు మన దేశ రాజకీయ నాయకులే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే మహాత్మాగాంధీ పుట్టిల్లయిన గుజరాత్‌కు పదేళ్లు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత గత ఆరేళ్లుగా దేశ ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మద్యంపై నిషేధాన్ని సడలించివేసి, మందు భాయీలు మద్యం షాపుల దగ్గర అయిదుగురు కన్నా ఎక్కువగా మూగకుండా ‘పని’ పూర్తి చేసుకోవాలని ఒక ఉత్తర్వు జారీ చేయడం ఒక విశేషమే కాదు. పెద్ద సంచలనం కూడా.

లిక్కర్‌ లాబీలు, వారికి వత్తాసుగా ఉన్న మద్యం ఉత్పత్తి దారులైన దేశవాళీ, విదేశీ కంపెనీలు ఎక్కువ కాలం పాటు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో పాలకవ్యవస్థపై తీసు కొచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈ సడలింపును చూడాలి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం జరిగిన సడలింపు అయినందున, సహజం గానే దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాలపైన ‘ఒత్తిడి’ రూపంలో పడు తుంది. ఇంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో మద్యం ఏరులై పారిన విషయం ప్రజలకు అనుభవమే. అప్పట్లో.. కాంగ్రెస్‌ వారు ‘పొడి’ రాష్ట్రాలన్నింటినీ ‘తడి’ చేసి వదిలారన్న నానుడి ప్రజల్లో బాగా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు అదే పద్ధతికి మళ్లీ బీజేపీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా మళ్లడం వెనుక మతలబును తోసి పుచ్చలేం.
(చదవండి: ఆపదలో ఆదుకుంది)

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నేత యువ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ స్వీకారం అనంతరం నవ రత్నాల్లో భాగంగా ప్రజలకు హామీ పడిన మద్యనిషేధాన్ని క్రమానుగ తంగా, అంచెలవారీగా అమలుపరిచి పేద సాదల బతుకుల్ని మెరుగుపర్చడా నికి అనుదిన చర్యలను అనేకం తీసుకుని మంచి ఫలితాలతో ముందుకు సాగుతున్న సందర్భంగా వచ్చి పడిన కేంద్ర నిర్ణయం ఉత్తర్వు.. మొత్తం గాంధీజీ నిర్దేశించిన మద్యపాన నిషేధం పాలసీకే విరుద్ధంగా మారింది.

పైగా మద్యపాన నిషేధ కార్యక్రమంలో దేశానికి ఆదర్శంగా భావించిన గుజరాత్‌కు చెందిన కేంద్ర నాయకులే తాజా సడలింపునకు పాల్పడటం గాంధీ ఆదర్శాన్ని, లక్ష్యాన్ని మంటగలిపి నట్లయింది. ఏపీలో క్రమానుగతంగా మద్యనిషేధాన్ని అమలు పర్చడం ద్వారా.. ఇప్పటికే 45 వేల బెల్టు షాపులను, విచ్చలవిడిగా రాష్ట్రమంతటా నాటి పాలకుడు చంద్రబాబు వ్యాపింపజేసిన వంద లాది మద్యం విక్రయ షాపులను మూయించి వేశారు. మద్యం ధర లను రెండు దఫాలుగా పెంచుకుంటూ వచ్చి దాని వాడకాన్ని కుదిం చేయడంతో పేద, మధ్యతరగతి మహిళలు ఊపిరి పీల్చుకుంటు న్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరింతగా స్వాగతించారు.

గతంలో టీడీపీ నిర్మాత, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ మద్యనిషేధాన్ని ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత కుట్ర ద్వారా అధికారం కైవసం చేసుకున్న ‘దశమగ్రహ’ జామాత చంద్రబాబు ఆ నిషేధాన్ని కాస్తా ఒక్క కలం పోటుతో రద్దు చేసి మద్యం పీపాలను మళ్లీ తెరి పించాడు. దూబగుంట పేద మహిళల నిరంతర పోరాటం అండగా ఎన్టీఆర్‌ విధించిన మద్య నిషేధాన్ని ఒక్క కలంపోటుతో ఎత్తివేసిన ఫలితంగా రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్య విచ్చలవిడి స్థాయికి చేరి పేద, మధ్య తరగతి మహిళలు తీవ్ర ఆందోళనకు గురికావడం మరవరాని చరిత్ర. అనంతరం ప్రజల ఆదరాభిమానాలతో, మన్ననలతో రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్‌ తర్వాత అంతకుమించిన అభిమానాన్ని అఖండ విజయంతో రాష్ట్ర ప్రజలనుంచి జగన్‌ పొందగలిగారు.

దాని ఫలితమే నేడు క్రమా నుగతంగా విజయ పరంపర కొనసాగుతున్న మద్యనిషేధ విధానం. ఈ విషయంలో గతంలో గాంధీజీ అనుసరించిన విధాన రూపకల్పన నుంచే జగన్‌ మద్య నిషేధ విధానం రూపొందింది. తాజాగా మోదీ మద్య నిషేధ విధానంలో ప్రకటించిన వెసులుబాటు ఉత్తర్వును విధిగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం లేదు. కేంద్రం నిషేధపు సడలింపు ఉత్తర్వు అమలులోకి రాగానే ‘కలుగుల్లోంచి బయటపడిన ఎలుకల, పందికొక్కుల మాదిరిగా ఒక్క మద్యం షాఫు తెరవగానే కేంద్రం విధించిన ఐదుగురు చొప్పున మాత్రమే షాపుల వద్ద చేరి మద్యం కొనుగోలు చేయాలన్న నిబం ధనను తుంగలో తొక్కిన ‘మందుబాబు’లు ప్రతిచోటా కిలోమీటర్ల పర్యంతం బారులు తీరి గుమిగూడారని మరచిపోరాదు.

ఇది కేంద్రం తాజా విధానానికి పడిన మరపురాని తూట్లని గుర్తించాలి. అందువల్ల మద్య నిషేధం క్రమంగా సత్ఫలితాలను అందిస్తున్న దశలో కేంద్రం నిర్ణయాన్ని మర్యాద కోసం పాటిస్తే తొలి రోజునే చవిచూడవలసి వచ్చిన అనుభవంతో ముఖ్యమంత్రి జగన్‌ వెనువెంటనే తిరిగి తన పూర్వ విధానాన్ని సజావుగా కొనసాగించడానికే నిర్ణయించడం బహుధా మెచ్చదగిన చర్యగా భావిస్తున్నాను. ఎందుకంటే మద్య నిషేధం అవసరాన్ని నొక్కి చెబుతూ గాంధీజీ ప్రకటించిన విధాన నిర్ణయంలో, ఆదేశంలో చెప్పిన చిరంతన సత్యాలు మనం ఎన్నడూ మరవరానివి.

గాంధీజీ మాటల్లోనే ‘నాయకుడన్నవాడు స్వాభావికమైన, ఆడం బరాలకు దూరంగా జీవించాలి. కప్పల తక్కిడిగా మారిన పాలనా యంత్రాంగాన్ని శుద్ధి చేయాలి. మైనారిటీల యోగ క్షేమాల పట్ల శ్రద్ధ వహించాలి. గ్రామాలను సంచరిస్తూ గ్రామీణ ప్రజలతో కలివిడిగా మెలగాలి, వారిలో తామూ ఒకరమని భావించాలిగానీ ప్రజ లను మించిన వాళ్లమని భావించుకోరాదు. అన్ని గుణాలలో కన్నా ప్రేమకు మించిన సద్గుణం లేదు గాక లేదు’ (28.8.1947). 

అంతేగాదు, మద్యపానాన్ని ప్రోత్సహించడం ద్వారా వచ్చే ఆదా యంతో ప్రభుత్వాలను నడపడం అనే ‘సంస్కృతి’ ఎంత హీనాతి హీనమైనదో వివరిస్తూ గాంధీజీ ఇలా బోధించారు: ‘తాగుడుమీద, మత్తు పదార్థాల మీద చేసే ఖర్చు పరమ వృథాయే గాదు, మనిషి ఆత్మ నిగ్రహాన్ని  కోల్పోయేట్టు చేస్తుంది. ఏ దృష్ట్యా చూసినా దేశానికి మద్య నిషేధం అనేది సజీవ శక్తిని అందించే అసలైన ఔషధం అని మరవ రాదు. మద్యం మత్తు పదార్థాల అమ్మకాల నుంచి పొందే ఎక్సైజ్‌ ఆదాయం మత్తుకు స్వతంత్ర భారత ప్రభుత్వం లొంగిపోరాదు.

మద్యం ద్వారా, మత్తు పదార్థాల అమ్మకాల ద్వారా ప్రభుత్వం పొందే ఆదాయం– దిగజారిపోయి, ప్రజల్ని నాశనం చేసే పన్నుల విధానమని మరవరాదు. ఏ పన్నుల విధానమైనా ఆరోగ్యకరమైనదిగా ఉండా లంటే, పన్ను చెల్లించే వ్యక్తికి పదింతలు ప్రయోజనం కల్గించే పన్నుగా మాత్రమే ఉండాలి. ఆ ప్రయోజనం– పన్ను చెల్లింపుదారుకు ముద రాగా ఒనగూరాల్సిన ప్రయోజనంగా, అవసరమైన సేవలందించే మార్గంగా ఉండాలి. అప్పుడు మాత్రమే తాము నైతికంగా, మానసి కంగా, భౌతికంగా పాల్పడిన తమ అవినీతికి మద్యం రూపంలో చెల్లించాల్సి వచ్చిన ‘ఎక్సైజ్‌’ సుంకమన్న గుర్తింపు కలుగుతుంది.

నిజం చెప్పాలంటే, ఈ బరువు మోయాల్సి వచ్చేదెవరు? ఎవరు భరిం చలేరో ఆ పేద సాదలేనని మరవరాదు. అంతేగాదు, మద్య నిషేధాన్ని అమలు చేయడంవల్ల వచ్చే రెవెన్యూ లోటు అంతంత మాత్రంగానే ఉంటుంది. మద్యం అమ్మకాల ద్వారా గుంజే పన్నును ఉపసంహరిం చుకోవడం వల్ల ఆ చెడు అలవాటు నుంచి విముక్తి పొందిన మందు  బాబు మరో వ్యాపకం ద్వారా ఎక్కువ డబ్బును ఆదా చేసుకోగల్గు తాడు, మంచి పనులకు ఖర్చు చేసుకోగలుగుతాడు. ఈ పద్ధతితో దేశా నికి మంచి జరుగుతుంది. 
(చదవండి: జగన్పై బురద జల్లటమే చంద్రబాబు పని)

ఆల్కహాల్‌కు అలవాటుపడిన వారు సేవించేది విషం. లిక్కర్‌ విషం కన్నా మహమ్మారి. విషం శరీరాన్ని మాత్రమే తినేస్తుంది, కానీ లిక్కర్‌ మనిషి ఆత్మనే తినేస్తుంది. అందువల్ల బుద్ధి ఉన్న ప్రభుత్వాలు లిక్కర్‌ (మద్యం) షాపులన్నింటినీ మూసేసి వాటి స్థానే స్వచ్ఛమైన ఆహారం, తేలికైన ఆహారం ప్రజలకు అందుబాటులో ఉండే ఫుడ్‌ కోర్టులు (ఈనాటి భాషలో) తెరవాలి. మద్య నిషేధంవల్ల మనుషులు భౌతి కంగా శక్తిమంతులవుతారు, బతుకుదెరువుకు ఇంత సంపాదిం చుకొనే శక్తీ వస్తుంది. భారత ప్రజలకిచ్చిన ఈ హామీని మన ప్రభు త్వాలు నెరవేర్చి తీరాలి’ (2.1.1948).

ఈ సందర్భంగా సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వ పాలనలో స్టాలిన్‌.. దేశవాళీ మద్యం, వోడ్కాపై చేసిన ప్రయోగం మళ్లీ గుర్తు చేసుకోవాలి. రష్యా ప్రజలు వోడ్కాను అమి తంగా, అధికంగా సేవిస్తుండటంతో దానికి అడ్డుకట్ట వేయాలనే తలం పుతో స్టాలిన్‌ వోడ్కాలోని మత్తు కలిగించే పదార్థాన్ని పలుచన చేసి (డైల్యూట్‌) సరఫరా చేయించాడు. ఎంత తాగినా మత్తు ఉండదు. మత్తు కలిగించని వోడ్కాపై ప్రజలకు వ్యామోహం చచ్చిపోయింది. ఆనాడు ఈ ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇదంతా విన్న తర్వాత– ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. 

ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? అలాగే గాంధీజీ ఉన్నట్టా, లేనట్టా? గాంధీజీతో పాటు హత్యలో భాగంగా ఆయన ఆశయాలూ, ఆదర్శాలూ మట్టిలో కలిసిపోయాయా? సమాధానాన్ని గాడితప్పి, దారి తప్పిన రాజకీయుల్నుంచి, పాలకుల నుంచీ ఆశించకండి.
-ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement