అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్‌ | CM YS Jagan Comments In Video Conference With PM Modi Amid Lockdown | Sakshi
Sakshi News home page

ఇప్పుడున్న పరిస్థితుల్లో అవెంతో ముఖ్యం: సీఎం జగన్‌

Published Mon, May 11 2020 6:25 PM | Last Updated on Mon, May 11 2020 6:57 PM

CM YS Jagan Comments In Video Conference With PM Modi Amid Lockdown - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల్లో భయం, ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌పై కేంద్రం సూచనలు, సలహాలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. తద్వారా కరోనా పాజిటివ్‌ కేసులను నియంత్రించగలిగామన్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.(గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్‌ సమీక్ష)

ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే మూడు పర్యాయాలు సమగ్ర సర్వే చేపట్టామని ప్రధాని మోదీకి తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. వారందరికీ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా సర్వే కొనసాగించామని ప్రధానికి తెలిపారు. కోవిడ్‌ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమన్న సీఎం జగన్‌... కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారిని సమాజం వేరుగా చూస్తుందన్న భావన నెలకొందని.. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు కరోనా పరీక్షల ముఖ్య ఉద్ధేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోందన్నారు.(సత్ఫలితాలు ఇస్తున్న సీఎం జగన్ నిర్ణయం)

వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సి ఉంది
కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించడం.. అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాల్సి ఉందని సీఎం జగన్‌ అన్నారు. ఈ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో వ్యవహరించాల్సి ఉందని.. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లేలా అప్రమత్తం చేయాలన్నారు. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 85 శాతం కేసుల్లో మైల్డ్‌ సింప్టమ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి... కాబట్టి కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌తో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.(అది మానవుడి సహజ లక్షణం: మోదీ)

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో‌ సీఎం వైఎస్‌ జగన్.. ముఖ్యాంశాలు

  • భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవి.
  • పని ప్రదేశాలు, ఉత్పత్తి కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు), మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఒక స్పష్టమైన ప్రామాణికత (ఎస్‌ఓపీ)ను రూపొందించాల్సి ఉంది.
  • అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజల్లో ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నాం.
  • వాటితో పాటు, టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి.
  • హైరిస్క్‌ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసొలేషన్‌కు సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది.
  • వృత్తాలు గీయడం ద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడం, స్వీయ క్వారంటైన్‌కు సంబంధించి కూడా ఒక వ్యూహం రూపొందించాల్సి ఉంది. 
  • వీలైనంత వరకు వాటి నుంచి బయట పడాల్సి ఉంది.
  • మీడియాలో కరోనాపై భయాందోళనలు పెంచే కథనాల కన్నా, వాస్తవాలను చెబుతూ.. దాదాపు 95 శాతం వరకు ఈ వ్యాధిని నయం చేయవచ్చన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి
  • ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా, ఎవరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించడంతో పాటు, వారి కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా మార్చాల్సి ఉంది.
  • ఆ ప్రక్రియ కోసం ఇప్పుడున్న వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉంది.(గ‌మ్యానికి చేరేవ‌ర‌కు యాప్ ద్వారా ట్రాక్‌)

పలు చర్యలు తీసుకుంటున్నాం...

  • కోవిడ్‌ నివారణ చర్యల్లో ఆస్పత్రుల్లో పడకలతో పాటు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం. కానీ వాటిని ఇంకా ఇంకా పెంచాల్సి ఉంది.
  • వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.
  • రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం
  • పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి వైద్య సేవలు అందించడంతో పాటు, వాటిలో వైద్యులు, నర్సుల కొరత కూడా ఉండబోదు.
  • అదే విధంగా అన్ని ఆస్పత్రులను సమూలంగా మార్చి, జాతీయ స్థాయిలో వాటిని తీర్చి దిద్దాల్సి ఉంది.
  • గ్రామాల్లో పని చేసే క్లినిక్‌లు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంది. ఎవరికి ఏ జబ్బు లక్షణాలు కనిపించినా, ఆ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సలహాలు పొందాలి. అవసరమైతే చికిత్స కూడా అందించాలి. ఆ స్థాయి ప్రమాణాలతో అవి పని చేయాల్సి ఉంది.

స్థానిక సంస్థలకు నిధులు కావాలి

  • కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగాల్సి ఉంది. ఇందుకు స్థానిక సంస్థలకు ఎన్నో నిధులు కావాలి.
  • తయారీరంగం పుంజుకోవాలంటే ముడిసరుకులు అందడం, ప్రజల మూవ్‌మెంట్‌ అనేది చాలా అత్యవసరం.
  • సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. 
  • మా రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. 
  • దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌రంగం మూతపబడి ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేదు.  దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగులు కనిపించి... తీవ్రంగా దెబ్బపడుతోంది. మరోవైపు రాష్ట్రంలో వినియోగం తక్కువ. 
  • రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకూ కనీస మద్దతు ధర ప్రకటించింది.
     

రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలి

  • ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఒక డ్రైవర్‌ సరుకులను ఎక్కడికకైనా సరే తీసుకు వెళ్లగలననే భరోసా ఉండాలి. తనను ఎవ్వరూ కూడా నిర్బంధించరని, క్వారంటైన్‌ చేయరనే నమ్మకం ఆ డ్రైవర్‌కు కలగాలి.
  • సరుకుల రవాణా సాధారణస్థాయిలో జరగకుండా, వలస కూలీలు, కార్మికులు ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేయగలిగే పరిస్థితులు లేకుండా, రాష్ట్రాల సరహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు తలెత్తకుండా... ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కాదు.
  • ప్రజలకు తమ పనులకు వెళ్లాంటే.... ప్రజారవాణా అందుబాటులో లేదు. ప్రజారవాణా రంగంమీద ఉన్న ఆంక్షలను తొలగించాలి. 
  • వలసకార్మికులైనా, విధులకు హాజరయ్యేవారైనా సరే...వారికి ప్రజారవాణా అందుబాటులోకి తీసుకురాలేకపోతే.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోదు. 
  • వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం చూస్తున్నాం. వారు తాము పనిచేసిన చోటుకి తిరిగి రాకపోతే సాధారణ పరిస్థితులు తిరిగి రావు. వారిలో భయం, ఆందోళన తొలగిపోవాలి. 
  • బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలి. ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిచేయాలి. 
  • షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం పాటించాలి, మాస్క్‌లు ధరించేలా చూడాలి. వీటిని సరిగ్గా అమలు చేసేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌లను అందుబాటులోకి తీసుకురావాలి. 
  • భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, వ్యక్తిగత శుభ్రత పాటించేలా నియమాలు, నిబంధనలను తీసుకురావాలి. 

కేంద్రం నిధులు ఇవ్వాలి

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి....ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడానికి కనీసంరూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. కేంద్రం నిధులు ఇవ్వాలి. 
  • ఇందుకు తోడు... వడ్డీలులేని లేదా వడ్డీలు తక్కువగా ఉండే దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి. గ్రామ స్థాయినుంచి బోధనాసుపత్రులవరకూ ఆస్పత్రులన్నింటినీ కూడా జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్దిచేయాలనే లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాం. 
  • రాష్ట్రానికి అవసరమైన మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను కూడా నిర్మిస్తాం. 
  • ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇచ్చే ఈ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని కోరుతున్నాం. 
  • ఇతర రంగాలకు నిధుల కొరతరాకుండా ఈ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నాం.
  • రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి. 9.7లక్షలమంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. 
  • ప్రతి యూనిట్లో కనీసం 10 మంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ రంగానికి చేయూత నివ్వకపోతే... కుప్పకూలిపోతుంది. 
  • ఎంఎస్‌ఎంఈ రంగం స్తంభించిపోతే... నిరుద్యోగం అన్నిచోట్లా పెరుగుతుంది.
  • 6 నెలలు, అంటే 2 త్రైమాసికాలు ఎంఎస్‌ఎంఈలకు వడ్డీమాఫీ చేయాలి.

ఇక వ్యవసాయం విషయానికొస్తే.. ఉద్యానవన పంటలతోపాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలి.

  • సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50శాతానికి పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లను తెరవాలి.
  • రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.... కేంద్ర సహకరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే... పేదలకు మేలు జరుగుతుంది.
  • లాక్‌డౌన్‌ సడలింపు చర్యల సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను.
  • పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement