
ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం వల్ల నాకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలిగింది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలపై బుధవారం ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
► శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ అన్నమయ్య భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడ శ్రీవారి ఫొటో ఉండటం చూసి.. ప్రధాని మోదీ స్వామి వారికి నమస్కారం చేసుకున్నారు.
► ‘మీ (జగన్) వల్ల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. తిరుమలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యి కూడా మీరు (జగన్) వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం’ అన్నారు.
► ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్ల వ్యవస్థ పని తీరు బాగుందని ప్రధాని ప్రశంసించారు. ఈ వ్యవస్థల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, వారికి త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయని అన్నారు.
► గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.