మీ వ్యూహంతో ముందుకు సాగుతాం: సీఎం జగన్‌ | Key Points CM YS Jagan Told PM Modi In Video Conference On Lockdown | Sakshi
Sakshi News home page

ప్రధాని సూచించే వ్యూహంతో ముందుకు సాగుతాం

Published Sat, Apr 11 2020 4:40 PM | Last Updated on Sat, Apr 11 2020 6:52 PM

Key Points CM YS Jagan Told PM Modi In Video Conference On Lockdown - Sakshi

సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి.. వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా విధించిన కరోనా లాక్‌డౌన్‌ గడువు మంగళవారం ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై సీఎం జగన్‌ తన అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు. సామాన్యులపై, రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించిన అంశాలను ప్రధానికి విన్నవించారు. కరోనా కట్టడికి ప్రధానిగా మీరు తీసుకున్న చర్యలను బలంగా సమర్థిస్తున్నానన్న సీఎం జగన్‌... రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది తన అభిప్రాయమని ప్రధానితో పేర్కొన్నారు. మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు.. ప్రజారవాణా, పాఠశాలలపై లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు. వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని... వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గిందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. (ప్రధానితో కాన్ఫరెన్స్‌: అందరి నోట అదే మాట!)

ఇక ఎగుమతులు లేకపోవడం వల్ల ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని.. 90 శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయని సీఎం జగన్‌ ప్రధానికి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి తలెత్తిందని... సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. వలస కూలీలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..  ప్రజల కనీస అవసరాలకు తగినట్లైనా సడలింపులు ఇవ్వాలని సూచించారు. కరోనాపై యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలని.. ఒకే వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.(కోవిడ్-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌)

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌- ముఖ్యాంశాలు

  • కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది
  • 676 మండలాల్లో 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి
  • 44 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి
  • గ్రీన్‌ జోన్‌లో ఉన్న 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదు
  • 141 కంటైన్‌మెంట్ క్లస్టర్లను హాట్‌స్పాట్‌లుగా గుర్తించాం
  • క్రిటికల్ కేర్‌ కోసం 4 అత్యాధునిక ఆస్పత్రులు ఏర్పాటు చేశాం
  • 13 జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం
  • అదనంగా 78  ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నాం
  • ప్రతి జిల్లాలో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం
  • క్వారంటైన్‌ కోసం 26వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి
  • రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం
  • కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నాం 
  • ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు
  • కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి,  వారికి వైద్యం అందిస్తున్నాం

మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక: సీఎం జగన్‌

  • జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధి కల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే
  • లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది
  • నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు
  • రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు
  • మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందికాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం?
  • ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి
  • నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోంది 
  • ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి
  • పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది 
  • రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి కారణమైంది
  • పరిశ్రమలు నడవనప్పుడు... వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం?
  • రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి
  • సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది
  • లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు
  • కోవిడ్‌ని–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను:
  • ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం
  • ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగానైనా నడవాలన్నది నా అభిప్రాయం
  • 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది 
  • రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపనుంది
  • మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే... దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement