ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే దానిపై దృష్టి పెట్టాలని, వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మంగళవారం తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా గన్నవరం విమానాశ్రయం, అక్కడి నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్.. కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడంతో పాటు అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడం కీలకమని చెప్పారు. దీనిపై కూడా నిర్దిష్ట ప్రణాళిక ఉండాలని సూచించారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ ప్రాధాన్యతలు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మోదీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులతో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment