సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం పడిందని.. రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ, ఉద్యానవన, చేపలు, రొయ్యల మార్కెట్లలో కార్యకలాపాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జాతీయ రహదారులతోపాటు రైల్వేల ద్వారా రవాణాను తిరిగి ప్రారంభించాలని తద్వారా ఇండస్ట్రియల్ ఎకానమీకి ఊతం ఇవ్వాలని కోరారు. కోవిడ్–19 నివారణా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా హృదయ పూర్వకంగా మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. సీఎం లేఖలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
ఆర్థిక చక్రం కనీస వేగంతోనైనా నడవాలి
► ఈనెల 11వ తేదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సో్ల రాష్ట్రంపై లాక్‌డౌన్ ప్రభావంపై కొన్ని విషయాలను మీ ముందుంచాను. ఆర్థిక ర«థ చక్రాన్ని వేగంగా పరిగెత్తించలేకపోయినా, కనీస వేగంతో నడపాల్సిన ఆవసరం ఉందని మీకు నివేదించాను.
► ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం. రాష్ట్ర జీఎస్డీపీలో 34 శాతం వ్యవసాయ రంగానిదే. 60 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ దాని అనుబంధ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉన్నారు. 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతుండగా, అందులో 17 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు.
► మిర్చి, అరటి, కొబ్బరి, టమాటా, వంగ, బొప్పాయి, ఆయిల్ పాం, పొగాకు, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ ఉత్పత్తిలో ఏపీదే ప్రథమ స్థానం. వరి, వేరుశనగ, మొక్క జొన్న, మామిడి, మాంసం ఉత్పత్తిలో రెండో స్ధానంలో ఉన్నాం. పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్ధానంలో ఉన్నాం.
► పెద్ద సంఖ్యలో పండ్లను ఉత్పత్తి చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. లాక్‌డౌన్ కారణంగా సఫ్లై చైన్‌కు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయి.
సగం మార్కెట్లు కూడా పని చేయడం లేదు
► లాక్‌డౌన్ కారణంగా దేశంలోనే 50 శాతం మార్కెట్లు మాత్రమే నిర్వహిస్తుండగా.. అందులో కార్యకలాపాలు 20 నుంచి 30 శాతానికి మించి జరగడం లేదు. దీనివల్ల అరటి, మొక్క జొన్న లాంటి పంటల మార్కెటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయం, దాని ఆధారిత రంగాల మీద అత్యధికంగా ఆధారపడి ఉన్న వారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
► అస్సొం, పశ్చ్మి బెంగాల్, బిహార్, యూపీ రాష్ట్రాలలోని మార్కెట్లు మూత పడటం వల్ల నెల రోజులుగా రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్ కావడం లేదు. అమెరికా, యూరప్ దేశాల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఆయా దేశాల్లో మార్కెట్లు ఓపెన్ అయ్యేలా కేంద్రా వాణిజ్య శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇండస్ట్రియల్ ఎకానమీకి ఊతం ఇవ్వాలి
► రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల సిమెంట్, స్టీలు లాంటి రంగాలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయి. నేషనల్ హైవేలతో పాటు రైల్వేల ద్వారా రవాణాను తిరిగి ప్రారంభించాలని తద్వారా ఇండస్ట్రియల్ ఎకానమీకి ఊతం ఇవ్వాలని కోరుతున్నాను.
► ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మందగించడం వల్ల లాక్‌డౌన్ తర్వాత కూడా వ్యాపారాల మీద ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. గూడ్స్, సిమెంట్, స్టీలు, గార్మెంట్స్, ఫుట్వేర్, ఆటోమోటివ్ తదితర రంగాలు లిక్విడిటీ, క్యాష్ ప్లో సమస్యను ఎదుర్కొంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్యాక్టరీలు నడవకుండా మరోవైపు వాటి ఫిక్స్‌డ్ ఖర్చులు తగ్గకుండా వేతనాలు చెల్లించేందుకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటాయి.
► ఈ పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, కోవిడ్–19 నివారణా చర్యల మధ్య సరైన సమతుల్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది.
► ఈ నేపథ్యంలో కోవిడ్–19 నివారణా చర్యల్లో భాగంగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించి.. ఆ మేరకు నియంత్రణ చర్యలను చేపట్టాలన్న ప్రతిపాదన సహా, కోవిడ్–19 నివారణా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా హృదయ పూర్వకంగా మద్దతు తెలుపుతున్నాను.
లాక్‌డౌన్‌తో తీవ్ర ప్రభావం
Published Tue, Apr 14 2020 3:34 AM | Last Updated on Tue, Apr 14 2020 8:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment