రాజ్యాంగం కనుసన్నల్లో గాక తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. అన్ని బాధ్యతా యుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందేనని ఇటీవల సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర మణ వ్యాఖ్యానించడం గమనార్హం. సీజే చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే... ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులూ, కేసులూ ఉన్నా’యని లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించి ఎదురుదాడికి దిగారు. ఈ విధంగా రాజ్యాంగ విభాగాలు లేదా సంస్థల మధ్య పరస్పర విమర్శలు పెరగడం దేశానికి శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య లక్ష్యాలను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అందరి మీదా ఉంది.
మహా కోటీశ్వరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ఎందుకన్నాడోగానీ ఇటీవల ఓ గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు: ‘‘ఈ రోజున ఇంత నీడలో కూర్చుని తీరు బడిగా సేద తీర్చుకుంటున్నామంటే అర్థం– ఏనాడో వెనుక ఏ మహానుభావుడో నీడనిచ్చే ఓ చెట్టును నాటిపోయిన ఫలితమే సుమా’’ అని! అలాగే ఈ రోజున స్వతంత్ర భారత రాజ్యాంగ రచనలో అటూ ఇటుగా కొన్ని హెచ్చుతగ్గులు రంధ్రాన్వేషకులకు తగలొచ్చునేమోగానీ, అంతమాత్రాన మొత్తం రాజ్యాంగ రచనా సంవిధానాన్నే ఎకసెక్కా లకు గురిచేయరాదు.
ఇందుకు అతి తాజా ఉదాహరణగా కేంద్ర స్థాయిలో నడిచే సాధికార విచారణ సంస్థలే పరస్పరం కుమ్ములాట లకు దిగడాన్ని పేర్కొనకుండా ఉండలేం. రాజ్యాంగం కనుసన్నల్లో గాక కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలిక ‘తోలుబొమ్మలాట’గా అధికారం చేపట్టే రాజకీయ పార్టీల నాయకులు తమ చేతివాటం కొద్దీ రాజ్యాంగ సంస్థల్ని తరచూ స్వప్రయోజనాలకు వినియోగించు కోవడం చూస్తున్నాం. కాగా ఇప్పుడు తాజాగా ఈ పుండు న్యాయ వ్యవస్థల్లో కూడా పుట్టి శరవేగాన పెరిగిపోతోంది.
ఇందుకు తాజా ఉదాహరణే... కేంద్రాధికార స్థానంలోని పాలకుల కనుసన్నల్లో మసలే విచారణాధికార సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)... దేశంలోని ‘‘ప్రతీ పేరుమోసిన ఇతర గౌరవ సంస్థల మాదిరే రోజు రోజుకీ ప్రజల దృష్టిలో పడి, దాని విశ్వసనీయతను ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడిందని’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (1.4.2022) ప్రస్తావిం చారు.
ఇదే సందర్భంలో ఆయన దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య లక్ష్యాలను ఎందుకు కాపాడుకోవలసిన అవసరం మరింతగా ఉందో వివరిస్తూ ఇలా అన్నారు: ‘‘భారతీయులం స్వేచ్ఛను ప్రేమిస్తాం. ఆ స్వేచ్చను కాస్తా గుంజుకోవడానికి ఎవరు ప్రయత్నించినా జాగరూ కులైన మన పౌర సమాజం స్వేచ్ఛను హరించజూసే నిరంకుశ వర్గాల నుంచి అధికారాన్ని తిరిగి గుంజుకోవడానికి సంకోచించదు. అందు వల్ల పోలీసులు, విచారణ సంస్థలు సహా అన్ని బాధ్యతాయుత సంస్థలూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి తీరాల్సిందే’’.
ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి ఈ హెచ్చరిక వెలువడిన వెంటనే కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజిజూ మరునాడు... ఆ మాటకొస్తే ‘న్యాయ వ్యవస్థమీద కూడా 1,600కి పైగా ఫిర్యాదులు, కేసులు ఉన్నాయని’ లోక్‌సభలో ప్రకటించడంతో– ఈ పరస్పర ఎత్తి పొడుపుల్లో వేటిని నమ్మాలో, వేటిని కుమ్మాలో సామాన్యులకు, పాలనా వ్యవస్థలు నిర్వహిస్తున్న వారికీ అంతుపట్టని పరిస్థితి! నిజానికి ఒకప్పుడు సీబీఐ అంటే జనంలో విశ్వసనీయత ఉండేది.
చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నపుడు కూడా ఒక దశ వరకు ప్రజలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లగలిగే వారనీ, ఇప్పుడు ఆ విశ్వస నీయత కూడా ప్రజల్లో కలగడం లేదని కూడా జస్టిస్ రమణ గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని ఇకనైనా అడ్డుకోవాలంటే– రాజకీయుల్ని లేదా పాలకుల్ని రాసుకు పూసుకుని తిరగడాన్ని పోలీసులు మానుకోవాలని కూడా హితవు చెప్పాల్సి వచ్చింది. ప్రజా స్వామ్య విలువలతో పాటు మన వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యమై పోతున్నాయో జస్టిస్ రమణ గుర్తు చేస్తున్న సమయంలోనే బీజేపీ మంత్రి రిజిజూ పోటీగా న్యాయవ్యవస్థపైనే ఎదురుదాడికి దిగారు.
ఈ ఎదురుదాడితో మొత్తం పాలకులు, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థల ‘సగులు మిగులు’ ప్రతిష్ఠలు ఏమైనా మిగిలి ఉంటే గింటే, పోయిన విలువ తిరిగి రాదని గ్రహించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనివార్యంగా ఆమోదిం చాల్సి వచ్చిన పథకం– రాజధానుల వికేంద్రీకరణ! కానీ, సుప్రీం పరోక్ష అనుమతితో కొత్తగా రాష్ట్ర హైకోర్టుకు బదలాయించిన న్యాయ మూర్తి ఒకరు ‘రాష్ట్ర రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి’ లేదని శాసించారు.
అలాగే బీజేపీ తన అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ‘మేలమాడుతూ’నే మరోవైపు నుంచి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి నానా బాపతుతో జట్టుకట్టి కలగాపులగం రాజకీయాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాలనా వికేంద్రీ కరణ ప్రతిపాదనలకు స్థూలంగా సమ్మతించి నాటకమాడుతున్న దశలోనే, కేంద్రాధికారాన్ని కూడా ధిక్కరిస్తూ హైకోర్టు కొత్త బెంచ్ నుంచి ‘రాజధానిని మార్చరాదని’ తాఖీదు వచ్చింది.
పైగా హైకోర్టు ప్రకటన ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో.. విడిపోతున్న కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయం కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టులో పలు వురు ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులు ఆదరాబాదరాగా చంద్రబాబు చేసిన అమరావతి భూముల గోల్‌మాల్ విషయమై తిరుగులేని రిట్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు అనుమతించి విచారణకు స్వీకరించింది కానీ, విచారించలేదు. అది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టే లెక్క. అందులో అమరావతి భూములను బాబు ఎలా గోల్‌మాల్ చేసి... మూడు నాలుగు పంటలు పండే భూముల్ని అర్ధరాత్రి ఎలా తాను బయట పడకుండా తన అనుయాయుల ద్వారా తగలబెట్టించి, తప్పుకోజూసి ఎలా అభాసుపాలైందీ ప్రస్తుత హైకోర్టు కూడా తెలుసుకో గలిగితే మంచిది.
అమరావతి భూములను తగులబెట్టించిన పాపాన్ని బాబు, అతని అనుయాయులు ఎవరిమీదికి నెట్టారు? ఆ పంటల దహన కాండను కళ్లారా చూసి గుండె పగిలినంత పనైన ఈనాటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (దళితుడు) పైకి! అతణ్ణి ఎలాగోలా పంట దహన కాండ క్రియలో ఇరికించడానికి బాబు గ్యాంగ్ చేసిన ప్రయత్నాలూ, వేధింపులూ అన్నీ ఇన్నీ కావు. వేటికీ సురేష్ లొంగి కాళ్లుపట్టుకోలేదు గనుకనే–ఎన్నికల్లో అనివార్యంగా పార్లమెంట్ సభ్యుడై గడిచిన యావత్తు చరిత్రకు నిండైన, మెండైన ప్రతినిధిగా నిలబడ్డాడు. అంతకు ముందు, వేధింపులలో భాగంగా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి, ‘నీవే పంట భూములు తగలబెట్టాన’ని ఒప్పుకుంటే ‘బాబు ద్వారానే రూ. 50 లక్షలు నీకు ముడతాయ’ని రకరకాల ప్రలోభాలు పెట్టారు. అయినా లొంగని మొండి ఘటమైనందుననే సురేష్ మాటకి ఈ రోజుకీ అంత విలువన్న సంగతిని న్యాయమూర్తులూ, న్యాయ వ్యవస్థా మరచిపోరాదు.
గౌతమబుద్ధుడు మనకు ఏమి బోధించి పోయాడు? ‘చివరకు నేను చెప్పానని కూడా దేన్నీ నమ్మొద్దు. సొంత బుద్ధితో ఆలోచించి నిర్ణయాలకు రండ’ని చెప్పాడు. అదీ– న్యాయ వాదికైనా, న్యాయ మూర్తికైనా ఉండాల్సిన నీతి, నియమం! ఉమ్మడి హైకోర్టులో నేనూ, ప్రసిద్ధ మాజీ న్యాయమూర్తులూ జమిలిగా అమరా వతి భూముల పంపిణీ తంతుపై వేసిన రిట్ పిటీషన్లు, రిమైండర్లకు ఈ క్షణానికీ జవాబు రావలసే ఉంది. అందుకనే, వాటి తుది తీరు మానానికి మళ్లీ డొంకంతా న్యాయబద్ధంగా మాజీ న్యాయమూర్తులు కదపవలసి వస్తోంది. అంటే అమరావతి భూముల అక్రమ పంపిణీ సమస్య ఇంకా అలాగే ఉండిపోయిందని గౌరవ న్యాయమూర్తులు గుర్తించాలి.
ఆ మాజీ న్యాయమూర్తుల అపరిష్కృత ఫైల్‌కు గౌరవ న్యాయం జరిగే వరకు అమరావతి భూములు అన్యాక్రాంతం కథకు ముగింపు రాదు, ఇతరత్రా ఎన్ని పొంతన లేని మధ్యంతర తీర్పు లొచ్చినా సరే! ‘క్వీన్స్ కౌన్సిల్’ డేవిడ్ పానిక్ అన్నట్టు ‘‘రాజకీయ పాలకులకు నిర్ణయించిన పదవీ కాలం పరిమితమే. కానీ న్యాయ మూర్తులకున్న పదవీ భద్రత పాలకులకు ఉండదు. ఈ పదవీ భద్రత పబ్లిక్ సర్వెంట్లయిన న్యాయ మూర్తులకు మాత్రం ప్రత్యేక వనరు. అందువల్ల జడ్జీలనూ, వారి బాధ్యతల నిర్వహణా తీరునూ, వారి పని తీరునూ స్వేచ్ఛగా, బాహా టంగా విమర్శించవచ్చు. అలాగే, పత్రికలు ఇతర ప్రసార సాధనాలు వెలిబుచ్చే అభిప్రాయాలనూ, విమర్శలనూ జడ్జీలు పట్టించుకోనక్కర లేదు. అలా విమర్శలకు ఉలిక్కిపడే జడ్జీలు, జడ్జీలు కాజాలరు’’!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment