దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం.
‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’.
– సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం.
వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు.
హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి.
ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం:
ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం.
తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి:
‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది.
ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు.
ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది.
అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది.
బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు.
అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్‌షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది.
ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు:
‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే
మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే
నేను నా మాతృభూమికి దేశద్రోహినే
దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే
దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే
దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే
దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే
దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే
ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే
మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే
పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే
మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే
మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి
విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment