కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్‌ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి?
కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు.
సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్‌తో ఉంటుందా? బీఆర్ఎస్‌తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment