తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటాయనే చర్చ మొదలైంది. రాజకీయ పోరులో కమలం ప్లేస్‌లోకి హస్తం పార్టీ రావడంతో లెఫ్ట్ నేతలు సైలెంట్‌గా పరిస్థితిని గమనిస్తున్నారు. గతంలో మాట ఎలా ఉన్నా.. పొత్తుల గురించి ఇప్పుడే ఓపెన్ కావద్దని నిర్ణయించుకున్నారట ఎర్రన్నలు. ముందుగా బలగం ఉన్న నియోజకవర్గాల్లో బలం పెంచుకునే పని ప్రారంభించారట. ఇంతకీ వారి సైలెన్స్ వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం..
కారులోనే అనుకున్నారు, కానీ..
తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత బలం ఉందని చెప్పుకోగల జిల్లా ఏదైనా ఉందంటే.. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ జిల్లాకు చెందినవారే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడానకి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటికే వారిద్దరూ తమ మనసులోని మాట బయటపెట్టారు కూడా. వారు తమ నియోజకవర్గాల్లో చాలా కాలం క్రితమే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన వామపక్షాలు.. సాధారణ ఎన్నికల్లో కూడా కారులోనే ప్రయాణం చేస్తామని గతంలో ప్రకటించారు.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ లెఫ్ట్ పార్టీల మీద కూడా ప్రసరించింది. అందుకే పరిస్థితులు ఎలా మారతాయో అన్న ముందు జాగ్రత్తతో ప్రస్తుతానికి పొత్తుల విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు.
(చదవండి: ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు)
తొందర పడితే ఇబ్బందులు..
కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందు రాష్ట్రంలో కారు, కమలం మధ్యే పోటీ అన్నట్లుగా వార్ జరిగేది. కాని కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అన్నట్లుగా మారింది. ఇప్పుడు బీజేపీ మూడో ప్లేస్‌లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంటే.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తన శక్తినంతా కూడదీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో తొందరపడి పొత్తుల విషయం ప్రకటిస్తే.. అసలుకే ప్రమాదం వస్తుందని లెఫ్ట్ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ.. చర్చించే ముఖ్యాంశాలు ఇవేనా!)
ఎన్నికలు వచ్చేలోగా తమకు పట్టు ఉన్న 30 సెగ్మెంట్లలో బలం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలని డిసైడయ్యారు. ఇద్దరం కలిసికట్టుగా ఉంటే.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చని, లేదంటే అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా మండలి సీటు ఇస్తామని మభ్య పెట్టే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నాయి.
తమకు తాముగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపించకూడదని, బలాన్ని పెంచుకుంటే అటు కాంగ్రెస్ గాని.. ఇటు బీఆర్ఎస్ గాని ఎవరో ఒకరు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకే మరికొంతకాలం మౌనం పాటించనున్నట్లు తెలుస్తోంది.
మనమే తొందరపడి సర్దుబాటు కోసం ప్రయత్నిస్తే డిమాండ్ పడిపోద్దని లెఫ్ట్ పార్టీల నాయకత్వం భయపడుతోంది. అలాగాకుండా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల వైపు నుంచి పొత్తుల ప్రతిపాదన వస్తే మనం డిమాండ్ చేయవచ్చని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. కారు, హస్తం ఏదైనా ఒక్కటే.. ఇచ్చే సీట్లను బట్టే పొత్తులు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-సాక్షి, పొలిటికల్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment