
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్‌ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్‌లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను అపాయింట్‌మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్‌ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు...
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్‌ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్‌ఎస్‌ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి.
చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్‌లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్‌ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి.
అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం.