సమావేశంలో ఐక్యత చాటుతున్న సీపీఐ, సీపీఎం నేతలు సీతారాములు, కూనంనేని, తమ్మినేని, చాడ వెంకట్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజకీయం అంటేనే మోసమనే నిర్వచనం ఇచ్చారని, మిత్ర ధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వామపక్షాలు మండిపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించాయి. ‘‘సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టంలేదు. నష్టపోయేది కేసీఆరే. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు సఖ్యత ఏర్పడింది.
బీజేపీ అండ ఉంటే చాలనుకుంటోంది. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రమాదమని చెప్పారు. మరిప్పుడు బీజేపీ ప్రమాదం కాదా? మిత్రధర్మం పాటించరా? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్‌ఎస్ ఏమయ్యేది? ఆ ఎన్నికల్లో కేసీఆరే మా అండ కోరారు. తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని చెప్పారు. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని పరిణామం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం’’ అని వామపక్షాల నేతలు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం, పొత్తు మాట ఇంకెక్కడిదని స్పష్టం చేయడంతో కంగుతిన్న సీపీఐ, సీపీఎం నేతలు.. మంగళవారం వేర్వేరుగా, తర్వాత ఉమ్మడిగా సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రెండు పార్టీలకు చెందిన నేతలు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, చెరుపల్లి సీతారాములు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ తదితరులు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయమేదీ తీసుకోలేదు..: కూనంనేని
15 రోజుల క్రితం బీఆర్‌ఎస్ నేతలు వినోద్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావులతో పొత్తులపై చర్చ జరిగిందని.. తమకు చెరో అసెంబ్లీ సీటు (సీపీఐకి మునుగోడు, సీపీఎంకు భద్రాచలం), రెండేసి ఎమ్మెల్సీలు ఇస్తామన్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధమైన పొత్తుకు అంగీకరిస్తే, అప్పటికప్పుడే చెరో ఎమ్మెల్సీని గవర్నర్ కోటాలో ఇస్తామన్నారని.. ఎమ్మెల్సీ సంగతేమో కానీ, చెరో మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని అడిగామని వివరించారు. ‘‘ఇదే సమయంలో బీఆర్‌ఎస్ బృందం తమ రాజకీయ వైఖరిని కూడా బయటపెట్టింది.
బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలసి ఉన్నాయని.. అలా ఉండటం తమకు ఇష్టంలేదని పేర్కొంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములకు బీఆర్‌ఎస్ వ్యతిరేకమని కేసీఆర్ మాకు స్పష్టం చేయాలన్నారని బృందం వివరించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను, బీజేపీని ఓడించడం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్తాం..’’ అని కూనంనేని తెలిపారు కాంగ్రెస్‌తో పొత్తుపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వామపక్షాల సాయం లేకపోతే బీఆర్‌ఎస్ మునుగోడులో గెలిచేదా? అని ప్రశ్నించారు. బీజేపీ మునుగోడులో గెలిచి ఉంటే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేవారు కాదా అని వ్యాఖ్యానించారు.
రాజకీయ వైఖరిలో తేడా వల్లే..: తమ్మినేని
మునుగోడులో బీజేపీని ఓడించటం కోసమే బీఆర్‌ఎస్‌తో కలిశామని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఏకంగా ఉండాలనేది తమ నిర్ణయమని తమ్మినేని వీరభద్రం వివరించారు. తాము అడిగినన్ని సీట్లు కేసీఆర్ ఇవ్వలేదనే ప్రచారం తప్పు అని, రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వైఖరిని తమకు వెల్లడించారన్నారు.
‘‘బీజేపీకి వ్యతిరేక నిర్ణయానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో కలవద్దని బీఆర్‌ఎస్ నేతలు షరతు విధించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ తమకు ప్రధాన రాజకీయ శత్రువు కాబట్టి అందులో ఉండబోమని చెప్పారు. ‘ఇండియా’ కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నందువల్ల మాతో పొత్తు పెట్టుకోలేదని భావిస్తున్నాం. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి..’’ అని తమ్మినేని చెప్పారు.
బీఆర్‌ఎస్ నేతలు పొత్తుపై తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, నేరుగా అభ్యర్థులను ప్రకటించడం సమంజసం కాదన్నారు. తమకు ఎమ్మెల్సీలు వద్దని, ఎమ్మెల్యే సీట్లు కావాలని అడిగామని, అదీ ఎక్కువ సీట్లేమీ అడగలేదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఎక్కువ పోరాటాలు చేసింది తామేనని, కేసులు కూడా ఎక్కువగా తమపైనే ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment