సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా ఉన్న ఆ పార్టీతో జత కట్టాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. పైగా దేశంలో ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ స్వయంగా ఆహా్వనిస్తేనే ముందుకు సాగాలని, అప్పటివరకు వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పొత్తుల విషయంలో ప్రజల్లో పలుచన కాకుండా హుందాగా ముందుకు సాగాలన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం.
బీఆర్‌ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయం
దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. మతోన్మాదం పెరుగుతున్నందున, బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీలు ఏవైనా సరే వాటితో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఆ ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. గతేడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేసే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని భావించి ఆ పార్టీతో సీపీఐ, సీపీఎంలు జతకట్టాయి. అప్పుడు వాటి ఓట్లతోనే బీఆర్‌ఎస్ గట్టెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన సభలోనూ సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని తమ ఐక్యత చాటారు. కానీ కేసీఆర్ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టుల పొత్తుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మావైపు రండి. మీరు అడిగినన్ని సీట్లు ఇస్తామని’గతంలో కాంగ్రెస్ నేతలు లెఫ్ట్ నేతలతో అన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని లెఫ్ట్ పార్టీలు పెడచెవిన పెట్టాయి.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకుంటే.. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దీనివల్ల అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి బీఆర్‌ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టాలని లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నాయి.
ఇప్పుడు రెండే ప్రత్యామ్నాయాలు
ఇప్పుడు కమ్యూనిస్టుల ముందున్నవి రెండే ప్రత్యామ్నాయాలు. ఒకటి కాంగ్రెస్‌తో కలిసి నడవడం, రెండోది వామపక్ష, ఇతర పార్టీలతో జతకట్టి ముందుకు సాగడం. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే చెరి ఐదు అసెంబ్లీ స్థానాలు తప్పక సాధించాలన్నది ఆ పార్టీల యోచన. గౌరవప్రదమైన స్థానాలను కేటాయించడంలో కాంగ్రెస్ విఫలమైతే, రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరి 25 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి.
బీజేపీని ఓడించడం తమకే కాదు ఆయా ప్రతిపక్షపార్టీలకు కూడా అవసరమేనంటున్నారు. తాము గెలవకపోయినా, ఓడించే సత్తా మాత్రం ఉందంటున్నారు. తమకంటే వారికే తీవ్రమైన నష్టమంటున్నారు. అధికారం కావాలంటే తమ అవసరం ఆయా పార్టీలకు ఉందంటున్నారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు కృతనిశ్చయంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment