తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్. రవి
రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం బాబూ రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాతి పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసింపజూస్తూ వస్తున్నాయి.
ఆ ధోరణిలో భాగమే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ రాష్ట్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! మరీ విచిత్రమైన విషయం.. వలసపాలనలో గవర్నర్‌లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకు, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకు మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు.
ఒకనాడు తమదంటూ ‘చిరునామా’ కూడా లేక పరాయి పంచల్లో బతుకుతోన్న తెలుగువారిని వెన్ను తట్టి వేల సంవత్సరాల తెలుగు భాషా, సాంస్కృతిక మూలాలను గుర్తు చేసి వారిలో చైతన్యం నింపిన మహా నాయకులెందరో! ఆ నాయకులలో ఆచరణశీలురు, ఉద్యమస్ఫూర్తి ప్రదాతలు అయిన పొట్టి శ్రీరాములు, ఎన్.టి. రామారావు ముఖ్యులు.
ఆంధ్రోద్యమ ఉద్ధృతిలో ఈ ఇరువురి ప్రవేశం ఉత్తరోత్తర భారతదేశ ఫెడరల్ స్ఫూర్తికే తలమానికంగా నిలిచింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారిలో 112మంది కన్నడిగులు కాగా, కన్నడ తెలుగువారు 69మంది! ఈ విశిష్టతను వెల్లడిస్తూ ఒక కన్నడ తెలుగు మిత్రుడు ఒక లేఖను విడుదల చేశారు.
దాని సారాంశం – ‘‘ఆంధ్ర, తెలంగాణాలు మట్టుకే తెలుగు తావులు కావు. తెలుగు నేల ఎంత పెద్దదంటే, విందెమల నుండి వానమాముల వరకూ, వంగ కడలి నుండి పడమటి కనుమల దాకా పరుచుకున్నది తెలుగు నేల. ఈ నేలను కొన్ని కోట్ల మంది తెలుగువారితో పాటు కన్నడిగులు, తమిళులు, ఒరియా, మరాఠీ, గోండీ వాళ్లూ పంచుకుని ఉన్నారు.
ఈ క్రమంలో తెలుగు ‘నుడి’ అన్నది భాషా సంబంధమైన నుడికారాలు, నానుడుల సంపదలో బాగా నష్టపోయింది. తెలుగు జాతికి గల ఈ సంపదను గుర్తించాల్సింది బయటి వాళ్లు కాదు, తెలుగు వాళ్లమైన మనమే’’నని కన్నడ – తెలుగు సోదరులు జ్ఞాపకం చేయవలసి వచ్చింది! తెలుగు జాతికి గల అటువంటి సంపద గుర్తింపునకు ఉద్యమరూపంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు పదహారణాల ఆంధ్రులైన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్.
దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందని అందరూ సంబరపడుతున్న వేళ .. ఆ ముహూర్తాన్ని ముమ్మూర్తులా అనుభవించడానికి నోచుకోనిది పరాయి పంచన జీవిస్తున్న మహోన్నత చారిత్రక, సాంస్కృతిక చరిత్ర గల ఆంధ్రులేనన్న సంగతి మరచిపోరాని ఘట్టం! నాటి చీకటి రోజుల నుంచి ఆంధ్రులను చైతన్యంలోకి, ఆచరణలో తీసుకురావడంలో పొట్టి శ్రీరాములు, ఎన్టీ రామారావుల పాత్ర అనుపమానం! అలాగే, అడుగడుగునా కేంద్ర పాలకులపైన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆధారపడే పాలకవర్గ సంస్కృతిని రాష్ట్రాలు చేధించేటట్టు చేసిన ఖ్యాతి ఎన్టీఆర్‌ది! కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేవలం ఫెడరల్ సంబంధాలే గాని, కేంద్ర పాలకులకుల యుక్తులపై ఆధారపడేవి కావని చాటి చెప్పి రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి దోహదం చేశారాయన. అలా పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ల దూరదృష్టి ఫలితమే నేడు దేశంలోని పలు కాంగ్రెస్, బీజేపీ పాలకుల కుయుక్తులకు అడ్డుకట్టలు వేయడానికి అవకాశమిస్తోంది!
రాష్ట్రాల అధికారాలను కేంద్ర పాలక వర్గ పార్టీలు మింగేయడం, ఎన్నడూ లేని విధంగా గవర్నర్ల అధికారాలకు కొమ్ములు మొలవడం డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉన్నంతవరకూ మనం ఎరగం! ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ పాలక వర్గాల ఇష్టానుసార పరిపాలనకు ఉత్తరప్రదేశ్‌కు పార్లమెంటులో అత్యధికంగా ఉన్న 80 స్థానాలు ఆసరా అయి, దేశ రాజకీయాల్ని శాసిస్తూ దక్షిణాది రాష్ట్రాల్ని శాసించజూస్తూ వస్తున్నాయి. కనుకనే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా అక్కడి గవర్నర్ మంత్రుల్ని బర్తరఫ్ చేయడానికి సాహసించడం! రాజ్యాంగ నియమాలను త్రోసిరాజని పలువురు గవర్నర్లు వ్యవహరిస్తున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణలు... మణిపూర్, త్రిపురలు! చివరికి, ఆదివాసీలు అటవీ భూముల్ని సాగు చేసుకుని బతికే హక్కును చట్టరీత్యా సుప్రీంకోర్టు ఏనాడో (1996 లోనే) అనుమతించి రక్షణ కల్పించినా, ఆ చట్టంలోని పలు రక్షణ నిబంధనలను సవరింపజేసి ఆ భూముల్ని అధికార పక్ష మోతుబరులు అనుభవించడానికి వీలు కల్పించేలా పాలకులు తాము ‘బ్రూట్’ మెజారిటీ అనుభవిస్తున్న పార్లమెంటు ఆమోదం కోసం పంపడం జరిగింది!
అలాగే ఢిల్లీ చుట్టూ రాష్ట్రాల పాలకుల్ని తిప్పించాలనుకునే ‘సంస్కృతి’కి కాంగ్రెస్, బీజేపీ పాలకులు అలవాటు పడ్డారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలలోని కొన్ని ప్రతిపక్ష పాలకులూ ఢిల్లీకి సలాం కొడుతున్నారు! రాజ్యాంగ ఫెడరల్ స్వభావానికి విరుద్ధమైన కేంద్ర పాలకుల ధోరణికి మరొక తిరుగులేని ఉదాహరణ... 2002లో గుజరాత్ ప్రభుత్వం ప్రజలపై అమలు జరుపుతున్న దమనకాండను నిరసిస్తూ ఉద్యమించిన నేరానికి తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేసి సుప్రీంకోర్టు ఆమెకు కల్పించిన వెసులుబాటును సహితం పనిగట్టుకుని ఏళ్ల తరబడిగా వ్యతిరేకిస్తూ ఉండటం! శ్రీమతి సెతల్వాడ్ మహిళ అయినందున సి.ఆర్.పి.సి 437 నిబంధన ప్రకారం అందవలసిన సౌకర్యాలు ఆమెకు అందాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రస్తుత పాలకులు ఆమెపై వేధింపులు మానలేదు.
అంతేగాదు, మరీ విచిత్రమైన విషయం.. వలస పాలనలో గవర్నర్‌లుగా పనిచేసిన వారు చలాయించిన అధికారాలకూ, స్వతంత్ర భారతంలో గవర్నర్ల అధికారాలకూ మధ్య భేదాన్ని కూడా గ్రహించలేనంతగా దృష్టి లోపంతో ఉన్నారు నేటి పాలకులు. కనుకనే స్వతంత్ర భారత లోక్‌సభకు సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పి.డి.టి. ఆచార్య బ్రిటిష్ వలస పాలనలోని గవర్నర్ల పాత్రకూ, స్వతంత్ర భారత రాష్ట్రాల్లోని గవర్నర్ల పాత్రకూ స్వభావంలోనే పొసగదని తేల్చేశారు.
అనేక కేసుల్లో స్వతంత్ర భారత సుప్రీంకోర్టు, స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం లేదా ఆమోదం మేరకే రాష్ట్ర గవర్నర్లు నడుచుకోవాలని 1974 నాటి అనేక కేసులలో ఏడుగురు న్యాయమూర్తులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది! (షంషేర్ సింగ్ – స్టేట్ ఆఫ్ పంజాబ్).
ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి సొంత నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధ ప్రకటనలూ తమ వద్ద చెల్లవని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బాహుటంగానే ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యానికి, మతాతీత, సామాజిక న్యాయ వ్యవస్థకు, సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థకు, లౌకిక రాజ్యాంగానికే డి.ఎం.కె కట్టుబడి ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు.
ఎప్పుడైతే ఒక దేశం, ఒక పాలకుడు, ఒకే ప్రభుత్వం, ఒకే ఎన్నిక తన లక్ష్యమని ప్రధాని ప్రకటించారో ఆ రోజునే దేశ భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. అయితే ఈలోగా సామాజిక స్పృహ కలిగిన డి.వై చంద్రచూడ్ లాంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టును 2025 చివరి వరకూ అధిష్ఠిస్తారన్న ‘చేదు నిజాన్ని’ తాను భరించాల్సి వస్తుందని ప్రధాని బహుశా అనుకొని ఉండరు! అసలు విషాదం అంతా అందులోనే దాగి ఉంది! ఎందుకంటే–
ఓ మహా కవి అననే అన్నాడు గదా...
‘‘చిటికెడు పేరు కోసం నీతిని నిలువునా చీల్చేస్తుంది స్వార్థం
మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.i
Comments
Please login to add a commentAdd a comment