
ఆ 400 ఎకరాలు తమవి కావనిహెచ్‌సీయూతో ప్రకటన చేయించాల్సింది
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌తో భేటీలో వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ నేతలు
బెంగళూరు వర్సిటీ తరహాలో హెచ్‌సీయూలోనూ బయోపార్కుఅభివృద్ధి చేయాలని సూచన
అన్ని విషయాలు మంత్రుల కమిటీకి చెప్తానన్న మీనాక్షి..
వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ విభాగం అధ్యక్షురాలికి షోకాజ్ సరికాదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘ఆ 400 ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. మార్చి రెండో వారంలోగా ఆ భూమిపై హక్కుల్లేవని యూనివర్సిటీ చేత అధికారికంగా చెప్పించి ఉంటే ఇంత అలజడి రేగేది కాదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటినందున విద్యార్థుల వాదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకెళ్తే బాగుంటుంది’అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌కు సూచించారు.
అలాగే పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడంతోపాటు ప్రభుత్వ వాదనను యూనివర్సిటీ రిజిస్టర్ వ్యతిరేకించడంతోనే సమస్య మొదలైందన్నారు. శనివారం గాంధీ భవన్‌లో హెచ్‌సీయూకు చెందిన ఎన్‌ఎస్‌యూఐ నేతలతో మీనాక్షీ నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, చల్లా వంశీచందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, సెంట్రల్ వర్సిటీ అధ్యక్షురాలు నేహా జయరాజ్, రచనారెడ్డి, ప్రభాకర్, షరీఫ్, శ్రీరామ్, మాజీ విద్యార్థి నేత బైకాని లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ వాదనలను మీనాక్షికి వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వర్సిటీ వర్గాల నుంచి అధికారిక ప్రకటన చేయించాలని కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. అన్ని విషయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తానని.. విద్యార్థులు ఆందోళన చెందొద్దని మీనాక్షి భరోసా ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆమె ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలతో భేటీకానున్నారు.
కాజ్ కోసం పోరాడుతుంటే షోకాజ్ ఇవ్వడమేంటి?
వర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ విభాగం ‘నో టైగర్స్, నో డీర్స్... నో సెన్స్’పేరుతో పోస్టర్ వేయడం సంచలనం కలిగిస్తోంది. పోస్టర్‌లోని అంశాలు, సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరుషంగా ఉండటం, విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ విభాగం అధ్యక్షురాలు నేహా జయరాజ్‌కు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవెల్లి వెంకటస్వామి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ వ్యవహారంపై 48 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వా లని పేర్కొన్నారు.
అయితే ఈ షోకాజ్‌కు హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ విభాగం కూడా తీవ్రంగానే స్పందించిందని, వర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐని కాపాడేందుకే తాము విద్యార్థుల పక్షా న ఉండాలని నిర్ణయించామని బదులిచ్చినట్లు సమాచారం. మరోవైపు మీనాక్షితో భేటీలో ఈ వ్యవహారం చర్చకొచ్చింది. విద్యార్థుల కోసం పోరాడుతున్న తనకు సంజాయిషీ నోటీసు ఎందుకు ఇచ్చారని నేహా జయరాజ్ ఆవేదన వ్యక్తం చేయగా కాజ్ కోసం పోరాడుతుంటే షోకాజ్ ఇవ్వడమేంటని మీనాక్షి తప్పుబట్టారు. నోటీసును ఉపసంహరించుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని ఆదేశించారు.
మీనాక్షికి హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ నేతల డిమాండ్లు
» వర్సిటీ విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలి.
» పోలీసులు అరెస్ట్ చేసిన ఎర్రం నవీన్, రోహిత్‌లను విడుదల చేయాలి. క్యాంపస్ నుంచి పోలీసులను బయటకు పంపాలి. ళీ ఆ 400 ఎకరాల ప్రాంతంలో మళ్లీ చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలి.
» వర్సిటీ భూములను అధికారికంగా బదిలాయించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
» వర్సిటీకి ఉన్న మొత్తం భూవిస్తీర్ణం.. గత 30 ఏళ్ల భూకేటాయింపులపై వర్సిటీ వర్గాలతో ప్రకటన చేయించాలి.
» ఈ ప్రాంతంలో పర్యావరణ ప్రభావం ఎంత మేర ఉంటుందన్న దానిపై సమగ్ర అధ్యయనం జరిపించాలి.
» బెంగళూరు యూనివర్సిటీ తరహాలో హెచ్‌సీయూలోనూ పర్యావరణహిత బయోపార్కును అభివృద్ధి చేయాలి.