
హిందూరాజ్యంగా మార్చే కుట్ర
మోదీ సర్కార్‌పై రాజ్యసభలో విపక్షం ధ్వజం
♦ తిప్పికొట్టిన ప్రభుత్వం
♦ దేశంపై విద్వేషం చిమ్మితే అది భావ ప్రకటన స్వేచ్ఛా?
న్యూఢిల్లీ: హెచ్‌సీయూ, జేఎన్‌యూల్లో ఉద్రిక్తతలపై గురువారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. సీపీఎం నేత సీతారాం ఏచూరి చర్చను ప్రారంభిస్తూ.. లౌకిక భారతదేశాన్ని మతాధికార, ఫాసిస్ట్, హిందూ రాజ్యంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ రెండు వర్సిటీల్లో అన్ని అంశాలపై విచారణ జరిపేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చర్చలో జోక్యం చేసుకుంటూ కేంద్రమంత్రి జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను విమర్శించారు.
జేఎన్‌యూ ఘటనలపై కాంగ్రెస్ స్పందనను ప్రస్తావిస్తూ.. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారిని సమర్థించి.. వారి దేశ విచ్ఛిన్న సిద్ధాంతానికి ఉద్యమస్థాయి గౌరవం కల్పించారు’ అని రాహుల్‌పై ధ్వజమెత్తారు. ప్రధానిగా ఉండగా ఇందిరాగాంధీ సైతం జేఎన్‌యూలో పోలీసుల ప్రవేశాన్ని సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘దేశానికి వ్యతిరేకంగా విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛగా భావించవచ్చా?’ అని జైట్లీ ప్రశ్నించారు. ఏచూరి మాట్లాడుతూ.. ‘హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, జేఎన్‌యూలో కన్హయ్యపై దేశద్రోహం కేసు.. ఇవి వేర్వేరు అంశాలు కాదు.. ఇవి ఒక పెద్ద కుట్రలో భాగం’ అని అన్నారు.
కన్హయ్య విచారణ సందర్భంగా పటియాలా హౌజ్ కోర్టులో విధ్వంసానికి కేంద్రం, ఢిల్లీ పోలీసే కారణమన్నారు. ఏచూరి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ స్పందిస్తూ.. జేఎన్‌యూలో నిందిత విద్యార్థులు చేసింది దేశ వ్యతిరేక నినాదాలని గుర్తు చేశారు. చివరగా, హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ చర్చకు సమాధానమిచ్చారు. ముందురోజు లోక్‌సభలో నిప్పులు చెరిగిన ఇరానీ.. గురువారం రాజ్యసభలో కాస్త నెమ్మదించారు. జేఎన్‌యూ వివాదం, రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ప్రభుత్వ తీరును సమర్ధించారు. ఏచూరిలా తాను మేధావిలా ప్రసంగించలేనన్నారు. మొత్తం ఉదంతంలో తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ప్రసిద్ధ నాటకం మెక్‌బెత్‌లోని ఓ డైలాగ్‌ను ఉటంకించారు. విద్యను కాషాయీకరిస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. వామపక్ష ఎంపీ భార్యను ఐసీహెచ్‌ఆర్ సభ్యురాలిగా ఎన్డీయే ప్రభుత్వం నియమించిందన్నారు. వీసీల నియామకాల్లో రాజకీయాలు చేసింది కాంగ్రెసేనని ధ్వజమెత్తారు.
దుర్గామాతపై అసభ్యకర కరపత్రాలు
జేఎన్‌యూలో దుర్గామాతకు సంబంధించి అసభ్యకర రీతిలో కరపత్రాలు లభించాయంటూ.. కరపత్రాల్లోని అంశాలను చెబుతుండడంతో.. ముందుముందు ఇతర మతాల దైవాలను దూషించిన ఘటనలను సభలో ఇదేవిధంగా ప్రస్తావించే అవకాశముందని చెబుతూ స్మృతి తీరును కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ తప్పుబట్టారు. స్మృతి తన ప్రసంగాన్ని కొనసాగించడంతో, సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను డెప్యూటీ శుక్రవారానికి వాయిదా వేశారు.
సభ మనసు దోచిన గడ్కారీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్డు భద్రతపై పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘ భారీ ట్రక్కుల్లోనూ డ్రైవర్లకు ఏసీ కేబిన్ ఉండేలా తప్పనిసరి చట్టం తీసుకురానున్నాం’ అని అన్నారు. . ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ‘ట్రామా సెంటర్’ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ‘ మీలో ఎందరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి లెసైన్సుకు దరఖాస్తు చేస్తున్నారు?’ అని అనటంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి.
ఢిల్లీ పోలీస్ భేష్..
ఢిల్లీలో శాంతిభద్రతలపై రాజ్యసభలో చర్చకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. జేఎన్‌యూ, కోర్టు ఘటనల్లో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. తప్పుడు వీడియో ఆధారంగా విద్యార్థులపై కేసు పెట్టడాన్ని, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నా పటియాలా కోర్టులో హింసకు పాల్పడినవారిపై కనీసం చర్యలు తీసుకోకపోవడాన్ని పోలుస్తూ కేంద్రం, పోలీసులను విమర్శించారు. అనంతరం, పటియాలా నిందితులను కాపాడ్డానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్, వామపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. ఈ తీర్మానం సభలో చర్చకొచ్చినపుడు హోం శాఖ తరఫున ఎవరూ లేకపోవడంపై డెప్యూటీ చైర్మన్ ఆగ్రహించారు.
కశ్మీర్‌లో ఆత్మాహుతి దళ సభ్యుడి అరెస్టు
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్‌కు చెందిన పాకిస్తానీ ఆత్మాహుతి దళ సభ్యుడు మొహమ్మద్ సాదిక్ గుజ్జర్(17)ను జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా దళాలు అరెస్టు చేశాయి. మూడు మాసాల కిందట కుప్వారా జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన వారిలో గుజ్జర్ ఒకడని సైనిక ప్రతినిధి ఎస్‌డీ గోస్వామి చెప్పారు. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ దస్కా నివాసితుడు వాలిద్ మొహమ్మద్ గుజ్జర్ తనయుడిగా ఇతడిని గుర్తించినట్టు తెలిపారు. ‘గత నవంబర్ 25న కుప్వారా జిల్లా తంగ్‌దార్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల్లో గుజ్జర్ ఒకడు.