
టాప్ 10లో జేఎన్ యూ, హెచ్ సీయూ
♦ దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీలుగా ఘనత
♦ ఎన్‌ఐఆర్‌ఎఫ్ నివేదికను విడుదల చేసిన కేంద్రమంత్రి ఇరానీ
న్యూఢిల్లీ: వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్‌యూ), హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్‌సీయూ) అరుదైన ఘనత సాధించాయి. దేశంలోనే అత్యుత్తమ వర్సిటీల్లో ఈ రెండు టాప్ 10లో నిలిచాయి. మరోవైపు సాంకేతిక విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ఐఐఎం-బెంగళూరు అగ్ర స్థానం దక్కించుకున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) నాలుగు కేటగిరీల్లో 3,500 విద్యా సంస్థలపై చేసిన అధ్యయనం ద్వారా రూపొందించిన ర్యాంకుల నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ సోమవారం విడుదల చేశారు.
వార్షిక ప్రక్రియగా ర్యాంకు విధానాన్ని ప్రారంభించామని, ఎక్కువ కేటగిరీ లను చేర్చడం ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ముందే ఆ విద్యా సంస్థకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. వర్సిటీల విషయానికొస్తే.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు(డీమ్డ్ వర్సిటీ) అగ్రస్థానంలో నిలిచింది. జేఎన్‌యూ అన్ని సెంట్రల్ వర్సిటీల్లో ముందు నిలిచింది. దానికి మూడో ర్యాంకు దక్కింది.
హెచ్‌సీయూ 4వ అత్యున్నత వర్సిటీగా నిలిచింది. సాంకేతిక విద్యా సంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్‌కు ఏడో ర్యాంక్ వచ్చింది. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ఐఐఎం-బెంగళూరు తొలిస్థానం దక్కించుకుంది. ఫార్మసీ విద్యలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అగ్ర స్థానంలో నిలిచింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, తదితరుల పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.