సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల జాబితాలో తెలంగాణ వర్సిటీల పంట పండింది. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల ర్యాంకులు గతేడాది కంటే ఈసారి మెరుగయ్యాయి. దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు 2016 నుంచి కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) బోధన, వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ – 2019 ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ ర్యాంకును సాధించింది. మన రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు కూడా ర్యాంకులజాబితాలో స్థానం దక్కింది. సోమవారం ఢిల్లీలో ఈ ర్యాంకులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ రీసోర్సెస్, రీసర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్, ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పర్సెప్షన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంహెచ్‌ఆర్‌డీ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్‌లో 83.88 పాయింట్లతో ఐఐటీ మద్రాసు మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్థానంలో నిలించింది. ఇందులో ఉన్నత విద్యాసంస్థలకు ఓవరాల్ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో, యూనివర్సిటీల విభాగంలో, మేనేజ్‌మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, లా, ఆర్కిటెక్చర్, మెడికల్ కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది.
ఓవరాల్ కేటగిరీలో 4 విద్యాసంస్థలు
ఓవరాల్ కేటగిరీలో టాప్–100లో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలు ర్యాంకులను సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో (ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 61.85 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 11వ స్థానమే లభించింది. గతేడాది 56.92 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఐఐటీ ఈసారి కూడా 26వ స్థానంలో నిలువడం గమనార్హం. 2017–18లో 45వ ర్యాంకు సాధించిన ఉస్మానియా వర్సిటీ ఈసారి తమ ర్యాంకును మెరుగు పరుచుకుంది. 49.86 పాయింట్లతో 43వ ర్యాంకును సాధించింది. ఇక 46.06 పాయింట్లతో వరంగల్ ఎన్‌ఐటీ ఈసారి 61వ ర్యాంకును సంపాదించింది. గతేడాది వరంగల్ నిట్ 78వ స్థానంలో నిలిచింది. ఇక 101–150 ర్యాంకుల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. 151–200 జాబితాలో.. ఇఫ్లూతోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి.
ఇంజనీరింగ్ కేటగిరీలో..
ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్‌కు 8వ స్థానం, వరంగల్ ఎన్‌ఐటీకి 26వ స్థానం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీకి 39వ స్థానం, హైదరాబాద్– జేఎన్‌టీయూకు 45వ స్థానం, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 83వ స్థానం లభించింది. వీటితోపాటు 101–150, 151–200 స్థానాల్లో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చోటు సంపాదించుకున్నాయి. ఇందులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు 6వ స్థానం లభించింది. దాంతోపాటు పలు ప్రైవేటు కాలేజీలకు ర్యాంకుల లభించాయి. డిగ్రీ కాలేజీల విభాగంలో పలు ప్రైవేటు కాలేజీలు ర్యాంకులు సాధించాయి.
వర్సిటీల ర్యాంకింగ్‌లో..
యూనివర్సిటీల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగవ ర్యాంకు లభించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 26వ స్థానం లభించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి 79వ స్థానం, హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీకి 82వ స్థానం లబించింది. 101–150వ స్థానంలో ఇఫ్లూ, 151–200వ స్థానంలో కాకతీయ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment