బుధవారం చలో హెచ్‌సీయూను పోలీసులు అడ్డుకోవడంతో యూనివర్సిటీ గేటును ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు
♦ మళ్లీ విద్యార్థుల అరెస్టుల పర్వం
♦ విద్యార్థులను లోనికి అనుమతించని పోలీసులు
♦ వచ్చిన వారు వచ్చినట్టే గేటు వద్ద అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. బుధవారం చలో హెచ్‌సీయూ కోసం తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. వారికి మద్దతుగా తరలి వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, టీవీవీ విద్యార్థి సంఘ నాయకులను సైతం గేటు వద్దే అరెస్ట్ చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసు వ్యాన్లలోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. తమ ఆందోళనకు మద్దతుగా వచ్చిన వారిని లోనికి అనుమతించాలని హెచ్‌సీయూ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అత్యంత ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహించుకుంటామని, వారిని లోనికి అనుమతించాలని కోరినా వినలేదు. దీంతో వారంతా గేట్లను తోసుకుంటూ బయట ఉన్న విద్యార్థులను లోనికి తీసుకొచ్చారు.
దీంతో వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 63మందిని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి అనంతరం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే, రచయిత్రి విమల, సజయ, జర్నలిస్టులు జ్యోతి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఇందిర, భాగ్యలక్ష్మి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక బండారు విజయ తదితరులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అనంతరం ‘షాప్‌కామ్’ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
వీసీ లాడ్జి ముందు ధర్నా: వీసీ తలపెట్టిన అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి విద్యార్థులు అడ్డుపడ్డారు. ‘‘ఓ పక్క విద్యార్థులను గేటు వద్దే అరెస్టు చేస్తూ.. అంతులేని నిర్బంధాన్ని ప్రయోగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎంతకాలం దొంగ పనులు చేస్తావ్’’ అంటూ నిలదీశారు. విద్యార్థులను సమావేశం జరుగుతున్న వీసీ లాడ్జ్‌లోకి అనుమతించకుండా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో మిట్టమధ్యాహ్నం వరకు విద్యార్థులు ఎండలోనే గేటు బయట ధర్నా నిర్వహించారు. వీసీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు జుహైల్, రాజు సాహులు భేటీకి హాజరై వీసీ వైఖరిని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అప్పారావుని వీసీగా అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్ల సాధనకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు.