సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్‌వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్‌ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు.
ఈ మేరకు హెచ్‌సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్‌వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్‌ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది.
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
Published Tue, Jun 22 2021 4:23 AM | Last Updated on Tue, Jun 22 2021 9:51 AM
Comments
Please login to add a commentAdd a comment