ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించిన కరోనా మహమ్మారి దాని బారినపడి కోలుకున్న బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జుట్టు రాలడం మొదలు పళ్లు కొరకడం వరకు ఎన్నో కొత్త సమస్యలు సృష్టించిందని తేలింది. ఆపాదమస్తకమంతా మనిషి శరీరంలో కరోనా తెచ్చిన మార్పులు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.
జుట్టు
►కరోనా బారినపడిన 2–3 నెలల్లోనే బాధితులకు విపరీతంగా జుట్టు రాలినట్లు ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. టెలోజెన్ ఎఫ్లువియమ్ అనే పరిస్థితే ఇందుకు కారణమని తేల్చింది.
►శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకలి లేకపోవడం, వైరస్ బారిన పడ్డామన్న ఆందోళన, లాక్‌డౌన్ల విధింపుతో ఒత్తిడి లేదా మహమ్మారి వ్యాప్తితో జీవనశైలిలో వచ్చిన మార్పులు కేశాల సాధారణ ఎదుగుదల, అవి రాలే కాలచక్రంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.
►అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే రాలిన జుట్టులో చాలా వరకు లేదా మొత్తమంతా తిరిగి వస్తుందని రిచర్డ్ స్పెన్సర్ అనే ట్రైకాలజిస్ట్ తెలిపారు.
మానసిక ఆరోగ్యం
►క్వారంటైన్, భౌతికదూరం నిబంధనలు బాధితుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామం వారిలో ఆందోళన, ఉద్రేకం, కుంగుబాటు, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీసింది.
►కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోనే ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మానసిక అనారోగ్యానికి గురైనట్లు ఒక అధ్యయనం తెలిపింది.
►ప్రతి ముగ్గురు కరోనా రోగుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడ్డట్లు మరో సర్వే తేల్చింది.
కళ్లు
►కరోనా వ్యాప్తితో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా మంది కళ్లు పొడిబారడం, దురదపెట్టడం, ఎర్రబడటం, మసకబారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. తెరలపై ఉండే నీలికాంతి ప్రభావమే ఇందుకు కారణం.
►పలు అధ్యయనాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 11 శాతం మంది కళ్ల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో చాలా మందికి తరచుగా సోకుతున్నది కళ్లకలక.
ఉదరం
►కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం... కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే పేగుల సంబంధ వ్యాధి కేసులు పెరిగాయి. పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కరోనా బాధితులకు తలెత్తాయి.
►ఒత్తిడి, ఆందోళన కారణంగా ఐబీఎస్ వంటి రోగాల సంఖ్య పెరిగాయని ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అభిప్రాయపడ్డారు.
పళ్లు
►కరోనా వ్యాప్తి మొదలయ్యాక పళ్లు కొరకడం, బిగపట్టడంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడీఏ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2,300 మంది డెంటిస్టుల్లో 71 శాతం మంది ఇదే విషయాన్ని తెలియజేశారు. బ్రక్సిజం అని పిలిచే ఈ వ్యాధి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుందన్నారు.
►జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకా రం ఇదే కాలంలో పంటి, దవడ నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది.
బరువు
►కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్లు/క్వారంటైన్ నిబంధనలతో ప్రజల బరువులో మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి ఇందుకు కారణం కావొచ్చు.
►ఒక అధ్యయనం ప్రకారం కరోనా రోగుల్లో 39 శాతం మంది బరువు పెరిగారు.
కాలేయం
►కరోనా వ్యాప్తి కాలంలో తీవ్ర మద్యపాన సేవనం వల్ల తలెత్తే హెపటైటిస్ అనే కాలేయ వ్యాధి కేసుల సంఖ్య భారీగా పెరినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని చికిత్స కోసం బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
►కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కొందరు బాధితుల్లో కాలేయ ఆమ్ల ద్రవాల స్థాయి సైతం పెరిగింది.
పాదాలు
►పాదాల సంబంధ వ్యాధుల వైద్యురాలు ఎమ్మా కొన్నాకీ ప్రకారం ప్రజల్లో కండరాలు పట్టేయడం, మడమలు నొప్పిపెట్టడం వంటి సమస్యలు పెరిగాయి. పాదాలకు ఆసరా కల్పించే పాదరక్షలు ధరించే పరిస్థితి లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని ఆమె అంచనా వేశారు.
►అరికాలు, చీలమండ, దాని వెనుకాల నొప్పితో బాధపడే వారి కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు.
చర్మం
►కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎదుర్కొన్న అతిసాధారణ చర్మ సంబంధ సమస్యల్లో దద్దుర్లు ఒకటి.
►కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, నొప్పి రావడం, చర్మం దురదపెట్టడం దీని లక్షణాలు. ఈ పరిస్థితిని ‘కోవిడ్ టోస్’గా పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment