కలవరపెడుతున్న కాంతి | Sakshi
Sakshi News home page

కలవరపెడుతున్న కాంతి

Published Fri, Sep 29 2023 3:14 AM

Noise and air pollution along with light pollution - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. వా­యు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్‌ పొల్యూషన్‌) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. 

కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది?
అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజి­మ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవు­తున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ, కారు హెడ్‌లైట్, హోర్డింగ్‌ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు.

వీధి దీపాలు, స్మార్ట్‌ ఫోన్‌లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలు­ష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు.

పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్‌ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు.

మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే..
ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది.

దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి సౌర విద్యుత్‌పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement