దేశ రాజధాని మార్పు అవసరమేనా? | Need the capital of India be shifted away from New Delhi | Sakshi
Sakshi News home page

దేశ రాజధాని మార్పు అవసరమేనా?

Published Mon, Nov 25 2024 7:49 AM | Last Updated on Mon, Nov 25 2024 7:50 AM

Need the capital of India be shifted away from New Delhi

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. తాజాగా అక్కడ గాలి నాణ్యతా సూచి 500 మార్క్‌ చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య మయమైన ఢిల్లీని భారతదేశ రాజధానిగా కొన సాగించడం అవసరమా అని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ లేవనెత్తిన అంశం చర్చకు దారి తీస్తోంది.

మొఘల్‌ చక్రవర్తుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ... బ్రిటిష్‌ రాణి పాలనా కాలంలోనూ, స్వాతంత్య్రం తరువాత కూడా రాజధాని హోదాతోనే ఉంది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, ప్రధాన మంత్రి కార్యా లయం వంటి అత్యున్నత సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. ఇతర నగరాలతో పోటీ పడుతూ వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అంతర్జాతీయసంబంధాల రీత్యానూ ఢిల్లీ కీలకమైన స్థానం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని మార్పుఅంశం తెర మీదకు వచ్చింది.

ప్రపంచంలో కొన్ని దేశాలు  తమ తమ రాజధానులను అవసరం మేరకు మార్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నైజీరియా పాత రాజధాని లాగోస్‌ నుంచి 1991లో ‘అబుజా’కు మార్చుకుంది. లాగోస్‌లో అధిక జనసాంద్రత సమస్య, ట్రాఫిక్‌ సమస్యలు ఉండేవి. అందుకే దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న అబుజాను కొత్త రాజ ధానిగా ఎంచుకున్నారు. ఇక 2006లో యాంగోన్‌ (రంగూన్‌) నుంచి నైపిటావ్‌కు మయన్మార్‌ తన రాజధానిని మార్చుకుంది. భద్రత, పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి కార ణాలుఇందుకు కారణాలు. 1918లో రష్యా కూడా సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ నుంచి మాస్కోకు రాజధానిని మార్చింది.

వ్యూహాత్మకంగా మాస్కో మరింత ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమని రష్యా భావించింది. ఇక పొరుగు దేశం పాకిస్తాన్‌ 1963లో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు రాజధానిని మార్చుకుంది. కరాచీ నగరానికి భద్రతా సమస్యలు ఉండటం, అక్కడ అధిక జనాభా ఉండడం వంటి కారణాలతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న ఇస్లామాబాద్‌కు రాజధానిని తరలించు కున్నారు. బ్రెజిల్,, కజకిస్తాన్, టాంజానియా వంటివీ రాజధానులను మార్చుకున్నాయి.  

ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే... పుణే, హైదరాబాద్, నాగపూర్‌ వంటి నగరాలు దేశానికి మధ్యలో ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలని కొందరు సూచిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి.  గ్రీన్‌ బెల్ట్స్‌ అభివృద్ధి చేయాలి. పునఃవిని యోగ ఇంధన వనరులన వాడకాన్ని అధికం చేయాలి. పరిపాలనా కార్యా లయాలను ఇతర నగరాలకు విస్తరించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అంశం మరో సారి తెరపైకి వస్తోంది. ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయా లని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అప్పట్లోనే అన్నారని, ఆ అర్హత హైదరాబాద్‌కు ఉందని కొందరు గుర్తు చేస్తు న్నారు. హైదరాబాద్‌లో కూడా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందని, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో పరిపా లనా కేంద్రాలను నిర్మిస్తే బాగుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

శశిథరూర్‌ లేవనెత్తిన అంశంపై మరింత చర్చ జరగాలి. ఢిల్లీవంటి నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభా, మౌలిక సదు పాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజధానిని మార్చడం అనేది తక్షణావసరం కాకపోయినా, భవిష్యత్తులో పరిశీల నార్హమైన అంశం. అదే సమయంలో ఢిల్లీని కాలుష్యం బారి నుంచి రక్షించడం తక్షణ అవసరం.
– ఎక్కులూరి నాగార్జున్‌ రెడ్డి
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ‘ 90320 42014
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement