హెచ్‌సీయూలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభావం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ(హెచ్‌సీయూ) ఎన్నికల్లో ప్రతిబింబించింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) కూటమిలోని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ అన్ని పదవులనూ కైవసం చేసుకొని సత్తా చాటుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం 2016-17 విద్యా సంవత్సరానికిగాను బుధవారం జరిగిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా హెచ్‌సీయూ ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,000 మంది విద్యార్థులుండగా అందులో 3,800 ఓట్లు పోలయ్యాయి.
గురువారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం(టీఎస్‌ఎఫ్) దళిత్ స్టూడెంట్స్ యూనియన్(డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్)లు ఒకే ప్యానల్‌గా ఏబీవీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాయి. హెచ్‌సీయూ ప్రెసిడెంట్‌గా ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి కుల్‌దీప్‌సింగ్ నాగి, ఏబీవీపీ అభ్యర్థి గోపికృష్ణపై 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా టీఎస్‌ఎఫ్ నుంచి బిక్యాసుందర్ 401 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు, జనరల్ సెక్రటరీగా డీఎస్‌యూ అభ్యర్థి సుమన్ దామెర 390 ఓట్లతో గెలుపొందారు. సాంస్కృతిక కార్యదర్శిగా బీఎస్‌ఎఫ్ నుంచి నఖ్రాయ్ దిబ్బరామ, సంయుక్త కార్యదర్శిగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి పిల్లి విజయ్‌కుమార్, క్రీడల కార్యదర్శిగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి ఉష్ణిస్ దాస్ విజయం సాధించారు.
ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య ఎన్నికలుగా సాగాయి. చివరకు వామపక్ష, దళిత, గిరిజన విద్యార్థి సంఘాలతో కూడిన సామాజిక న్యాయ ఐక్యకార్యాచరణ పోరాట కమిటీ ఘనవిజయం సాధించింది. లైంగిక వే ధింపుల నిరోధక కమిటీ(కమిటీ ఎగెనైస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్) సభ్యులుగా ఎస్‌ఎఫ్‌ఐ నుంచి తుషార, ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిర్దోసి సోనీ ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్‌ఏ) 944 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది.