హెచ్‌సీయూ దేశంలోనే 2వ అత్యుత్తమ వర్సిటీ  | HCU Is The Second Best University In The Country | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ దేశంలోనే 2వ అత్యుత్తమ వర్సిటీ 

Published Mon, Aug 3 2020 3:39 AM | Last Updated on Mon, Aug 3 2020 3:39 AM

HCU Is The Second Best University In The Country - Sakshi

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) మరో ఘనత సాధించింది. ఇండియా టుడే–మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌(ఎండీఆర్‌ఏ) సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ ద్వితీయ స్థానం సంపాదించింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను జనరల్‌ (ఆర్ట్స్, సైన్స్‌ అండ్‌ కామర్స్‌), సాంకేతిక, వైద్య, చట్టపరమైన నాలుగు విభాగాలుగా పరిశీలించారు. ఈ పరిశీలనలో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 

995 వర్సిటీలపై అధ్యయనం  
ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. అందులో 155 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో హెచ్‌సీయూకు ద్వితీయ స్థానం పొందింది. ఇండియా టుడే నాలెడ్జ్‌ పార్టనర్‌ ఎండీఆర్‌ఏ చేత అనేక మైలురాళ్లను నిర్దేశించింది. ఆబ్జెక్టివ్‌ ర్యాంకింగ్‌ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్‌ఏ 120 ప్లస్‌ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ పనితీరే సూచికలుగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లివింగ్‌ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్‌ పురోగతి, ప్లేస్‌మెంట్‌ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. దేశంలోని 30 నగరాల్లో 300 మంది ప్రతినిధులు(32 మంది వైస్‌చాన్స్‌లర్లు, 75 మంది డైరెక్టర్లు, 193 మంది సీనియర్‌ ఫ్యాకల్టీ/ప్రొఫెసర్లు/హెడ్‌లతో వర్చువల్‌ సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్‌ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. 

టాప్‌లో నిలవడం.. పనితీరుకు నిదర్శనం 
పనితీరు మెరుగుపడడం, పరిశోధన రచనలకు గుర్తింపుగా హెచ్‌సీయూ దేశంలో ద్వితీయ స్థానం సాధించింది. 2017లో 5వ స్థానం, 2018లో 3, 2019లో 2, 2020లో మరోసారి 2వ స్థానాన్ని హెచ్‌సీయూ దక్కించుకుంది. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ గుర్తించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. దీంతో ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి వెళ్లేలా సమష్టి కృషితో ముందుకు సాగుతాం. 
 –ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement