కోక్‌ టిన్‌లో చిక్కి నాగుపాము విలవిల | Snake Society in Hyderabad HCU | Sakshi
Sakshi News home page

స్నేక్‌ అండ్‌ సేఫ్‌

Published Sat, Sep 14 2019 10:25 AM | Last Updated on Sat, Sep 14 2019 10:25 AM

Snake Society in Hyderabad HCU - Sakshi

ఖాళీ కోక్‌ టిన్‌లో ఇరుక్కొని విలవిలలాడుతున్న నాగుపాము

రాయదుర్గం: పరిశోధనలకు, పచ్చదనానికే కాదు పాములకు సంరక్షణ కేంద్రంగా కూడా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మారుతోంది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌ రెండువేలకు పైగా ఎకరాల సువిశాల స్థలంలో కొనసాగుతోంది. ఇందులో సగం భూభాగం వరకు అటవీ ప్రాంతంగా ఉంది. ఇందులో çసహజసిద్ధమైన భారీ బండరాళ్లు, చెట్లు, పచ్చదనం, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కుంటలున్నాయి. దీంతో దేశంలో కొన్ని అరుదైన పాములు తప్ప మిగతా అన్ని రకాల పాములు ఇక్కడ ఉన్నట్లు పలువురు పేర్కొంటారు. ఇందులో కొన్ని ఇప్పటి వరకు కనిపించిన వాటిలో విషసర్పాలు కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పటి వరకు పాము కాటు వేయకపోవడం మరో విశేషం. అప్పుడప్పుడు ఈ పాములు విద్యార్థులుండే వసతిగృహాలు, ప్రధాన, అంతర్గత రోడ్లు, వివిధ కార్యాలయాలవైపు వస్తుంటాయి. అయితే సెక్యూరిటీ విభాగం, వైల్డ్‌లెన్స్‌ గ్రూపు ఈ పాముల సంరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కాగా గత ఆరు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక కొండచిలువ తీవ్రంగా కాలి గాయాలపాలుకాగా మరో రెండు పాములు మృత్యవాత పడిన ఘటన అందరినీ కలిచివేసింది.

ఇక్కడ పాముల్ని చంపరు..
విద్యార్థులకు పలు చోట్ల పాములు అగుపించడం క్యాంపస్‌లో సర్వసాధారణం. పాము కనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లెన్స్‌గ్రూపువారికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే పాములను పట్టే ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీవారిని పిలిపించి వాటిని పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంగా ఉండే చోట పాములను వదిలి వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పాములను చంపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవంటేనే వీటి సంరక్షణ ఎలా ఉందో అర్థమవుతుంది. ఏది ఏమైనా పాము అనగానే సహజంగా అందరూ భయపడిపోతుంటారు. అందులో రకరకాల విష సర్పాలు కూడా ఉండడంతో మరింతగా వీటిని చూడగానే భయపడిపోయే వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో పాములను పట్టేవారిని అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్పిన అవసరం ఉంది.

జీవ వైవిధ్యానికి హెచ్‌సీయూ కేంద్రం

హెచ్‌సీయూ క్యాంపస్‌ జీవ వైవిధ్యానికి కేంద్రం. అందులో రకరకాల పక్షులు, జంతువులు, పాములు, పచ్చనిచెట్లు ఉన్నాయి. వీటి పరిరక్షణలో హెచ్‌సీయూ యంత్రాంగం, సెక్యూరిటీ విభాగం చూపించే చొరవ, మా వైల్డ్‌లెన్స్‌ తోడ్పాటు నిరంతరంసాగే ప్రక్రియ. రకరకాల పాములు క్యాంపస్‌లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు చంపలేదు. పట్టుకొని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది.  
– డాక్టర్‌ రవి జిల్లపల్లి,వైల్డ్‌లెన్స్‌ గ్రూపు వ్యవస్థాపకులు హెచ్‌సీయూ

కోక్‌ టిన్‌లో తల చిక్కి నాగుపాము విలవిల
రాయదుర్గం: ఖాళీ కూల్‌డ్రింక్‌ టిన్‌ బాక్సులో ఓ నాగుపాము దూరింది. దీంతో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడగా..హెచ్‌సీయూ విద్యార్థిని ఒకరు గమనించి ఆ పాముకు విముక్తి కలిగించారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉర్దూ డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని జునేరా అబ్రార్‌ గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని వైట్‌రాక్స్‌ వైపు నుంచి వెళ్తుండగా పాము తల టిన్‌లో ఇరుక్కోవడం గమనించారు. వెంటనే వైల్డ్‌ లెన్స్‌ గ్రూపు వ్యవస్థాపకులు డాక్టర్‌ రవి జిల్లపల్లికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్‌ కలవలేదు. దీంతో మరికొందరు విద్యార్థులతో కలిసి ఆమె పామును రక్షించారు. దాన్ని చెట్ల పొదల్లోకి వదిలేశారు. ఈ సందర్భంగా జునేర్‌ అబ్రార్‌ మాట్లాడుతూ క్యాంపస్‌లో ఎవరూ ఖాళీ బాటిళ్లు, కోక్‌ టిన్‌లను బహిరంగంగా పారవేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement