
హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు
రాయదుర్గం: విద్యార్థుల ఆందోళనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దద్దరిల్లింది. హెచ్‌సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన న్యూలైఫ్ సైన్సెస్ భవనం ఎదుట పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేడెడ్ అటానమీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజుల పెంపు, ఇతర ఆర్థిక అంశాలను గతంలో మాదిరిగా అకడమిక్ కౌన్సిల్‌లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు చేయాలని ఫైనాన్షియల్ కమిటీ నిర్ణయాలు చేయరాదన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది, గచ్చిబౌలి పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, వారికి మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ హెచ్‌సీయూ శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం సాగింది. ఎస్‌ఎఫ్‌ఐ హెచ్‌సీయూ శాఖ కార్యదర్శి అభిషేక్ నందన్ మాట్లాడుతూ.. పెంచిన ఫీజు లను వెంటనే తగ్గించాలని, గ్రేడెడ్ అటానమీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా డీఎస్‌యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హెచ్‌సీయూలో ఆందోళన చేశారు. గ్రేడెడ్ అటానమీ ఐడియాను రద్దు చేయాలని, ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
నిరసన తెలిపిన ఓబీసీ ఫెడరేషన్
హెచ్‌సీయూ అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే భవనం ఎదుట ఓబీసీ ఫెడరేషన్ (ఓబీసీఎఫ్) నిరసన తెలిపింది. తెలుగు ఎంఫిల్ కోర్సును పునరుద్దరించాలని, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రారంభించాలని, ఎంపీహెచ్, ఎంబీఏ, ఎంటెక్ కోర్సులకు డెవలప్‌మెంట్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థులకు అడ్మిషన్, సెమిస్టర్ రిజిస్ట్రేషన్ సమయంలో ఫీజు మాఫీ చేయాలని, రూమ్‌రెంట్, మెస్ డిపాజిట్లను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ ఫెడరేషన్ నాయకులు రవికుమార్‌యాదవ్ పలువురు ఓబీసీ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment