అందాలలో అహో మహోదయం.. హెచ్‌సీయూలో నవోదయం.. ఎటు చూసినా పచ్చదనం.. ఆహ్లాదపూరిత వాతావరణం.. ప్రకృతి రమణీయత. చెంగుచెంగుమంటూ గంతులు వేసుకుంటూ వెళ్లే జింకలు.. పక్షుల కిలకిలారావాలు.. జల సవ్వడిని తలపించే తటాకాలు. విభిన్న పుష్ప జాతుల వృక్షాలు.. ఇలా ఎన్నో అపురూప దృశ్య మాలికలకు కేరాఫ్‌గా నిలుస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సువిశాలమైన హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఒక్కోచోట ఒక్కో అందం, పచ్చదనం,జంతుజాలం.. సొగసు చూడతరమా.. అన్నట్లుగా ఉంటుంది.
సెంట్రల్ యూనివర్సిటీ ప్రతి ఏటా రూపొందించే కేలండర్‌లో ఇక్కడి క్యాంపస్‌లోని అందాలతో కూడిన ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం క్యాంపస్ అందాలతో కూడిన ఫొటోలతో కేలండర్‌కు రూపకల్పన చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, విద్యార్థులు స్వయంగా తీసిన ఫొటోలను పంపాలని ఉన్నతాధికారులు కోరుతారు. ఆ ప్రకారం క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రకృతి అందాలతో కూడిన ఫొటోలను తీయడానికి ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ ఏడాది కూడా ఫొటోలు పంపాలని కోరగా 200 ఎంట్రీలను విద్యార్థులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పంపించారు. వీరిలో రఘు గణపురం, డాక్టర్ రవి జిల్లపల్లి, విజయభాస్కర్ మరిశెట్టి, జ్ఞానశేఖర్, కేఎన్ కృష్ణకాంత్, మోనికా, పి.కె.నవనీత్ కృష్ణన్, శశిశేఖర్‌రెడ్డి, సుష్మ నంద్యాల, అనోజ్, చందాని సింగ్, నిరంజన్ బసు తీసిన చిత్రాలను 2020 కేలండర్ రూపకల్పనలో వినియోగించారు. వీరంతా క్యాంపస్‌లోని అందాలను తమ కెమెరాల్లో బంధించి కేలండర్ అందంగా రూపొందేలా దోహదపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment