డబ్బు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే. మనకు తెలిసిన చాలామంది, మరీ ముఖ్యంగా జీతం తీసుకుంటున్నవారు తరచూ అప్పులు చేయడం గమనిస్తుంటాం. బాధ్యతా రహితంగా డబ్బు తీసుకుంటే భవిషత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు చేస్తున్న చాలామందికి దాని తీవ్రత తెలియక మళ్లీ అదే పనిచేస్తుంటారు. అప్పు ఉచ్చులో చిక్కుకుంటున్నామని సూచించే కొన్ని సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రమంగా అప్పుల్లోకి జారుకుంటున్నారని తెలుసుకోవాలి. ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఈజీ ఈఎంఐలు, డిస్కౌంట్లు, సేల్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చుతో ఇబ్బందులు తప్పవు. అప్పు మిమ్మల్ని మరింత ఊబిలో పడేస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాలంటే మాత్రం వచ్చే ఆదాయంలో ఈఎంఐలు 50శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.
రోజువారీ ఖర్చుల కోసం అప్పు
రోజువారీ ఆర్థిక అవసరాల కోసం తరచు అప్పు తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులకు అప్పు తీసుకుంటే రుణఊబిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త
తీసుకున్న అప్పులను తీర్చడానికి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్ వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.
పేమెంట్లను చెల్లించకపోవడం
క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్‌లోపు పేమెంట్ చెల్లించాలి. అందులో మినిమం డ్యూ కడితే సరిపోతుందనుకోవద్దు. మిగిలిన డ్యూ మొత్తాన్ని నెలవారీగా వడ్డీ విధిస్తారు. అది మరింత ప్రమాదకరం. దాంతో మీ సిబిల్ స్కోర్ ప్రభావం చెందుతుంది. ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. ఈ రోల్‌ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి.
భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై అప్పు
భవిష్యత్తులో ఫలానా వారు డబ్బు ఇస్తారనో.. లేదా ఈ సంవత్సరం చివర్లో బోనస్ వస్తుందనో ఇప్పుడే అప్పు తీసుకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు.
ఇంక్రిమెంట్లను నమ్మొద్దు
భవిష్యత్తులో వచ్చే జీతం, ఇంక్రిమెంట్‌లను ఎక్కువగా అంచనా వేస్తారు. కెరీర్ ప్రారంభ దశల్లో ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి రిటైర్మెంట్ వరకు కొనసాగకపోవచ్చు. కాబట్టి కనిపించని భవిషత్తుపై అంచనాలతో ప్రస్తుతం అప్పులు చేయడం తప్పు.
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు
ఉద్యోగంలో చేరిన వెంటనే చాలామంది అడిగేప్రశ్న.. ‘ఇల్లు ఎప్పుడు కొంటారు’ అని.. దాంతో స్థోమతకు మించి అప్పు చేసైనా సరే ఇల్లు కొనాలనుకుంటారు. దీర్ఘకాల వ్యవధికిగాను హోమ్‌లోన్లను ఎంచుకునేప్పుడు ఫ్లోటింగ్ రేట్లును సెలక్ట్ చేసుకుంటారు. దాంతో వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం మంచిది.
లోన్ తీర్చడానికి మళ్లీ అప్పు
వడ్డీ ఖర్చులను తగ్గించడానికి, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి కోసం తప్పా..అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా హోంలోన్, కారు లోన్ ఈఎంఐలు, అద్దె, పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్‌లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు.
Comments
Please login to add a commentAdd a comment