జీడీపీ.. ఢమాల్‌! | Indian GDP Growth Rate Falling Down | Sakshi
Sakshi News home page

జీడీపీ.. ఢమాల్‌!

Published Sat, Aug 31 2019 1:14 PM | Last Updated on Sat, Aug 31 2019 1:14 PM

Indian GDP Growth Rate Falling Down - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్థికరంగం తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012–13 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కేవలం 4.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఈ రేటు మళ్లీ ఈ స్థాయిని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి త్రైమాసికంలో భారీగా 8 శాతం వృద్ధి సాధించినా, ఏడాది తిరిగే సరికి ఈ  రేటు భారీగా పడిపోవడం గమనార్హం. జనవరి–మార్చి త్రైమాసికంలో (గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు) కూడా వృద్ధి రేటు కనీసం 5.8 శాతం నమోదయ్యింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో తీవ్ర నిరాశకు  కీలక తయారీ, వ్యవసాయ రంగాలు రెండూ ఈ కాలంలో మొండిచేయి చూపించడం దీనికి ప్రధాన కారణం. తాజా సమీక్షా కాలంలో కనీసం 5.7 శాతం అన్నా వృద్ధి రేటు ఉంటుందని మార్కెట్‌ అంచనావేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనాంశం. కాగా చైనా ఇదే త్రైమాసికంలో 6.2 శాతం  వృద్ధిని (27 సంవత్సరాల కనిష్టం) నమోదుచేసుకుంది. అయితే భారత్‌ వృద్ధి ఇంతకన్నా తక్కువ నమోదయినందున (5 శాతం) ఈ నిర్దిష్ట త్రైమాసికంలో ‘ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను భారత్‌ కోల్పోయినట్లయ్యింది. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంకొన్ని కీలక రంగాలను చూస్తే...

తయారీ:  కేవలం 0.6 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. 2018–19 ఇదే త్రైమాసికంలో ఈ రేటు 12.1 శాతంగా ఉండడం గమనార్హం.  
వ్యవసాయం, అటవీ, మత్స్యసంపద: వృద్ధి 5.1 శాతం నుంచి 2 శాతానికి జారింది.  
గనులు, తవ్వకాలు: ఈ రంగం కొంచెం బెటర్‌. వృద్ధి రేటు 0.4% నుంచి 2.7 శాతానికి ఎగసింది.  
ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 8.6 శాతానికి చేరింది.  
నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది.  
ట్రేడ్, హోటెల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్స్,  సేవలు: 7.8%  నుంచి 7.1 శాతానికి చేరింది.  
ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలు: వృద్ధి రేటు 6.5%  నుంచి 5.9 శాతానికి దిగింది.  
జీఎఫ్‌సీఎఫ్‌:పెట్టుబడులకు సంబంధించిన పరిస్థితిని తెలియజేసే గ్రాస్‌ ఫిక్డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎఫ్‌సీఎఫ్‌) విలువ రూ.11.21 లక్షల కోట్ల (2018–19 క్యూ1లో) నుంచి కేవలం రూ.11.66 లక్షల కోట్లకు చేరింది.కాగా, వృద్ధి పడిపోడానికి దేశీయ, అంతర్జాతీయ అంశాలు కారణమని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు.

విలువలు చూస్తే...
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– 2018–19 మొదటి త్రైమాసికంలో జీడీపీ విలువ 34.14 లక్షల కోట్లు. 2019–20 మొదటి త్రైమాసికంలో ఈ రేటు రూ.35.85 లక్షల కోట్లకు చేరింది. అంటే వృద్ధి రేటు ఇక్కడ 5 శాతమన్నమాట. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. తాజా పరిస్థితి చూస్తుంటే, ఈ స్థాయి వృద్ధి రేటు అయినా, సాధ్యమైనా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.  మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి 5.1 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిన క్రమంలోనే తాజా జీడీపీ పేలవ ఫలితాలూ వెలువడ్డాయి. ఆటోమొబైల్‌ అమ్మకాలు, రైలు రవాణా, దేశీయ విమాన ట్రాఫిక్, దిగుమతులు (ఆయిల్, పసిడి, వెండి యేతర) పడిపోవడం వినియోగం తగ్గుదలను సూచిస్తోంది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం సైతం వ్యవస్థలో మందగమనానికి సంకేతం. భారత్‌ పాసింజర్‌ వాహన పరిశ్రమ అమ్మకాలు జూలైలో 31 శాతం పడిపోయాయి. గడచిన 19 సంవత్సరాల్లో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. రేటు కోత నిర్ణయాలు తీసుకుంటూ (వరుసగా నాలుగు ద్వైమాసికాల్లో 1.10 శాతం తగ్గింపు– ప్రస్తుతం 5.4 శాతం) ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నా అంతగా ఫలితం ఉండడంలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  పాసింజర్‌ వాహనాలు, సిమెంట్‌ వంటి రంగాలపై వస్తు, సేవల పన్ను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే భారీగా ఉపాధి అవకాశాలు కోల్పోవచ్చని హెచ్చరిస్తున్నాయి. 2018 జూలైతో పోల్చుకుంటే, 2019 జూలైలో నిరుద్యోగ రేటు 5.66 శాతం నుంచి 7.51 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement