న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది.
వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది.
టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
బహుళజాతి కంపెనీల లిస్టింగ్
బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది.
బలమైన భవిష్యత్తుకు పునాది
అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్‌టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment