బ‘బుల్‌’ రిస్క్‌..! | RBI annual report warns of the risks of a bubble in equity markets | Sakshi
Sakshi News home page

బ‘బుల్‌’ రిస్క్‌..!

Published Fri, May 28 2021 2:28 AM | Last Updated on Fri, May 28 2021 2:28 AM

RBI annual report warns of the risks of a bubble in equity markets  - Sakshi

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 శాతం క్షీణిస్తుందన్న అంచనాల నేపథ్యంలోనూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు పరుగులు చేయడంపై స్వయంగా బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘బుడగ పేలే (రిస్క్‌ ఆఫ్‌ ఏ బబుల్‌) అవకాశం ఉంది’’ అని హెచ్చరిక చేసింది. తద్వారా స్టాక్‌ మార్కెట్‌ పెరుగుదల నిలబడకపోవచ్చని సూచించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికలో మార్కెట్‌కు సంబంధించి ఆర్‌బీఐ అభిప్రాయాలను క్లుప్లంగా పరిశీలిస్తే...  

► భారత్‌ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 2021 జనవరి 21న 50,000 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫిబ్రవరి 15న గరిష్టంగా 52,154 పాయింట్లను తాకింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ప్రారంభమయిన నాటి నుంచీ చూస్తే (2020 మార్చి 23 నుంచీ) మార్కెట్‌ 100.7% పెరిగితే, ఒక్క 2020–21లో 68 శాతం ఎగసింది.  

► జీడీపీ క్షీణ అంచనాల నేపథ్యంలోనూ మార్కెట్‌ భారీ పెరుగుదల ‘బబుల్‌ రిస్క్‌’ను సూచిస్తోంది. వాస్తవిక ఆర్థిక క్రియాశీల రికవరీకి అలాగే అసెట్‌ ప్రైస్‌ పెరుగుదలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుండడం ఇప్పుడు గ్లోబల్‌ విధాన నిర్ణయ అంశాల విషయంలో ఆందోళనకు కారణమవుతోంది.  

► నిధుల సరఫరా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు స్టాక్‌ మార్కెట్ల భారీ పెరుగుదలకు కారణం. ఎకానమీ మెరుగుపడుతుందన్న అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ పెరుగుదలకు కొంత కారణమయినప్పటికీ, మనీ సప్లై, ఎఫ్‌పీఐల ప్రభావమే ఇందులో అధికం. ఆర్థిక రికవరీకి వ్యవస్థలోకి మనీ పంప్‌ చేయడం (లిక్విడిటీ) కూడా అసెట్‌ ధరల పెరుగుదలకు కారణం. అయితే ఈ తరహా ద్రవ్యలభ్యత, మద్దతు వ్యవస్థలో నియంత్రణ లేకుండా, నిరంతరం కొనసాగుతుందని భావించరాదు.

► భవిష్యత్‌ ఆర్జనలకు భరోసాను ఇచ్చింది.  

► తాజా పరిస్థితిని విశ్లేషిస్తే, మహమ్మారి వేవ్‌ల కట్టడి జరిగి, ఎకానమీ వాస్తవిక వృద్ధి బాట పట్టే వరకూ  మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


వినియోగం, పెట్టుబడులు కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్థికాభివృద్ధిపై సెకండ్‌వేవ్‌ ప్రభావం కొనసాగనుంది. 10.5 శాతం వృద్ధి సాధిస్తామన్న తొలి అంచనాలకు కోత పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కోవిడ్‌ సవాళ్ల అనంతరం దేశం వృద్ధి బాటన నిలదొక్కుకోవడానికి ప్రైవేటు వినియోగం పెట్టుబడుల మళ్లీ ఊపందుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్‌పీఏల పట్ల దృష్టి పెట్టాలి
సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితిని బ్యాంకులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎన్‌పీఏల వర్గీకరణపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో తగిన స్థాయిలో ప్రొవిజనింగ్‌ (ఎన్‌పీఏ కేటాయింపులు)పై దృష్టి పెట్టాలి.  

తగిన స్థాయిలో లిక్విడిటీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)తగిన స్థాయిలో ఉండడానికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఎటువంటి అవరోధాలూ లేకుండా ద్రవ్య,పరపతి విధానం కొనసాగేలా చర్యలు ఉంటాయి.

బ్యాంక్‌ నోట్ల సర్క్యులేషన్‌ పెరిగింది
2020–21లో బ్యాంక్‌ నోట్ల సర్క్యులేషన్‌ పెరిగింది. మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వినియోగదారు నగదు తన వద్ద ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి కారణం. ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ నోట్ల సర్క్యులేషన్‌ విలువ 16.8 శాతం పెరిగితే, పరిమాణం విషయంలో ఇది 7.2 శాతం. 2019–20లో ఈ శాతాలు వరుసగా 14.7 శాతం, 6.6 శాతంగా ఉండడం గమనార్హం. విలువ రీత్యా చూస్తే, 2021 మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్‌లో రూ.500, రూ.2000 నోట్ల వాటా 85.7 శాతం. ఇది 2020 మార్చి 31 నాటికి 83.4 శాతంగా ఉంది.  

2,000 నోటుకు గుడ్‌బై!
రూ.2,000 నోట్లను క్రమంగా పూర్తి స్థాయిలో వ్యవస్థలోంచి వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020–21లో ఆర్‌బీఐ రూ.57,757 కోట్ల విలువైన రూ.2000 నోట్లకు వ్యవస్థలో నుంచి ఉపసంహరించింది.  2019–20లో 2000 నోట్ల విలువ రూ.5,47, 952 కోట్లు కాగా, 2020–21లో ఈ విలువ రూ.4,90,195 కోట్లకు పడిపోయింది. 2017–18లో ఈ నోట్ల పరిమాణం 33,630 లక్షలు కాగా, 2021 మార్చికి 24,510కి  తగ్గింది.  ఇక వ్యవస్థలో డిమాండ్‌ను నెరవేర్చడానికి రూ.500 నోట్లను భారీగా సర్క్యులేషన్‌లోకి తెస్తోంది. ప్రస్తుత సర్క్యులేషన్‌ నోట్లలో వీటి వాటా 68.4%. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వాటా 61%.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement