
రైతు కంట్లో కారం
– పడిపోయిన పచ్చి మిరప ధర
– కర్నూలు మార్కెట్‌లో 10 కిలోల ధర కేవలం రూ.30 మాత్రమే
– రవాణా చార్జీలు కూడా గిట్టని వైనం
– గగ్గోలు పెడుతున్న రైతులు
కర్నూలు (అగ్రికల్చర్):
మొన్నటి వరకు వినయోగదారులను కన్నీళ్లు పెట్టించిన కూరగాయల ధరలు ప్రస్తుతం రైతులను ఏడుపిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి, టమాట ధరలు పడిపోయి రైతులు నష్టాలు మూటగట్టుకోగా.. అదే వరుసలో పచ్చిమిరప రైతు చేరాడు. మిరప ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా నెల రోజులు క్రితం మిరప ధర సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనలేనంతగా స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పంట లేదు. అక్కడక్కడ సాగు చేసిన రైతులు కొంత లాభ పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన పంట మార్కెట్‌కు చేరుతున్న సమయంలో ధరలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లోని కూరగాయల మార్కెట్‌లో మిరప ధరలు నేలను తాకాయి. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 18వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఆలూరు, సి.బెళగల్, కోడుమూరు, ఆళ్లగడ్డ, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, కష్ణగిరి, దేవనకొండ, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, శిరువెళ్ల, రుద్రవరం, గోస్పాడు తదితర మండలాల్లో మిరప అత్యధికంగా సాగు చేశారు. దిగుబడులు ఎక్కువగా రావడంతో మార్కెట్‌కు తరలివస్తోంది. దీంతో ఒక్క సారిగా డిమాండ్ పడిపోవడంతో ధరలు పడిపోయాయి. బుధవారం రాత్రి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డలోని కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌లో 10 కిలోల మిరప ధర రూ.30 మాత్రమే పలికింది. ఎపుడూ లేని విధంగా మిరప ధరలు పడిపోవడంతో రైతులకు కూలీ, రవాణా ఖర్చులు కూడ దక్కడం లేదు. 10 కిలోలకు లభించిన ధర అయిన చేతికి లభిస్తుందా అంటే అదికూడా లేదు. అన్‌లోడింగ్, ఏజెంటు కమీషన్ తదతర వాటికి క్వింటాలుకు రూ.15 వరకు కోత పడుతోంది. మిరప ధరలు ఇంత దారుణంగా పడిపోవడం రెండేళ్ల కాలంలో ఇదే మొదటి సారి.
మిగిలిన కూరగాయలది అదే పరిస్థితి:
టమాట, ఉల్లి రైతులు కొన్ని రోజులుగా కూలి, రవాణా ఖర్చులు గిట్టక నష్టపోతుంటే తాజాగా మిరప, ఇతర కూరగాయల ధరలు పడిపోవడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. మిరపతో పాటు బెండ, చెవుళ, బీర తదితర వాటికి ధరలు నేలచూపు చూస్తున్నాయి. జూన్‌లో విస్తారంగా వర్షాలు పడటంతో కూరగాయల పంటలు భారీగా సాగు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఒకే సారి పంట మార్కెట్‌లోకి రావడంతో డిమాండ్ పడిపోయి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఖర్చులకు కూడా రాలేదు: మధు రైతు
వెల్దుర్తి మండలం బోయినపల్లిలో ఒక ఎకరాలో మిరప సాగు చేశాను. పెట్టుబడి దాదాపు రూ. 60వేలు పెట్టాను. బుధవారం కర్నూలు మార్కెట్‌కు 13 సంచుల్లో మిరప తీసుకవచ్చాను. మిరపను తెంపడానికి ఆరుగురు కూలీలకు రూ. 600 ఖర్చు అయ్యింది. పొలం నుంచి మార్కెట్‌కు తీసుకరావడానికి బస్తాకు రూ.30 చెల్లించాల్సి వచ్చింది. మార్కెట్‌లో 10 కిలోలకు రూ.30 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో కమీషన్ ఏజెంటుకు కమీషన్ అన్‌లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. వచ్చిన మొత్తం ఖర్చులకు కూడా సరిపోలేదు. ధరలు ఇంత అధ్వానంగా ఉంటే రైతులు ఎలా బాగుపడతారు. ప్రభుత్వం మిరప రైతులకు న్యాయం చేయాలి.