దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు | Home loan rates slashed to decade low | Sakshi
Sakshi News home page

దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు

Published Tue, Mar 9 2021 6:07 AM | Last Updated on Tue, Mar 9 2021 6:07 AM

Home loan rates slashed to decade low - Sakshi

ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్‌ రేటింగ్స్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్‌ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే.  

రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్‌ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్‌సెక్యూర్డ్‌వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్‌పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్‌ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి.   వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే.  

క్రెడిట్‌ స్కోరే ప్రామాణికం..
ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్‌బీఐ 6.7 శాతం, కోటక్‌ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్‌బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్‌బీఐ 10 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement