
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజాలు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రత్యేకత ఏమిటి?
డీ–ఎస్‌ఐబీలను ‘టూ బిగ్ టూ ఫెయిల్ (టీబీటీఎఫ్)లుగా పరిగణిస్తారు. ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదన్నది దీని ఉద్దేశ్యం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనా, దీనిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆయా అంశాల వల్ల ఈ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధుల సమీకరణలో నిర్దిష్ట సాను కూలతలు, ప్రయోజనాలను పొందగలుగుతాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు...
ఆర్‌బీఐ ప్రకటనకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... డీ–ఎస్‌ఐబీ నిర్ధారణ ఫ్రేమ్‌వర్క్ 2014 జూలైలో జారీ అయ్యింది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్‌బీఐ డీ–ఎస్‌ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీకి కూడా ఇదే హోదా లభించింది. కాగా, డీ–ఎస్‌ఐబీల కోసం అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) సౌలభ్యతను ఏప్రిల్ 1, 2016 నుండి దశలవారీగా ప్రారంభించడం జరిగింది. 2019 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది. తగిన మూలధన కల్పనలో ఈ సౌలభ్యత కీలకమైనది.
బ్యాంక్ షేర్ ధరలు ఇలా...
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో (ఎన్‌ఎస్‌ఈ)లో మంగళవారం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్ ధరలు వరుసగా రూ. 483.50 (2.70% అప్), 772.85 (1.07% పెరుగుదల), 1,528.55 (0.59% పురోగతి) వద్ద ముగిశాయి.
చదవండి: ముత్తూట్ విభాగానికి షాక్.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు!
Comments
Please login to add a commentAdd a comment