
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కిందకు జారింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42 పైసలు తగ్గి, 69.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పటిష్టత దీనికి నేపథ్యం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనితో వడ్డీరేట్లు తగ్గిస్తూ, సరళతర ఆర్థిక విధానాలవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసియా దేశాల కరెన్సీలూ ఒత్తిడికి గురవుతున్నాయి. ట్రేడింగ్‌లో 69.04 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.35నూ తాకింది. బుధవారం రూపాయి 2 పైసల నష్టంతో రూ.68.88 వద్ద ముగిసింది.
అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా 2 నెలల క్రితం గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్లు పడిపోవడంతో రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ తాజా కనిష్ట స్థాయిల నుంచి 13 డాలర్లకుపైగా పెరగడంతో ఆతర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. 2 నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. తాజాగా 68.50 స్థాయిని చూసింది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment