ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 25.5 శాతం క్షీణించాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పడిపోవడం దీనికి కారణమని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం– 2020–21 రెండవ త్రైమాసికకాలంలో రూ.1,59,057 కోట్ల ముందస్తు పన్ను వసూళ్లు జరిగాయి. 2019–20 ఇదే కాలంలో వసూళ్ల మొత్తం రూ. 2,12,889 కోట్లు. ఇక్కడ కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే, 2020–21 తొలి త్రైమాసికం కన్నా రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు కొంత తగ్గడమే. తొలి త్రైమాసికంలో ముందస్తు పన్ను వసూళ్లు భారీగా 76 శాతం పడిపోయి కేవలం రూ.11,714 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రేరిత పరిస్థితులతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండడం ఈ పేలవ వసూళ్ల నేపథ్యం.ముందస్తు పన్ను చెల్లింపులకు సెప్టెంబర్ 15 చివరితేదీ. తాజా సమాచారంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
♦ కార్పొరేట్ చెల్లింపులు 27.3 శాతం తగ్గి రూ.1,29,620 కోట్లగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో వసూళ్లు 79 శాతం పడిపోయి, రూ.8,286 కోట్లుగా నమోదయ్యాయి.
♦ వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగం విషయంలో 15 శాతం తగ్గి రూ.29,438 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ1లో ఈ వసూళ్లు 64 శాతం తగ్గి, రూ. 3,428 కోట్లకు పడిపోయాయి.
ముందస్తు పన్నులంటే...
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చే ఆదాయాలను మదింపుచేసుకుని, నాలుగు దఫాలుగా ముందస్తు పన్ను చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. మొత్తం చెల్లించాల్సిన పన్ను అంచనాల్లో 15 శాతం మొదటి త్రైమాసికంలో చెల్లించాల్సి ఉంటుంది. 25 శాతం చొప్పున తదుపరి రెండు త్రైమాసికాల్లో చెల్లింపులు జరపాలి. నాల్గవ త్రైమాసికంలో ఈ చెల్లింపులు 35 శాతంగా ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొత్తం స్థూల పన్ను వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లు. 2019–20 వసూళ్ల కన్నా (రూ.21.63 లక్షల కోట్లు) ఇది 12 శాతం ఎక్కువ. ఇందులో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 28 శాతం పెంపుతో రూ.10.28 లక్షల కోట్ల నుంచి రూ.13.19 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పన్ను వివాద పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’కు మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం భావించడమే దీనికి కారణం. ఈ పథకం కింద సెప్టెంబర్ 8 నాటికి 35,074 ప్రత్యక్ష పన్ను సంబంధ వివాదాలు పరిష్కారం అయినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కమిషనర్ ఆఫ్ అప్పీల్స్, ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీకోర్టుసహా దేశ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల అపరిష్కృత ప్రత్యక్ష పన్ను వివాదాలు ఉండడం గమనార్హం.
కార్ల మీద జీఎస్‌టీ తక్కువే
♦ కంపెనీలే రాయల్టీలు తగ్గించుకోవాలి
♦ ఆర్థిక శాఖ వర్గాలు
వాహనాలపై జీఎస్‌టీ రేటు భారీగా ఉంటోందన్న విమర్శలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పందించాయి. జీఎస్‌టీ అమలుకు ముందు రోజులతో పోలిస్తే ప్రస్తుతం రేటు తక్కువగానే ఉందని వ్యాఖ్యానించాయి. జీఎస్‌టీ రేటు తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని అడగడం కాకుండా వాహనాల కంపెనీలు విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు రాయల్టీ చెల్లింపులను తగ్గించుకోవాలని సూచించాయి. అప్పట్లో వ్యాట్, ఎక్సైజ్ సుంకం రేటు మొదలైనవి అనేకం ఉండేవని ప్రస్తుతం అమలవుతున్న జీఎస్‌టీ రేట్లు తక్కువేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్‌పై అధిక స్థాయిలోనే పన్నులు ఉంటున్నాయని తెలిపాయి. యూరోపియన్ యూనియన్‌లో వాహనాలపై వ్యాట్/జీఎస్‌టీ 20 శాతం – 25 శాతం మధ్యలో ఉంటోందని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment