అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 11 శాతం వృద్ధి
ముంబై జోన్‌లో రూ. 69,000 కోట్లు
ముంబై: మొండి బాకీల భారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అంతంతమాత్రం చెల్లింపులు జరగడంతో ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఓ మోస్తరు వృద్ధినే నమోదు చేశాయి. టాప్ 100 కార్పొరేట్లలో 45 సంస్థలకు కేంద్రమైన ముంబై జోన్‌లో సెప్టెంబర్ 15 నాటికి.. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు కేవలం 11 శాతం వృద్ధితో రూ. 69,000 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో వసూలైన మొత్తం రూ. 62,370 కోట్లు. వసూళ్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదాయ పన్ను శాఖ.. రాబోయే రోజుల్లో పెద్ద కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చెల్లింపులు ఏకంగా 37% మేర తగ్గగా, విదేశీ సంస్థ సిటీ గ్రూప్ 34% తక్కువ చెల్లించింది. మరోవైపు చమురు దిగ్గజం హెచ్‌పీసీఎల్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ చెల్లింపులు 70% ఎగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ 10.47% అధికంగా చెల్లించింది. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మూడో వంతు ముంబై జోన్‌లోనే నమోదవుతుంటుంది. సెప్టెంబర్ 15 నాటి దాకా ఈ జోన్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 25% వృద్ధితో రూ. 96,000 కోట్ల నుంచి రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 3.16 లక్షల కోట్లు సమీకరించాలని ముంబై జోన్ లక్ష్యంగా ఉంది.
ఏప్రిల్–సెప్టెంబర్ ఆదాయ అంచనాలు ఇవ్వాలి..
కంపెనీలు, పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలు ఇంకా ఆడిటింగ్ దశలోనే ఉన్న పక్షంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు సంబంధించిన ఆదాయ అంచనాలను, కట్టాల్సిన పన్ను వివరాలను ఐటీ శాఖకు సమర్పించాల్సి రానుంది. దీనికి నవంబర్ 15దాకా గడువు లభించనుంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో చేయనున్న మార్పులపై అభిప్రాయాలు కోరుతూ కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్‌ను రూపొందించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు తగ్గిన పక్షంలో అందుకు గల కారణాలు కూడా కంపెనీలు వివరించాల్సి ఉంటుంది. దీంతో ఆయా సంస్థల ఆదాయ ధోరణులపై ఎప్పటికప్పుడు సమాచారం లభించగలదు.