నరసాపురం : బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. చాలారోజుల తరువాత బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు నెలల క్రితం రూ.30 వేలు మార్కు దాటిన బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండిదీ అదే దారి. క్రిస్మస్, సంక్రాంతి పండగళ వేళ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లకు ఇదే అనువుగా జనం భావిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జ్యూయలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు ఇంకా తగ్గొచ్చనే అంచనాలతో కొందరిలో ఇప్పుడే బంగారం కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా ? అనే సందిగ్ధం కూడా నెలకొని ఉంది. మరీ భారీగా ధరలు తగ్గవని, బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రూ.30 వేల దిగువకు బంగారం ధరలు చేరుకున్నాయి.
కాసు రూ.21,760
సోమవారం నరసాపురం గోల్డ్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.29,110గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.27,220గా నమోదైంది. అంటే ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.21,760గా ట్రేడవుతోంది. గత రెండు, మూడు నెలలుగా కాస్త అటు, ఇటుగా ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. అయితే గతవారం రోజుల నుంచి కాసు బంగారం ధరలో దాదాపు రూ.950 తగ్గుదల కనిపిస్తోంది. దీంతో కొన్ని నెలలుగా బంగారం వైపు చూడటానికి జంకిన పేద, మధ్య తరగతి వారు పండగవేళలు కూడా కావడంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కుతున్నారు. వెండి ధరల్లో అయితే ఒకరకంగా భారీ తగ్గుదల కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ.36–37 వేల మధ్య ట్రేడవుతోంది. కిలో వెండి ధర దాదాపు 3 వేల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరికాస్త తగ్గుతాయని భావిస్తున్నారు.
ఒడిదుడుకుల నుంచి గాడిలోకి..
ఐదేళ్ల క్రితం వరకూ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 2013లో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 34 వేలకు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసుకుంది. బంగారం దిగుమతి సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చైనా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను అమ్మకాలకు పెట్టడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు దిగి వచ్చాయి. ఈ దశలో గత రెండేళ్ల నుంచి బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ధరలు విపరీతంగా తగ్గుతాయని అంచనా కట్టారు. కానీ అలా జరగలేదు. ధరలు పెరగడంతో బులియన్ వ్యాపారం ఒడిదుడుకుల్లో సాగింది. కొనుగోలుదారుల్లో కూడా అయోమయం. ఎక్కువ ధరల్లో బంగారం కొన్న జిల్లావాసులు దారుణంగా నష్టపోయారు. ఇప్పుడూ అదేరకమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ధరల హెచ్చుతగ్గుల్లో స్వల్పమార్పులే ఉంటాయని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
భారీగా పెరిగిన అమ్మకాలు
ధరలు తగ్గడంతో జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఒక్క నరసాపురం మార్కెట్‌లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. జిల్లాలో ఇక్కడి నుంచి భారీగా హోల్‌సేల్ వ్యాపారం జరుగుతుంది. నరసాపురంతో పాటు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు జరుగుతాయి. ధరలు తగ్గడంతో జిల్లా మొత్తం మీద రోజుకు అదనంగా రూ.2 కోట్ల వరకు అమ్మకాలు పెరిగాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వరుస పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముందు ఉండడంతో అమ్మకాలు మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు బంగారాన్ని అనువైన పెట్టుబడిగా భావించే ముదుపర్లు కూడా బిస్కెట్ కొనుగోళ్లపై దృష్టిపెడుతున్నట్టు నరసాపురం జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి వినోద్‌కుమార్‌జైన్ తెలిపారు.
ఇప్పట్లో పెద్దగా ధరలు పెరగవు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితుల రీత్యా ధరలు పెరగవు. అలాగని ఇంకా భారీగా తగ్గే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం అమ్మకాలు బాగా పెరిగాయి. ధరలు ఇలాగే ఉంటే సంక్రాంతి నాటికి అమ్మకాలు మరింత పెరుగుతాయి. – అజిత్‌కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment