ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి.
‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు.
కొనసాగిన ఒడిదుడుకులు...
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment