‘జెట్‌’లో జోక్యం చేసుకోం | No govt intervention in commercial matters of airlines | Sakshi
Sakshi News home page

‘జెట్‌’లో జోక్యం చేసుకోం

Published Thu, Apr 4 2019 5:59 AM | Last Updated on Thu, Apr 4 2019 5:59 AM

No govt intervention in commercial matters of airlines - Sakshi

న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్‌ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు.

రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్‌కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్‌మెంట్‌కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్‌ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్‌ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది.  

బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్‌
జెట్‌ ఎయిర్‌వేస్‌కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్‌ నరేష్‌ గోయల్‌ వెల్లడించారు. జెట్‌ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి.  

ఎగురుతున్నది 28 విమానాలే..
ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్‌ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్‌ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది.

మార్చి జీతాలు వాయిదా ..
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్‌ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్‌ 9న మరోసారి అప్‌డేట్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్‌లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.  

షేరు 5 శాతం డౌన్‌..
విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్‌ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement