జీడీపీ అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) తగ్గించడం, కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. చైనాలో కరోనా వైరస్ ప్రబలుతోందన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు పతనమై 41,324 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 12,170 పాయింట్ల వద్ద ముగిశాయి.
డిమాండ్ మందగమనం...: భారత జీడీపీ గత ఏడాదికి గాను 4.8 శాతమే ఉండగలదని ఐఎమ్‌ఎఫ్ వెల్లడించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో ఒత్తిడి నెలకొన్నదని, గ్రామీణ ఆదాయ వృద్ధి బలహీనంగా ఉందని, అందుకనే వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నామని వివరించింది. ఇక ఇటీవల వెల్లడైన నిఫ్టీ సూచీలోని కొన్ని కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు సంబంధించి టెలికం కంపెనీల తాజా విన్నపాలను వచ్చే వారం విచారించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించడంతో టెలికం షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఐడియా షేర్ 21 శాతం లాభంతో రూ.5.92 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్ షేర్ 0.4 శాతం లాభంతో రూ.511 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment